Chhattisgarh: మావోలకు కోలుకోలేని దెబ్బ.. కేవలం 6 నెలల్లోనే..
ABN , Publish Date - Jun 15 , 2024 | 02:41 PM
Maoist Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) నారాయణపుర్‌లో(Narayanpur District) భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. శనివారం ఉదయం సమయంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు.
Maoist Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) నారాయణపుర్‌లో(Narayanpur District) భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. శనివారం ఉదయం సమయంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు. ఒక భద్రతా సిబ్బంది కూడా చనిపోయారని.. ఇద్దరు జవాన్లు గాయపడ్డారని అధికారులు ప్రకటించారు.
నారాయణపుర్, కంకేర్, దంతేవాడ, కొండగావ్ జిల్లాలకు చెందిన భద్రతా దళాలు యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో శనివారం ఉదయం సమయంలో నారాయణపూర్ జిల్లాలోని అబుజ్‌మాడ్ అడవుల్లో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని జిల్లా పోలీస్ అధికారులు తెలిపారు.
వార్ జోన్‌గా మారిన దండకారణ్యం..
ఇదిలాఉంటే దండకారణ్యం వార్ జోన్‌గా మారింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు కగార్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అబూజ్‌మడ్ అడవులే టార్గెట్‌గా జనవరి నుంచి జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. ఏప్రిల్ 16వ తేదీన జరిగిన కాంకేర్ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు చనిపోయారు. ఆ తరువాత జరిగిన కోర్చోలి ఎన్‌కౌంటర్‌లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మే 11వ తేదీన బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోలు చనిపోయారు. నారాయణపూర్ ఎన్‌కౌంటర్‌లో 10 మంది, ఇవాళ(శనివారం) నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది మృతి చెందారు.
భారీ ప్రాణ నష్టం..
వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లుతోంది. దీంతో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు మావోలు. ఆదివాసీ నివాస ప్రాంతాలపై చాపర్లతో డ్రోన్‌లతో బాంబింగ్ చేస్తున్నారని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో నరమేధం సాగిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై పౌర హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.