Share News

ISRO : జాబిల్లిపై మట్టిని తెచ్చేద్దాం..!

ABN , Publish Date - Aug 23 , 2024 | 03:52 AM

చంద్రయాన్‌-3 ఘన విజయం తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన తదుపరి మూన్‌ మిషన్లు చంద్రయాన్‌-4, 5పై దృష్టిపెట్టింది.

ISRO : జాబిల్లిపై మట్టిని తెచ్చేద్దాం..!

  • చంద్రయాన్‌-4 మిషన్‌ లక్ష్యం అదే

  • జపాన్‌తో కలిసి చంద్రయాన్‌-5 ప్రాజెక్టు

  • ఇస్రో తదుపరి మూన్‌ మిషన్లపై ఆసక్తి

న్యూఢిల్లీ, ఆగస్టు 22: చంద్రయాన్‌-3 ఘన విజయం తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన తదుపరి మూన్‌ మిషన్లు చంద్రయాన్‌-4, 5పై దృష్టిపెట్టింది. ఈ రెండు మిషన్లకు సంబంధించిన డిజైన్లు పూర్తయ్యాయని ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ తాజాగా ప్రకటించారు. ఈ మిషన్లు అంతరిక్ష అన్వేషణలో వేగంగా విస్తరిస్తున్న భారతదేశ పాత్రను తెలియజేయనున్నాయి.

ఈ నేపథ్యంలో చంద్రయాన్‌-4, 5 లక్ష్యాలు ఏమిటి..? అంతరిక్ష పరిశోధనల్లో అవి ఎలాంటి పాత్రను పోషించనున్నాయి..? అనే అంశాలు ఆసక్తిగా మారాయి.

చంద్రయాన్‌-4: ఇస్రో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో చంద్రయాన్‌ కీలకమైనది. గత ఏడాది చేపట్టిన చంద్రయాన్‌-3 విజయవంతం కావడంతో భారత్‌ చరిత్ర సృష్టించింది. దానికి కొనసాగింపుగా చేపడుతున్న ప్రాజెక్టు చంద్రయాన్‌-4. ఈ ప్రయోగాన్ని 2028లో నిర్వహించాలనేది ఇస్రో లక్ష్యం. జాబిల్లి ఉపరితలంపై నుంచి శిలలు, మట్టి నమూనాలను సేకరించి సమగ్ర విశ్లేషణ కోసం వాటిని భూమికి తీసుకురావడం ఈ మిషన్‌ ప్రధాన లక్ష్యం. చంద్రయాన్‌-4లో ల్యాండ ర్‌, అసెండర్‌, ట్రాన్స్‌ఫర్‌ మాడ్యూల్‌, రీ ఎంట్రీ మాడ్యూల్‌ వంటి కీలక భాగాలు ఉంటాయి.


ల్యాండర్‌: చంద్రుడి ఉపరితలాన్ని తాకేలా రూపొందించిన ల్యాండర్‌లో రోబోటిక్‌ చేయి ఉంటుంది. ఇది చంద్రుడి ఉపరితలంపై నుంచి నమూనాలను సేకరిస్తుంది.

అసెండర్‌: జాబిల్లి ఉపరితలంపై సేకరించిన నమూనాలను చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్లే బాధ్యతను అసెండర్‌ తీసుకుంటుంది.

ట్రాన్స్‌ఫర్‌ మాడ్యూల్‌: అసెండర్‌ తీసుకొచ్చిన నమూనాలను ఈ ట్రాన్స్‌ఫర్‌ మాడ్యూల్‌ రీ ఎంట్రీ మాడ్యూల్‌కు తరలిస్తుంది.

రీ ఎంట్రీ మాడ్యూల్‌: చంద్రుడిపై సేకరించి న శాంపిళ్లను భూమిపైకి చేరుస్తుంది.

చంద్రయాన్‌-5: జపాన్‌ స్పేస్‌ ఏజెన్సీ (జాక్సా)తో కలిసి ఇస్రో చేపట్టే మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-5. దీనిద్వారా జాబిల్లిపై శాశ్వత నీడ ఉండే మంచు ప్రాంతాలను అన్వేషించనున్నారు. ఈ మిషన్‌లో ఇస్రో రూపొందించిన ల్యాండర్‌తోపాటు జపాన్‌ అభివృద్ధి చేసిన 350 కిలోల రోవర్‌ కీలక పాత్ర పోషిస్తాయి. చంద్రుడి పై సవాళ్లతో కూడిన ప్రాంతాలను అన్వేషించడానికి వీలుగా వీటిని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నారు.

Updated Date - Aug 23 , 2024 | 03:52 AM