Share News

J&Kashmir Elections: జమ్మూ కశ్మీర్‌లో చోటు చేసుకోనున్న భారీ మార్పులివే..!

ABN , Publish Date - Aug 16 , 2024 | 05:27 PM

Jammu and Kashmir Election Schedule: దేశంలో మరో ఎన్నికల నగారా మోగింది. జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. శుక్రవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 3వ తేదీతో హర్యానా అసెంబ్లీ పదవీ కాలం..

J&Kashmir Elections: జమ్మూ కశ్మీర్‌లో చోటు చేసుకోనున్న భారీ మార్పులివే..!
Jammu and Kashmir Elections

Jammu and Kashmir Election Schedule: దేశంలో మరో ఎన్నికల నగారా మోగింది. జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. శుక్రవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 3వ తేదీతో హర్యానా అసెంబ్లీ పదవీ కాలం ముగియనుండగా.. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత ఇప్పటి వరకు జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో ఇప్పుడు జమ్మూ కశ్మీర్‌ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్రం ఎన్నికల సంఘం. అయితే, జమ్మూ కశ్మీర్ ఎన్నికలు ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారాయి. ఎన్నికలు నిర్వహిస్తే.. ఇప్పటి నుంచి జమ్మూ కశ్మీర్‌లో చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయి. మరి ఆ మార్పులు ఏంటో ఓసారి చూద్దాం..


10 ఏళ్లలో జరిగిన మార్పులేంటి?

జమ్మూకశ్మీర్‌లో చివరిసారిగా 2014లో ఎన్నికలు జరిగాయి. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి నుంచి రాష్ట్రంలో ఎన్నికలు జరగలేదు. పదేళ్ల తర్వాత ఇక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ 10 ఏళ్లలో జమ్మూ కాశ్మీర్‌లో చాలా మార్పులు చోటు చేసుకుంది. రాష్ట్రం నుండి కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. లడఖ్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో భాగం కాదు. అయితే, సమైక్య రాష్ట్రంలో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక అంతకు ముందు ప్రభుత్వ పదవీకాలం 6 సంవత్సరాలు. కానీ, ఇప్పుడు 5 సంవత్సరాలు మాత్రమే ఉండనుంది.


అసెంబ్లీ లెక్క ఇదీ..

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. రాష్ట్ర హోదా రద్దు చేసిన తర్వాత అసెంబ్లీ రూపురేఖలు కూడా మారిపోయాయి. జమ్మూ కాశ్మీర్‌లో మొత్తం 114 సీట్లు ఉన్నాయి. అందులో 24 పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ఉన్నాయి. అంటే 90 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. 90లో 43 సీట్లు కాశ్మీర్‌ డివిజన్‌‌లో.. 47 జమ్మూ డివిజన్‌‌లో ఉన్నాయి. గత ఎన్నికల్లో 87 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. గతంలో లేని 16 సీట్లను కూడా ఇప్పుడు రిజర్వ్ చేశారు. వీటిలో 7 ఎస్సీ, 9 ఎస్టీలకు కేటాయించారు.


2014 ఎన్నికల ఫలితాలివే..

జమ్మూ కాశ్మీర్‌లో 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 87 స్థానాలకు పోలింగ్ జరిగింది. వీటిలో పీడీపీ 28 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 25 సీట్లు గెలుచుకుంది. నేషనల్ కాన్ఫరెన్స్ 15 సీట్లు, కాంగ్రెస్ 12 సీట్లు, ఇతర పార్టీలు 7 సీట్లు గెలుచుకున్నాయి. ఓటింగ్ శాతం విషయానికి వస్తే పీడీపీకి గరిష్టంగా 23 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీకి కూడా 23 శాతం ఓట్లు పోలయ్యాయి. నేషనల్ కాన్ఫరెన్స్‌కు 21 శాతం, కాంగ్రెస్‌కు 18 శాతం ఓట్లు వచ్చాయి.


లోక్‌సభ ఎన్నికల ఫలితాలు..

జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 5 స్థానాలకు పోలింగ్ జరిగింది. వీటిలో బీజేపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌లు చెరో రెండు స్థానాలు గెలుచుకోగా, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు. బీజేపీకి 24 శాతం, నేషనల్ కాన్ఫరెన్స్‌కు 22 శాతం, కాంగ్రెస్‌కు 19 శాతం, పీడీపీకి 8 శాతం ఓట్లు వచ్చాయి.


ప్రధాన పార్టీల పోటీ..

జమ్మూ కశ్మీర్‌లో బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్, డీపీఏపీ మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఇక కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. జమ్మూ కశ్మీర్‌లో మూడు విడతల్లో పోలింగ్ జరుగనుంది.

జమ్మూ కశ్మీర్ ఎన్నికల షెడ్యూల్, ఇతర వివరాలు..

  • మూడు విడతల్లో జమ్మూకాశ్మీర్ ఎన్నికలు.

  • జమ్మూకాశ్మీర్‌లో 90 అసెంబ్లీ స్థానాలు.

  • జమ్మూకాశ్మీర్ ఒకటో విడత సెప్టెంబర్ 18(24 స్థానాలు).

  • జమ్మూకాశ్మీర్ రెండో విడత సెప్టెంబర్ 25(26 స్థానాలు).

  • జమ్మూకాశ్మీర్ మూడో విడత అక్టోబర్ 1(40స్థానాలు).

  • అక్టోబర్ 4న జమ్మూ కశ్మీర్ ఫలితాలు.

For More National News and Telugu News..

Updated Date - Aug 16 , 2024 | 05:27 PM