Lok Sabha Elections: మోదీని సాగనంపడం ఖాయం.. అఖిలేష్‌తో సంయుక్త సమావేశంలో ఖర్గే
ABN , Publish Date - May 15 , 2024 | 03:42 PM
'ఇండియా' కూటమి జూన్ 4న కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ఇంతవరకూ పూర్తయిన నాలుగు విడతల పోలింగ్‌లో విపక్ష కూటమి స్ట్రాంగ్ పొజిషన్‌లో నిలిచిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సాగనంపడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
లక్నో: 'ఇండియా' కూటమి జూన్ 4న కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ధీమా వ్యక్తం చేశారు. ఇంతవరకూ పూర్తయిన నాలుగు విడతల పోలింగ్‌లో విపక్ష కూటమి స్ట్రాంగ్ పొజిషన్‌లో నిలిచిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సాగనంపడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడటానికి ఈ ఎన్నికలు చాలా కీలకమని వ్యాఖ్యానించారు. మల్లికార్జున్ ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ లక్నోలో బుధవారంనాడు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
"దేశ భవిష్యత్తు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి మనమంతా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యం లేకపోతే అరాచకత్వం, నియంతృత్వం రాజ్యమేలుతుంది. బీజేపీకి చెందిన బడానేతలు ఎక్కడ పోటీచేసినా అక్కడ విపక్ష నేతలను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఒక ఘటన చూశాను. బీజేపీకి చెందిన మహిళా అభ్యర్థిని ఒకరు బురఖాలు తొలగించి మహిళల ఐడెంటిటీని తనిఖీ చేశారు. దీనిని స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు నిర్వహించడమని అంటారా?'' అని ఖర్గే ప్రశ్నించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పేద ప్రజలకు ప్రతినెలా 10 కిలోల ఉచిత రేషన్ అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలకు తాము అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. ఐదు కిలోల రేషన్ ఇస్తున్నామంటూ కొందరు మాట్లాడుతున్నారని, అసలు ఆహార భద్రతా చట్టం తెచ్చిందే తామని గుర్తు చేశారు. ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 10 కిలోల రేషన్ ఇవ్వడం ఖాయమన్నారు. కర్ణాటక, తెలంగాణలో తాము ఇచ్చిన హామీలను అమలు చేశామని చెప్పారు.
Lok Sabha Elections 2024: పీఓకే మనదే, వెనక్కి తెస్తాం: అమిత్‌షా
యూపీలో 79 సీట్లు ఇండియా కూటమికే..
జూన్ 4వ తేదీతో పత్రికా స్వేచ్ఛకు స్వర్ణయుగం రానుందని, ఇందుకు మీడియాకు అభినందనలు తెలియచేయాలని అనుకుంటున్నానని అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీ ప్రతికూల కథనాలతో తనంత తానుగా ఉచ్చులో చిక్కుకుందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమి 79 సీట్లు గెలుచుకోవడం ఖాయమని, కేవలం ఒక్క సీటులోనే పోటీ ఉందని చెప్పారు.
Read Latest National News and Telugu News