Congress: ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన కీలక నేతలు
ABN , Publish Date - Jan 06 , 2024 | 11:44 AM
హర్యానా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు నిర్మల్ సింగ్ మోహ్రా, చిత్ర సర్వారా కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్యానా కాంగ్రెస్ ఇన్‌చార్జ్ దీపక్ బబారియా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాన్ సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
హర్యానా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు నిర్మల్ సింగ్ మోహ్రా, చిత్ర సర్వారా కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్యానా కాంగ్రెస్ ఇన్‌చార్జ్ దీపక్ బబారియా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాన్ సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భూపీందర్ సింగ్ హుడా, ఎంపీ దీపేందర్ సింగ్ హుడా కూడా పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీగా తరలివచ్చిన తన మద్దతుదారులతో కలిసి నిర్మల్ సింగ్ కాంగ్రెస్‌లో చేరారు. కాగా గతంలో హస్తం పార్టీలోనే ఉన్న నిర్మల్ సింగ్ 2019లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. తిరిగి మళ్లీ పాత గూటికే చేరుకోవడం గమనార్హం. అయితే ప్రస్తుతం ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆప్ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆప్ నేతలు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో మున్ముందు ఇండియా కూటమిలో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఇది ఇండియా కూటమిలోని పార్టీల మధ్య ఉన్న సత్సబంధాలను దెబ్బ తీసే అవకాశాలున్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదే విషయమై సీఎల్పీ నేత భపీందర్ సింగ్ హుడా మాట్లాడుతూ ఆప్‌తో ఇంకా సీట్ల పొత్తుపై చర్చ జరగలేదని తెలిపారు. ‘‘ఇండియా కూటమికి ఇది మంచి బలమైన ముందడుగు. కానీ ప్రతిపక్ష కూటమిలోని మిత్ర పక్షాల మధ్య ఇంకా సీట్ల పంపకాలపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రజాస్వామ్యంలో అధికార, ప్రతిపక్షాలు రెండూ బలంగా ఉండాలి. కొన్ని పరిష్కారాల తర్వాతనే సీట్ షేరింగ్ గురించి మాట్లాడుతాం. మా మొదటి ప్రాధాన్యత పార్లమెంట్ ఎన్నికలే. అప్పుడే అసెంబ్లీ ఎన్నికలపై కూడా నిర్ణయం తీసుకుంటాం.’’ అని తెలిపారు. నిర్మల్ సింగ్‌ను కాంగ్రెస్‌లో ఆహ్వానించిన దీపక్ బబారియా ఆయనలో కాంగ్రెస్ డీఎన్‌ఏ ఉందని చెప్పుకొచ్చారు. నిర్మల్ సింగ్‌తో తన అనుబంధం 1970 నాటిదని, తామిద్దరం యూత్ కాంగ్రెస్‌లో పని చేసినట్టు తెలిపారు. నిర్మల్ సింగ్ హర్యానా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేసినట్టు చెప్పారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మల్ సింగ్ రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. హర్యానా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వైస్ ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల 2019లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. అలాగే ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరిన చిత్ర కూడా గతంలో హర్యానా మహిళా కాంగ్రెస్ నాయకురాలిగా పనిచేశారు. కాగా గత ఏడాదిన్నర కాలంలో హర్యానా కాంగ్రెస్‌లో చేరిన 37వ మాజీ శాసనసభ్యుడు నిర్మల్ సింగ్ అని కాంగ్రెస్ నేత ఉదయ్ భాన్ తెలిపారు.