NTA : నీట్ నిర్వహణలో అడుగడుగునా లోపాలు
ABN , Publish Date - Jun 22 , 2024 | 04:37 AM
‘నీట్’ పరీక్ష నిర్వహణలో అడుగడుగునా లోపాలున్నాయని థర్డ్ పార్టీ రివ్యూలో తేలింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 4 వేల కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
186 పరీక్ష కేంద్రాల్లో కరువైన సీసీ టీవీ పర్యవేక్షణ
16% కేంద్రాల్లో ప్రశ్నపత్రాలుంచే గదులకు భద్రతలేమి
మళ్లీ పరీక్ష కోసం సుప్రీంలో తెలంగాణ అభ్యర్థి పిటిషన్
వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ ఎన్‌టీఏకి ఆదేశం
1563 మంది అభ్యర్థులకు రేపు 7 కేంద్రాల్లో నీట్ పరీక్ష
హైదరాబాద్‌లో విద్యార్థి యువజన సంఘాల ఆందోళన
జాయింట్ సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ పరీక్ష వాయిదా
పలు పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల్లేవు.. ప్రశ్నపత్రాలు ఉంచే
గదులకు భద్రత కరువు
న్యూఢిల్లీ, జూన్ 21: ‘నీట్’ పరీక్ష నిర్వహణలో అడుగడుగునా లోపాలున్నాయని థర్డ్ పార్టీ రివ్యూలో తేలింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 4 వేల కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రివ్యూలో భాగంగా వాటిలో 399 కేంద్రాల్లో థర్డ్ పార్టీ పరిశీలకులు తనిఖీలు చేశారు. నిబంధనల ప్రకారం.. నీట్ పరీక్ష జరిగే ప్రతి గదిలోనూ పనిచేసే రెండు సీసీ కెమెరాలు ఉండాలి. ఆ సీసీ కెమెరాలను ఢిల్లీలోని ఎన్‌టీఏ ప్రధాన కార్యాలయంలోని సెంట్రల్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి.. అక్కడున్న నిపుణులు పర్యవేక్షిస్తారు.
కానీ.. థర్డ్ పార్టీ తనిఖీ చేసిన 399 సెంటర్లకు గాను 186 కేంద్రాల్లోని (46%) తరగతి గదుల్లో పనిచేసే సీసీ కెమెరాలు లేవు. అలాగే, ప్రశ్నపత్రాలను ఉంచే స్ట్రాంగ్ రూములకు గార్డులతో పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేయాల్సి ఉండగా.. 68 కేంద్రాల్లో (16%) అలాంటి ఏర్పాట్లు కనిపించలేదని వెల్లడైంది. 83 కేంద్రాల్లో.. ఉండాల్సిన బయోమెట్రిక్ సిబ్బందికి బదులుగా వేరే వ్యక్తులు ఉన్నట్టు గుర్తించారు. కాగా.. నీట్ కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. నీట్ నిర్వహణలో జరిగిన అక్రమాల నేపథ్యంలో.. ఆ పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టితో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.
ఈ పిటిషన్‌ను కూడా.. జూలై 8న చేపట్టే మిగతా పిటిషన్లతో కలిపి విచారిస్తామని స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై స్పందన తెలపాలని కేంద్రానికి జాతీయ టెస్టింగ్ ఏజెన్సీకి (ఎన్‌టీఏ) నోటీసులిచ్చింది. అయితే, విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది.. జూలై 6 నుంచి నిర్వహించతలపెట్టిన నీట్ కౌన్సెలింగ్‌ను రెండు రోజులపాటు వాయిదా వేసేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. మొత్తం నీట్ పిటిషన్లన్నీ కలిపి 8వ తేదీన విచారించాలని ధర్మాసనం నిర్ణయించినందున, అప్పటిదాకా వాయిదా కోరుతున్నట్టు వివరించారు. ఈ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.
మళ్లీ రాయనివ్వండి ప్లీజ్..
‘హైపర్ హైడ్రోసి్‌స’(విపరీతంగా చెమటలు పట్టడం) అనే ఆరోగ్య సమస్య కారణంగా తాను మే 5న జరిగిన నీట్ పరీక్ష సరిగ్గా రాయలేకపోయానని.. 1563 మంది విద్యార్థులకు మళ్లీ జూన్ 23న పరీక్ష నిర్వహించడానికి ఎన్‌టీఏ సిద్ధమైనందున.. తనకు కూడా ఆరోజు మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పించాలంటూ హైదరాబాద్‌కు చెందిన ఒక విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణకు స్వీకరించింది. ఎగ్జామ్ సెంటర్‌లోకి కర్చీ్‌ఫను కూడా తీసుకెళ్లనివ్వలేదని.. దీనివల్ల తన క్లయింట్ పరీక్షా కేంద్రంలో పెన్నును సరిగ్గా పట్టుకోలేకపోయాడని విద్యార్థి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో.. ఆ విద్యార్థి అభ్యర్థనపై ఏదో ఒక నిర్ణయం తీసుకుని, (శుక్రవారం) సాయంత్రం నాలుగు గంటల్లోగా అతడికి ఆ విషయాన్ని తెలుపాలని కోర్టు ఎన్‌టీఏను ఆదేశించింది. ఇదిలా ఉండగా, 1563 మంది అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను ఉపసంహరించుకుని, వారికి మళ్లీ పరీక్ష పెడతామని కోర్టుకు తెలిపిన ఎన్‌టీఏ.. అందుకు ఏర్పాట్లు చేసింది. మేఘాలయ, హరియాణా, ఛత్తీ్‌సగఢ్, గుజరాత్, చండీగఢ్‌లోని కేంద్రాల్లో.. రకరకాల కారణాల వల్ల వీరందరికీ పరీక్ష రాయడం ఆలస్యమైంది. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఏడు కేంద్రాల్లో ఆదివారం పరీక్ష నిర్వహించనున్నట్టు ఎన్‌టీఏ అధికారి ఒకరు తెలిపారు.
నిరసనల వెల్లువ..
నీట్, యూజీసీ-నెట్ పరీక్షల నిర్వహణలో అవకతవకలు, ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో.. విద్యార్థి సంఘాలు, విపక్షాలూ వరుసగా రెండోరోజు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. నీట్ పేపర్ లీక్ అంశాన్ని పార్లమెంటులో తాను లేవనెత్తుతానని ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ, ఆయన మంత్రుల చేతగానితనం కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. ‘‘గడిచిన ఏడేళ్లలో 70 పేపర్లు లీకయ్యాయి. రెండు కోట్ల మంది యువత ఆ లీకుల వల్ల నష్టపోయారు’’ అని రాహుల్ ఆ వీడియోలో అన్నారు. బీజేపీ పాలనలో పేపర్‌లీక్‌లు జాతీయ సమస్యగా మారాయని కాంగ్రెస్ నేత ప్రియాంక మండిపడ్డారు.