NDA: మోదీకి కొత్త తలనొప్పి.. కీలక శాఖలపై జేడీయూ కన్ను..
ABN , Publish Date - Jun 06 , 2024 | 12:55 PM
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో కేంద్రంలో సంకీర్ణ సర్కార్ అనివార్యమైంది. దీంతో బిహార్‌లో అధికారంలో ఉన్న జేడీయూ, ఏపీలో త్వరలో ప్రభుత్వ పగ్గాలు చేపట్టనున్న టీడీపీ మద్దతు బీజేపీకి(BJP) తప్పనిసరి. మిత్ర పక్షాల మద్దతు కావాలంటే వారు కోరిన పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో కేంద్రంలో సంకీర్ణ సర్కార్ అనివార్యమైంది. దీంతో బిహార్‌లో అధికారంలో ఉన్న జేడీయూ, ఏపీలో త్వరలో ప్రభుత్వ పగ్గాలు చేపట్టనున్న టీడీపీ మద్దతు బీజేపీకి(BJP) తప్పనిసరి. మిత్ర పక్షాల మద్దతు కావాలంటే వారు కోరిన పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ద్వయానికి ఈ పరిణామం తలనొప్పిగా మారింది. వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దని భావిస్తున్న బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar).. కేంద్రంలోని కీలక మంత్రిత్వ శాఖలపై కన్నేశారు.
బుధవారం ఎన్డీఏ(NDA) పక్షాల సమావేశంలో జేడీయూ.. రైల్వే, ఆర్థిక, వ్యవసాయ మంత్రిత్వ శాఖలను కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రభుత్వంలో కీలకంగా ఉండే ఈ శాఖలపై నితీశ్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై బీజేపీ అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఇదే సమయంలో నితీశ్ నివాసానికి జేడీయూ నేతలు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు.
టీడీపీ డిమాండ్లపై ఆసక్తి..
కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు బుధవారం దేశ రాజధానిలో జరిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ సమావేశంలో పాల్గొన్న అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తమ పార్టీ ఎన్డీయేతోనే ఉందని తేల్చి చెప్పారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేయగా.. టీడీపీకి 16 సీట్లు, జనసేనకు 2, బీజేపీ 3 సీట్లు వచ్చాయి.
ఈ సారి బీజేపీ మెజారిటీ భారీగా తగ్గి, ఇండియా కూటమి ప్రభావం చాలా పెరిగింది. దీంతో బీజేపీకి మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేబినెట్‌లో నితీశే అన్ని కీలక పదవులు అడిగితే, నితీశ్ కంటే 4 ఎక్కువ పార్లమెంటు సీట్లు సాధించిన బాబు ఎన్ని పదవులు అడుగుతారోనని ఆసక్తికరంగా మారింది. ఒకరకంగా చెప్పాలంటే బీజేపీ సైతం ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. సొంతంగా 350కిపైగా సీట్లు సాధించి, మిత్రపక్షాలతో కలిపి 400 సీట్లు గెలుస్తామని భావించిన ఆపార్టీ సంకట పరిస్థితే ఎదుర్కుంటోందని చెప్పుకోవచ్చు.
Read Latest National News and Telugu News