Share News

Congress Govt : ‘ఉచిత బస్సు’పై పునరాలోచన

ABN , Publish Date - Nov 02 , 2024 | 02:39 AM

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంశంపై పునరాలోచన చేస్తామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ అన్నారు.

Congress Govt : ‘ఉచిత బస్సు’పై పునరాలోచన

  • కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌

  • డీకే వ్యాఖ్యలపై ఖర్గే తీవ్ర అసంతృప్తి

బెంగళూరు, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంశంపై పునరాలోచన చేస్తామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ అన్నారు. టికెట్‌ కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, డబ్బులు ఇస్తున్నా కండక్టర్లు తీసుకోవడం లేదని పలువురు మహిళలు తనకు మెయిల్‌ చేస్తున్నారని, అందుకే ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రివర్గంలో చర్చించి పునరాలోచన చేస్తామని తెలిపారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. కాంగ్రెస్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఇందిరాగాంధీ వర్ధంతి సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం సిద్దరామయ్య దీనిపై స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఐదు గ్యారెంటీలూ కొనసాగుతాయని, శక్తి గ్యారెంటీపై పునరాలోచన చేసే ఆలోచన ఏదీ లేదని సీఎం స్పష్టం చేశారు. డీకే వ్యాఖ్యలపై ఖర్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పథకాల అమలులో ఏమాత్రం వెనుకడుగు వేయరాదని, ఐదు గ్యారెంటీలు అమలు కావాల్సిందేనని అన్నారు. మరోవైపు, శక్తి పథకాన్ని పునఃసమీక్షించే అంశంపై తన ప్రకటనను వక్రీకరించారని డీకే శివకుమార్‌ అన్నారు. ‘పార్టీ అధిష్ఠానం ఏం చెబితే దాన్ని పాటిస్తాం. నా ప్రకటనను వక్రీకరించారు. పథకాన్ని పునఃసమీక్షించాలని కొందరు సూచించారని మాత్రమే చెప్పాను. పథకాలను నిలిపివేసే ప్రసక్తే లేదు. బీజేపీ దీనిపై రాజకీయం చేయాలనుకుంటోంది’ అని డీకే ఆరోపించారు.

Updated Date - Nov 02 , 2024 | 02:45 AM