Haryana: ఇరకాటంలో హరియాణా సర్కార్.. బీజేపీ ప్రభుత్వం కూలిపోతుందా?
ABN , Publish Date - May 08 , 2024 | 12:53 PM
స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో హరియాణాలోని(Haryana) బీజేపీ సర్కార్ మైనారిటీలో పడిన విషయం తెలిసిందే. ఈ పరిణామంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
ఛండీగఢ్: స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో హరియాణాలోని(Haryana) బీజేపీ సర్కార్ మైనారిటీలో పడిన విషయం తెలిసిందే. ఈ పరిణామంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. తాజా రాజకీయాలపై జననాయక్ జనతా పార్టీ(JJP) నేత దుష్మంత్ చౌతలా బుధవారం స్పందించారు. బీజేపీ శాసనసభాపక్షం నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వంపై బలపరీక్షకు రమ్మంటే.. తమ పార్టీ బీజేపీకి(BJP) వ్యతిరేకంగా ఓటు వేస్తుందని దుష్మంత్ తెలిపారు.
"బీజేపీ ప్రభుత్వం పడిపోతే.. వారు వేరే పార్టీ ఎమ్మెల్యేల మద్దతు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. మా నిర్ణయం ప్రకటించాం. ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చింది. ఆ పార్టీ ఏం చేస్తుందో చూద్దాం. విప్‌కు అధికారం ఉన్నంత వరకు మేం బయటి నుంచి మద్దతు ఇస్తాం. విప్ ఆదేశాల మేరకే మా ఎమ్మెల్యేలు ఓటు వేస్తారు. ఇవాళే బలపరీక్ష నిర్వహిస్తే, జేజేపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు" అని దుష్యంత్ అన్నారు.
దూరమైన ఎమ్మెల్యేలెవరంటే..
స్వతంత్ర ఎమ్మెల్యేలు సోంబీర్ సంగ్వాన్, రణధీర్ గొల్లెన్, ధరంపాల్ గొండెర్‌లు బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని వారు ప్రకటించారు.
‘‘ప్రభుత్వానికి మా మద్దతును ఉపసంహరించుకుంటున్నాం. కాంగ్రెస్‌కు మా మద్దతును తెలుపుతున్నాం. రైతుల సమస్యతో పాటు, ఇతర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని ప్రకటించారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరించుకోవడంతో నాయబ్‌సింగ్(Nayab Singh Saini) ప్రభుత్వం మైనారిటీలో పడిందని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం పడిపోతుందా?
హరియాణా బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడింది. దాని అర్థం ప్రభుత్వం కూలిపోతుంది అని కాదు. 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్న హరియాణాలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 40 సీట్లు, కాంగ్రెస్ 31, జేజేపీ 10 సీట్లు గెలుచుకుంది. ఐఎన్ఎల్డీ 1, హెచ్ఎల్పీ 1, స్వతంత్రులు 7 మంది గెలుపొందారు. మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వంపై శాసన సభలో మార్చి 12న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.
ఖట్టర్ మెజారిటీ నిరూపించుకోకపోవడంతో బీజేపీ ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ ప్రమాణం చేశారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం.. రెండు అవిశ్వాస పరీక్షల మధ్య 6 నెలల గ్యాప్ ఉండాలి. మార్చిలో అవిశ్వాస పరీక్ష జరగడంతో ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరో పరీక్ష జరగాల్సి ఉంటుంది. అయితే అప్పటికే ప్రస్తుత ప్రభుత్వ గడువు ముగుస్తుంది. దీనికితోడు అక్టోబర్ - నవంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అంటే రాబోయే ఎన్నికల వరకు బీజేపీ ప్రభుత్వం సురక్షితంగానే ఉంటుందన్నమాట. బీజేపీ నుంచి నేతలు ఎవరైనా బయటకి వస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది.
Read Latest National News and Telugu News