Share News

Congress: టీఎంసీతో 'పొత్తు' పెటాకులపై కాంగ్రెస్ తొలి రియాక్షన్...

ABN , Publish Date - Mar 10 , 2024 | 04:32 PM

'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఏకపక్షంగా 42 లోక్‌సభ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఏ ఒత్తిడి కారణంగా టీఎంసీ ఈ నిర్ణయం తీసుకుందో తమకు తెలియదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ''ఎక్స్'' వేదికగా అన్నారు.

Congress: టీఎంసీతో 'పొత్తు' పెటాకులపై కాంగ్రెస్ తొలి రియాక్షన్...

న్యూఢిల్లీ: 'ఇండియా' (I.N.D.I.A.) కూటమిలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఏకపక్షంగా 42 లోక్‌సభ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఏ ఒత్తిడి కారణంగా టీఎంసీ ఈ నిర్ణయం తీసుకుందో తమకు తెలియదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ (Jairam Ramesh) ''ఎక్స్'' వేదికగా అన్నారు.


''ఎలాంటి ఒప్పందమైనా సంప్రదింపుల ద్వారా, గౌరవప్రదంగా ఖరారు కావాలని, ఏకపక్షంగా ఉండరాదని కాంగ్రెస్ పార్టీ మొదట్నించీ చెబుతోంది. బీజేపీతో ఇండియా కూటమి సమష్టిగా పోరాటం చేయాలనేది కాంగ్రెస్ కోరుకుంటోంది. పశ్చిమబెంగాల్‌లో ఇండియా బ్లాక్ బలపడాలన్నదే మా పార్టీ ఉద్దేశం. కూటమితోనే ఉన్నామని, బీజేపీని బెంగాల్‌లో ఓడించాలని మమతా బెనర్జీ పదేపదే చెబుతూ వచ్చారు. కానీ, ఇప్పుడు అన్ని లోక్‌సభ స్థానాల అభ్యర్థులను ఏకపక్షంగా ప్రకటించారు. టీఎంసీపై ఎలాంటి ఒత్తడి పనిచేసిందో నాకు తెలియదు. ఏం జరుగుతుందో చూద్దాం'' అని జైరామ్ రమేష్ వ్యాఖ్యానించారు.


'ఇండియా' బ్లాక్‌లో టీఎంసీ ఉన్నట్టేనా?

కోల్‌కతాలోని బ్రిగేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం జరిగిన టీఎంసీ ర్యాలీలో 42 మంది అభ్యర్థుల పేర్లను టీఎంసీ ప్రకటించింది. మమతా బెనర్జీ 15 నిమిషాల పాటు ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ, లెఫ్ట్, కాంగ్రెస్‌పై 42 స్థానాల్లోనూ టీఎంసీ పోటీ చేస్తోందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తుతో టీఎంసీ ఒక సీటుకు పోటీ చేస్తోందని, విపక్షంగా ఉన్న మేఘాలయలోనూ, అసోంలోనూ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు.


కాంగ్రెస్ డిమాండ్ ఏమిటి?

పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌తో పొత్తుకు కాంగ్రెస్ పట్టుదలగా సంప్రదింపులు సాగించింది. రాష్ట్రంలో 8 నుంచి 10 సీట్లను కాంగ్రెస్ పార్టీ ఆశించగా, 2 నుంచి 3 సీట్లు ఇచ్చేందుకు మాత్రమే టీఎంసీ సుముఖత వ్యక్తం చేసింది. సోలోగానే నెగ్గగలమంటూ ప్రకటించింది. మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి ఆక్షేపణ తెలపడంతో ఆమె సైతం గట్టి కౌంటర్ ఇచ్చింది. పశ్చిమబెంగాల్‌లో రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తూ తనను ఆహ్వానించలేదని ప్రతివిమర్శలు చేశారు.

Updated Date - Mar 10 , 2024 | 04:32 PM