Share News

Majority Votes in Haryana: హర్యానాలో మెజార్టీపై అదంతా అబద్ధం.. ఇదే నిజం

ABN , Publish Date - Oct 09 , 2024 | 12:44 PM

ఫలితాల తర్వాత గెలిచిన అభ్యర్థుల్లో ఎక్కువమంది 500, వెయ్యి ఓట్ల మెజార్టీలోపు గెలిచారని, ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల అభ్యర్థుల ఓట్ల చీలికతోనే ఫలితాలు తారుమారయ్యాయనే ప్రచారం జరుగుతోంది. మెజార్టీ తక్కువ ఉన్న కారణంగానే సర్వే సంస్థల అంచనాలు తలకిందులయ్యాయనే చర్చ బలంగా వినిపిస్తోంది. కానీ ఎన్నికల సంఘం తుది ఫలితాలను ప్రకటించిన తర్వాత ..

Majority Votes in Haryana: హర్యానాలో మెజార్టీపై అదంతా అబద్ధం.. ఇదే నిజం
Haryana Results

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సర్వే సంస్థల అంచనాలను తారుమారు చేశాయి. అంతేకాదు ఎవరూ ఊహించని తీర్పును హర్యానా ఓటర్లు ఇవ్వడంతో ప్రస్తుతం చర్చంతా హర్యానా ఫలితాలపైనే జరుగుతోంది. 50కిపైగా స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని సర్వే సంస్థలు అంచనా వేసినా.. 37 సీట్లకే పరిమితమైంది. బీజేపీ 30 సీట్లు సాధించడం కష్టమని ఎగ్జిట్‌ పోల్స్ అంచనా వేయగా అధికారానికి అవసరమైన మెజార్టీ మార్క్ 46ను దాటి 48 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఇక ఆప్ ఖాతా తెరవలేదు. ఇండిపెండెంట్లు 3 స్థానాల్లో, ఐఎన్‌ఎల్‌డి రెండు స్థానాల్లో విజయం సాధించింది. ఫలితాల తర్వాత గెలిచిన అభ్యర్థుల్లో ఎక్కువమంది 500, వెయ్యి ఓట్ల మెజార్టీలోపు గెలిచారని, ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల అభ్యర్థుల ఓట్ల చీలికతోనే ఫలితాలు తారుమారయ్యాయనే ప్రచారం జరుగుతోంది. మెజార్టీ తక్కువ ఉన్న కారణంగానే సర్వే సంస్థల అంచనాలు తలకిందులయ్యాయనే చర్చ బలంగా వినిపిస్తోంది. కానీ ఎన్నికల సంఘం తుది ఫలితాలను ప్రకటించిన తర్వాత ఇదంతా అవాస్తవమని తేలిపోయింది. ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని పార్టీలతో పాటు మరికొంతమంది హర్యానాలో గెలిచిన అభ్యర్థుల మెజార్టీ చాలా స్వల్పంగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇదంతా అవాస్తవమని తుది ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. హర్యానాలో గెలిచిన అభ్యర్థుల మెజార్టీ ఎలా ఉంది. వెయ్యిలోపు మెజార్టీతో గెలిచిన అభ్యర్థులు ఎంతమందో తెలుసుకుందాం.

‌కాంగ్రెస్‌కు నో ఎంట్రీ బోర్డు!


బీజేపీ నుంచి ఒకరు.. కాంగ్రెస్ నుంచి ఒకరు..

