Delhi : ఆరోపణలు పచ్చి అబద్ధాలు
ABN , Publish Date - Aug 12 , 2024 | 05:18 AM
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలను మాధవి పురి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ తోసిపుచ్చారు. తాము ఎన్నడూ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు లేదా రుణ పత్రాల్లో పెట్టుబడులు పెట్టలేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
మా ఆర్థిక వ్యవహారాలు తెరిచిన పుస్తకం
అదానీ గ్రూప్‌లో పెట్టుబడుల్లేవ్: సెబీ చీఫ్
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలను మాధవి పురి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ తోసిపుచ్చారు. తాము ఎన్నడూ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు లేదా రుణ పత్రాల్లో పెట్టుబడులు పెట్టలేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. హిండెన్‌బర్గ్ ఆరోపణలు పచ్చి అబద్దాలని, తమ వ్యక్తిత్వాన్ని, సెబీ విశ్వసనీయతను దెబ్బతీసేందుకే పనిగట్టుకుని ఆ సంస్థ ఈ ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.
తమ ఆర్థిక లావాదేవీలు తెరిచిన పుస్తకమని తెలిపారు. గత నెలలో సెబీ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సమాధానం దాటవేసేందుకే హిండెన్‌బర్గ్ ఈ ఆరోపణలకు దిగిందన్నారు.
సింగపూర్ ప్రైవేట్ పౌరులుగా ఉన్నపుడు తన భర్త బాల్యమిత్రుడు అనిల్ అహుజా సలహాపై రెండు ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టిన విషయం మాత్రం నిజమన్నారు. అయితే అహుజా సిటీ బ్యాంక్ నుంచి తప్పుకున్న వెంటనే తాము కూడా ఆ పెట్టుబడుల నుంచి తప్పుకున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు.
మరోవైపు సెబీ కూడా తాజా పరిణామాలపై ఒక ప్రకటన విడుదల చేసింది. తమ చీఫ్ మాధవి పురి బుచ్ తన పెట్టుబడుల వివరాలను ఎప్పటికపుడు సెబీ బోర్డుకు వెల్లడించారని తెలిపింది. తనకు, తన కుటుంబ సభ్యులకు పెట్టుబడులు ఉన్న సంస్థల అంశాలు చర్చకు వచ్చినప్పుడు.. ఆమె అసలు ఆ చర్చల్లోనే పాల్గొనే వారు కాదని స్పష్టం చేసింది.
హిండెన్ బర్గ్ పెద్ద అబద్ధాల పుట్ట
హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ ఆదివారం రెగ్యులేటరీ సంస్థలకు ఒక వివరణ ఇచ్చింది. సెబీ చీఫ్ మాధవి పురి బుచ్‌తో తమ గ్రూప్‌నకు ఎలాంటి వాణిజ్య సంబంధాలు లేవని స్పష్టం చేసింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలు పచ్చి అబద్దాలని విమర్శించింది.
ఏ మాత్రం విశ్వసనీయత లేని సమాచారం ఆధారంగా తమ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోందని తెలిపింది. వ్యక్తిగత లాభాపేక్షతోనే హిండెన్‌బర్గ్ ఈ దురాగతానికి పాల్పడుతోందని విమర్శించింది.
తమ గ్రూప్‌పై గత ఏడాది జనవరిలో ఈ సంస్థ చేసిన ఆరోపణల్లో ఏమాత్రం పస లేకపోవడం వల్లే ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు కొట్టి వేసిందని స్పష్టం చేసింది. హిండెన్‌బర్గ్ తాజా ఆరోపణలపై మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పరిశ్రమ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలు దేశ ఆర్థిక పురోగతినీ దెబ్బతీసే ముప్పు ఉందని హెచ్చరించింది.
పైసా పెట్టుబడి పెట్టలేదు: 360 వన్
బుచ్ దంపతులపై హిండెన్‌బర్గ్ ఆరోపణలపై ‘360 వన్ ఫండ్’ (గతంలో ఐఐఎ్‌ఫఎల్ వెల్త్ మేనేజ్‌మెంట్) కూడా వివరణ ఇచ్చింది. ఐపీఈ ప్లస్ ఫండ్ 1 ద్వారా సమీరించిన నిధుల్లో పైసా కూడా అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టలేదని స్పష్టం చేసింది.
ఈ ఫండ్ ద్వారా సమీకరించిన 4.8 కోట్ల డాలర్ల నిధుల్లో కేవలం ఒకటిన్నర శాతం మాత్రమే బుచ్ దంపతుల ద్వారా వచ్చినట్టు తెలిపింది. ఈ ఫండ్ నిధుల్లో 90 శాతానికిపైగా నిధులను రుణ పత్రాల్లో పెట్టుబడి పెట్టామే తప్ప, కంపెనీల షేర్లలో మదుపు చేయలేదని స్పష్టం చేసింది.
కాగా, హిండెన్‌బర్గ్ ఆరోపణల ప్రభావం సోమవారం స్టాక్ మార్కెట్‌పైనా కనిపించే ప్రమాదం కనిపిస్తోంది. మదుపరులు ప్రశాంతంగా ఉండాలని సెబీ హెచ్చరించింది. హిండెన్‌బర్గ్ సంస్థకు అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల షేర్లలో షార్ట్ పొజిషన్లు కూడా ఉండే అవకాశం ఉందని పరోక్షంగా హెచ్చరించింది.