Lok Sabha Elections: నాలుగో దశ పోరులో నువ్వా - నేనా..!
ABN , Publish Date - May 13 , 2024 | 04:11 AM
లోక్‌సభ ఎన్నికల నాలుగో దశలో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమియేతర పార్టీలపైనే పరిశీలకుల దృష్టి ప్రధానంగా ఉంది. త్రిశంకు సభ (హంగ్ పార్లమెంటు) ఏర్పడిన పక్షంలో (నెల రోజుల క్రితం కంటే ఇది ఇప్పుడు సంభావ్య పరిణామంగా కనిపిస్తోంది) ప్రభుత్వం ఏర్పాటులో ఈ ‘అలీన’ పార్టీలే కీలక పాత్ర వహించనున్నాయి.
లోక్‌సభ ఎన్నికల నాలుగో దశలో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమియేతర పార్టీలపైనే పరిశీలకుల దృష్టి ప్రధానంగా ఉంది. త్రిశంకు సభ (హంగ్ పార్లమెంటు) ఏర్పడిన పక్షంలో (నెల రోజుల క్రితం కంటే ఇది ఇప్పుడు సంభావ్య పరిణామంగా కనిపిస్తోంది) ప్రభుత్వం ఏర్పాటులో ఈ ‘అలీన’ పార్టీలే కీలక పాత్ర వహించనున్నాయి. మొదటి మూడు దశల ఎన్నికలపై విశ్లేషణలలో మేము సూచించినట్లు ఆ మూడు దశల్లో ఎన్డీఏ 40 సీట్లను కోల్పోయే అవకాశముంది. నాలుగో దశలో ఆ నష్టం మరింతగా వాటిల్లకుండా అడ్డుకట్ట వేసేందుకు ఎన్డీఏ కృతనిశ్చయంతో ఉంది. అంతేకాకుండా ఉత్తరాది, మధ్య భారత రాష్ర్టాలలో సంభవించే నష్టాలను ఉభయ తెలుగురాష్ర్టాలలో భర్తీ చేసుకొనే అవకాశముంది. నాలుగో దశలో ఎన్నికలు జరగనున్న 96 నియోజక వర్గాలలో దాదాపు సగం ఉభయ తెలుగు, రాష్ర్టాలు, ఒడిషాలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైఎ్‌సఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒడిషాలో బిజూ జనతాదళ్ (బీజేడీ), తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఫలితాలను నిర్ణయించనున్నాయి.
మొత్తంగా, ప్రస్తుతం ఎన్డీఏకు ఉన్న 49స్థానాల్లో 42 బీజేపీవి కాగా మిగతా 7 దాని మిత్రపక్షాలవి. ఈ స్థానాలలో అత్యధికం యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఉన్నాయి. 2019లో ఇండియా కూటమి ఈ స్థానాలలో 12 మాత్రమే గెలుచుకోగలిగింది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు సమస్థాయిలో ఆ స్థానాలు దక్కాయి. ఇక మిగిలిన 35 స్థానాలలో 32 ను ‘అలీన’ పార్టీలు స్వాయత్తం చేసుకున్నాయి. వాటిలో 32 ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నాయి. 2019 అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఈ బలాబలాలను పెద్దగా మార్చలేదు. లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న ఆంధ్ర, ఒడిషాలో మినహా మిగతా రాష్ర్టాలలో ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో వేసినట్టుగానే ఈ నాలుగో దశ పోలింగ్ లో కూడా ఓటు వేసినపక్షంలో ఎన్డీఏకు ప్రస్తుతమున్న 49 కి అదనంగా మరేమీ దక్కవు. ఇండియా కూటమి మరో 10 స్థానాలను అదనంగా గెలుచుకునే అవకాశముంది. దీనితో దాని స్థానాల సంఖ్య 22కు పెరుగుతుంది. ఇక ఏ కూటమితో నూ సంబంధం లేని పార్టీల సంఖ్యా బలం 35 నుంచి 25కు తగ్గిపోనుంది.
ఇక ఇప్పుడు రాష్ర్టాల వారీ ఎన్నికల పోరాటాలపై దృష్టి సారిద్దాం. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు మరోసారి ఏకకాలంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ 2019లో అటు లోక్ సభ, ఇటు అసెంబ్లీ స్థానాల్లో ఐదింట నాలుగో వంతు సీట్లను సాధించుకుంది. అయితే ప్రస్తుత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీలతో కూడిన కూటమి నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. రాష్ట్ర పాలక పక్షం ప్రధానంగా తన సంక్షేమ పథకాలపై ఆధారపడుతోంది. ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి ప్రజల్లో తీవ్రంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు పెట్టుకుంది. రాజధాని వివాదం, కుల సమీకరణాలు, ముఖ్యంగా జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ సొంత సామాజిక వర్గం కాపుల మద్దతు తమకు విశేష లబ్ధి సమకూర్చగలవని ఎన్డీఏ విశ్వసిస్తోంది.