హర్యానాలో 90 నియోజకవర్గాలు ఉండగా వెయ్యిలోపు మెజార్టీతో గెలిచిన అభ్యర్థులు ముగ్గురు మాత్రమే. వీరిలో కాంగ్రెస్ నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఒకరు, ఐఎన్‌ఎల్‌డి నుంచి మరొకరున్నారు. అదే వెయ్యి నుంచి రెండు వేల మధ్య మెజార్టీతో గెలిచిన అభ్యర్థులు ఐదుగురు మాత్రమే. అంటే వెయ్యికంటే ఎక్కువ మెజార్టీతో గెలిచిన అభ్యర్థులు 87 మంది. కేవలం ముగ్గురు మాత్రమే వెయ్యిలోపు ఆధిక్యంతో గెలుపొందారు. ఉచన కలన్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి దేవేందర్ చతర్ భుజ్ అత్రి 32 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి బ్రిజేంద్ర సింగ్‌పై గెలుపొందారు. బీజేపీ నుంచి గెలుపొందిన 48 మందిలో రెండువేల కంటే తక్కువ ఆధిక్యంతో గెలిచిన అభ్యర్థులు ఇద్దరు కాగా.. వెయ్యి కంటే తక్కువ ఆధిక్యంతో ఒకరు మాత్రమే గెలిచారు. బీజేపీ నుంచి 46 మంది అభ్యర్థులు వెయ్యి కంటే ఎక్కువ మెజార్టీని సాధించారు. లోహరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రాజ్‌బిర్ ఫర్తీయా బీజేపీ అభ్యర్థి జయప్రకాశ్ దలాల్‌పై 792 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మరో నలుగురు కాంగ్రెస్ అభ్యర్థులు వెయ్యి నుంచి రెండు వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మిగతా 32 మంది రెండు వేల కంటే ఎక్కువ ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఐఎన్‌ఎల్‌డి నుంచి గెలిచిన ఇద్దరు అభ్యర్థుల్లో దబ్వాలి నుంచి గెలుపొందిన ఆదిత్య దేవిలాల్ 610 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. దీంతో ఓటర్లు తమ నియోజకవర్గాల్లో ఎవరిని గెలిపించాలో ముందే డిసైడ్ అయినట్లు ఎన్నికల ఫలితాలను చూస్తే స్పష్టమవుతోంది. ఒక్కో నియోజకవర్గంలో ఓటర్లు ఒక్కో విధంగా ఆలోచించి ఓటు వేసినట్లు తెలుస్తోంది. పార్టీలకంటే అభ్యర్థుల ఆధారంగానే ఓటరు తన ఓటు వేసినట్లు హర్యానా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీ వేవ్‌ ప్రకారం ఎన్నికలు జరిగిఉంటే ఒక పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉండేది. అభ్యర్థుల ఆధారంగా ఓటర్లు తీర్పు ఇవ్వడంతోనే ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో ఫలితం వచ్చినట్లు తెలుస్తోంది.

ఓట్ల కుస్తీలో ఫొగట్‌ పట్టే ‘పట్టు’


మెజార్టీలపై అసత్య ప్రచారం..

ఎన్నికల్లో ఒక ఓటుతో గెలిచినా ఎమ్మెల్యేగా ఎన్నికవుతారు. గెలిచిన తర్వాత మెజార్టీతో పని ఉండదు. కానీ హోరాహోరీ పోరు జరిగితే మాత్రం మెజార్టీ తక్కువుగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ హర్యానాలో రెండు వేల ఓట్ల కంటే ఎక్కువ మెజార్టీతోనే 82 మంది గెలవడం ద్వారా ఓటర్లు ఎంత స్పష్టంగా ఓటు వేశారనే విషయం అర్థమవుతోంది. ఇండిపెండెంట్లు, ఇతర పార్టీలు పెద్దగా ప్రభావం చూపించలేదు. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల మెజార్టీ కంటే ఆప్, జేజేపీ, ఇండిపెండెంట్లు కలిపి సాధించిన ఓట్లు తక్కువుగానే ఉన్నాయి. ఈ లెక్కల ప్రకారం చూస్తే ఓట్ల చీలిక పెద్దగా ప్రభావం చూపించలేదనే విషయం స్పష్టమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Srinagar : ప్రజాస్వామ్యం గెలిచింది

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 09 , 2024 | 12:44 PM