Tamil Nadu: గుండెపోటుతో ఎంపీ మృతి.. ఐదు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం..
ABN , Publish Date - Mar 28 , 2024 | 08:57 AM
తమిళనాడులోని ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి గుండెపోటుతో ఈ తెల్లవారుజామున మృతి చెందారు. ఐదురోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఆయన ఆసుపత్రిలో చేరారు.
తమిళనాడులోని ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి గుండెపోటుతో ఈ తెల్లవారుజామున మృతి చెందారు. ఐదురోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఎండిఎంకే(MDMK)కు చెందిన గణేశమూర్తి 2019లో ఈరోడ్ ఎంపీగా గెలిచారు. డీఎంకేతో పొత్తులో భాగంగా ఆయన ఈ సీటు నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఈరోడ్ పార్లమెంట్ స్థానం నుంచి డీఎంకే తన అభ్యర్థిని బరిలోకి దింపింది. ఈ స్థానానికి బదులు తిరుచ్చి స్థానాన్ని ఎండిఎంకేకు కేటాయించారు. దీంతో తనకు టికెట్ రాలేదని మనస్థాపం చెందిన గణేశమూర్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గణేషమూర్తిని కొయ్యంబత్తూరులోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్చారు. వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందించారు. ఇవాళ ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి మరణ వార్త తెలుసుకున్న తమిళనాడు పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి ఎస్ ముత్తుసామి, మోదకురిచ్చి బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ సీ సరస్వతి, అన్నాడీఎంకే నేత కేవీ రామలింగం సహా పలువురు రాజకీయ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారు.
జమ్మూకశ్మీర్‌లో ఏఎఫ్‌ఎస్‌పీఏ ఉపసంహరణ?
మూడుసార్లు ఎంపీగా..
మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన గణేశమూర్తి ఎండీఎంకే శ్రేణుల్లో ముఖ్య నాయకుడిగా ఉన్నారు.ఈ ఎన్నికల్లో పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. డీఎంకే ఈరోడ్ స్థానానికి బదులు ఎండీఎంకెకు తిరుచ్చి స్థానాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. దీంతోMDMK ప్రధాన కార్యదర్శి వైకో కుమారుడు దురై వైకోను తిరుచ్చి ఎంపీ అభ్యర్థిగా ఎండీఎంకె ప్రకటించింది. తమిళనాడులోని 30 పార్లమెంట్ స్థానాలకు తొలిదశలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తైంది.
సీఎం సంతాపం
ఎంపీ గణేశమూర్తి మృతి పట్ల తమిళనాడు సీఎం స్టాలిన్, అన్నాడీఎంకే నేత, మాజీ సీఎం పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలైతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..