పాలక వైసీపీకి గ్రామీణ ప్రాంతాల్లోను, దక్షిణ రాయలసీమలోను ప్రజాదరణ ఉండగా, టీడీపీ జనసేన- బీజేపీ కూటమికి పట్టణ ప్రాంతాలలోను, ఉత్తరాంధ్రలోను జనబలం బాగా ఉంది. 2019 ఎన్నికలలో సాధించుకున్న ఓట్ల ప్రాతిపదికన చూస్తే, ఈ మూడు పార్టీల కూటమికి ప్రస్తుత లోక్ సభ ఎన్నికలలో 7 సీట్లు అదనంగా లభిస్తాయి. ఈ కూటమికి ప్రస్తుతం ఉన్న 3 సీట్లూ తెలుగుదేశం పార్టీవే. ఎన్డీఏది పైచేయి కావాలంటే 2019లో వచ్చిన ఓట్లకంటే అదనంగా 3.1 శాతం రావాలి. అంతకుమించిన ఓట్ల మొగ్గు సాధించగలిగితే ఈ మూడు పార్టీలకు అది ప్రభంజనం వంటి విజయం అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ చాలా బలహీనంగా ఉంది. 2019లో ఒక శాతం కంటే తక్కువ ఓట్లే సాధించుకున్నప్పటికీ ప్రస్తుత లోక్ సభ ఎన్నికలలో నాలుగో వంతు స్థానాలలో పోటీ చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ ఆంధ్రలో తన పూర్వ వైభవాన్ని పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌కు ఓట్ల లబ్ధి సమకూరినా సీట్ల లబ్ధి కలిగే సూచనలు లేవు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో లభించిన విజయాలను మరింతగా పటిష్ఠం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్నికల హామీలను దాదాపుగా అమలుపరిచినందున ఓటర్లు తమకే ఓటు వేస్తారని కాంగ్రెస్ విశ్వసిస్తోంది. చాలా నియోజక వర్గాలలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉంది. బీజేపీ తరపున పోటీ చేస్తున్న వారిలో మూడింట రెండు వంతుల మంది బీఆర్‌ఎస్ నుంచి ఇటీవలే బీజేపీలో చేరినవారే. బీఆర్‌ఎస్ నుంచి తమ పార్టీలోకి ఫిరాయించిన అభ్యర్థుల పలుకుబడి, ఆర్థిక బలం తమకు విశేష లబ్ధిని సమకూర్చనున్నాయని బీజేపీ భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో గ్రామీణ ప్రాంతాలలో మంచి ఫలితాలు సాధించిన కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ లో చతికిల బడింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని, వారిని లోక్‌సభకు పోటీ చేయిస్తోంది. ప్రస్తుత ఎన్నికలలో ముస్లిం ఓటర్ల మద్దతు కాంగ్రెస్‌కు విశేషంగా మేలు చేయనుంది. మొత్తం మీద కాంగ్రెస్ గత సార్వత్రిక ఎన్నికలలో గెలుచుకున్న మూడు సీట్లకంటే అదనంగా గణనీయమైన స్థానాలను స్వాయత్తం చేసుకోనుంది. బీజేపీ సైతం తన పాత బలానికి అదనంగా రెండు సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది. మజ్లిస్ తన ఏకైక స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. బీఆర్‌ఎస్ ఒకటి లేదా రెండు సీట్లను గెలుచుకోగలుగుతుంది.
ఒడిషాలో నాలుగు లోక్‌సభ, 28 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. బిజూజనతాళ్ కు, బీజేపీ రెండిటికీ విజయావకాశాలు గణనీయంగా ఉన్నాయి. ఈ తూర్పు రాష్ట్రంలో ఇదే మొదటిదశ. మొదటి విడత పోలింగ్ జరగనున్న మరో రాష్ట్రం జార్ఖండ్ లో నాలుగు లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు స్థానాలలో మూడు ఎస్టీ (సింగ్ భమ్, ఖుంటి, లొహర్ దాగ), ఒకటి ఎస్సీలకు రిజర్వ్ అయినవి. ఇండియా కూటమి తదుపరి దశలలో మంచి ఫలితాల సాధించాలంటే ఈ నాలుగు స్థానాలనూ గెలుచుకోవలసి ఉంది. ప్రజాదరణ బాగా ఉన్న ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌ను కేంద్రం అరెస్ట్ చేసి జైలుకు పంపినందున ఆయన పట్ల వ్యక్తమవుతున్న సానుభూతి తమకు లబ్ధి సమకూర్చగలదని ఇండియా కూటమి విశ్వసిస్తోంది.
ఇండియా కూటమి అదనపు సీట్లు గెలుచుకునే అవకాశాలు పశ్చిమ బెంగాల్ లో బాగా ఉన్నాయి. మధ్యప్రదేశ్, బిహార్ లో కూడా ప్రతిపక్ష కూటమి అదనపు సీట్లు సాధించుకునే అవకాశమున్నది. ఇప్పుడు ఎన్నికలు జరగనున్న 8 స్థానాలలో ఐదింటిని ఇండియా కూటమి, మూడింటిని బీజేపీ 2019లో గెలుచుకున్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రాతిపదికన చూస్తే తృణమూల్ కాంగ్రెస్ గతంలో కంటే మరో మూడు సీట్లను అదనంగా గెలుచుకునే అవకాశముంది.
బిహార్‌లో ఎన్నికలు జరగనున్న ఐదు సీట్లు మిథిల ప్రాంతంలో ఉన్నాయి. 2019లో ఇండియా కూటమి ఈ ప్రాంతంలో ఒక్క సీటునూ గెలుచుకోలేక పోయింది. గత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల ప్రాతిదికన చూస్తే ఈ ఐదు సీట్లలో కేవలం ఒక్కటి మాత్రమే కాంగ్రెస్ గెలుచుకునే అవకాశముంది. మరో రెండు మూడు శాతం ఓట్లు అదనంగా సమకూరితేనే ఎన్డీఏపై ఇండియా కూటమిది పై చేయి అయ్యే అవకాశముంది. మధ్య ప్రదేశ్‌లో నాలుగో దశ ఎన్నికలు జరగనున్న ప్రాంతాలలో మాళ్వా కూడా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో సాధించుకున్న ఓట్ల బలాన్ని నిలుపుకోవడంతో పాటు, ఇండియా భాగస్వామ్య పక్షమైన ఆప్ ఓట్లు కూడా సమకూరితే కాంగ్రెస్‌కు ఈ సారి రెండు ఎస్టీ సీట్లు లభించే అవకాశముంది. ఓట్ల శాతం మరి కొంచెం పెరిగితే మరో స్థానం కూడా కాంగ్రెస్‌కు దక్కే అవకాశం మెండుగా ఉంది.
ఉత్తర్‌ప్రదేశ్ లోని 13, మహారాష్ట్రలోని 11 నియోజక వర్గాలలో నాలుగో దశ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ రెండు రాష్ర్టాలలోను ఇండియా కూటమికి విజయావకాశాలు మెరుగ్గా లేవు. యూపీలోని 13 స్థానాలనూ 2019లో బీజేపీనే స్వాయత్తం చేసుకున్నది. 2022 అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఆ నియోజక వర్గాలలో మంచి ఫలితాలను సాధించింది. అయితే బీజేపీ తన 13 మంది ఎంపీలలో 11 మందిని మాత్రమే తిరిగి నిలబెట్టింది. ఈ చర్య పట్ల సంబంధిత నియోజక వర్గాల ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో కంటే 2 శాతం ఓట్లు తక్కువగా వచ్చిన పక్షంలో ప్రస్తుత ఎన్నికలలో బీజేపీకి 4 స్థానాలు తగ్గుతాయి. గతంలో కంటే 3 శాతం ఓట్లు తక్కువగా వస్తే 6 సీట్లను బీజేపీ కోల్పోవలసివస్తుంది. మహారాష్ట్రలో సైతం ఇండియా కూటమికి లబ్ధి సమకూరదని 2019 ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న మరఠ్వాడా, ఎగువ పశ్చిమ మహారాష్ట్ర, ఉత్తర మహారాష్ట్రలోని 11 స్థానాల్లో 9ని గత ఎన్నికలలో బీజేపీ, అవిభక్త శివసేన సాధించుకున్నాయి. జలగావ్, రావెర్, జల్నా, అహ్మద్ నగర్, పూణే, బీడ్ నియోజకవర్గాలు బీజేపీకి కంచుకోటలు కాగా నందుర్బార్, శిర్డి, ఔరంగాబాద్‌లో బీజేపీ అవకాశాలను ఇండియా కూటమి దెబ్బ తీసే అవకాశముంది. ఏది ఏమైనా మహారాష్ట్రలో ప్రస్తుత దశలో ఇండియా కూటమికి చెప్పుకోదగ్గ విజయాలు లభించవనేది స్పష్టం. మొత్తం మీద ఈ నాలుగో దశలో పాలక, ప్రతిపక్ష కూటములకు విజయాలు సమస్థాయిలో లభించనున్నాయి. పరస్పర బలాబలాలపై పెద్దగా ప్రభావం లేకుండా ‘అలీన’ ప్రాంతీయ పార్టీలకు స్వల్ప నష్టం చేస్తూ తాము పరిమితంగా ప్రయోజనం పొందగలమని ఎన్డీఏ, ఇండియాలు ఆశిస్తున్నాయి.
(వ్యాసకర్త జాతీయ కన్వీనర్, భారత్ జోడో అభియాన్)
(శ్రేయాస్ సర్దేశాయ్, రాహుల్ శాస్త్రి సహకారంతో)
లోక్‌సభ ఎన్నికల నాలుగో దశలో పాలక ఎన్డీఏ, ప్రతిపక్ష ‘ఇండియా’ కూటములు సమ ఉజ్జీలుగా నిలవనున్నాయి.
త్రిశంకు (హంగ్) సభ ఏర్పడిన
పక్షంలో ప్రభుత్వం ఏర్పాటులో
ఉభయ కూటములకు చెందని ప్రాంతీయ పక్షాలు కీలక పాత్ర నిర్వహిస్తాయి.