Share News

Manmohan Singh: జీడీపీ వృద్ధిలో ఉరకలు

ABN , Publish Date - Dec 27 , 2024 | 05:50 AM

అనిశ్చితితో అతలాకుతలమై.. దివాలా అంచులకు చేరుకున్న భారత ఆర్థిక రంగానికి తన సంస్కరణలతో ఊతమిచ్చిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్‌ సింగ్‌..! పరిశ్రమల స్థాపనలో ‘లైసెన్స్‌ రాజ్‌’ సంస్కృతికి చరమగీతం పాడి.. సరళీకరణలతో పెట్టుబడులకు దోహదపడ్డ అపర చాణక్యుడాయన..!

Manmohan Singh: జీడీపీ వృద్ధిలో ఉరకలు

ఎల్‌పీజీ సంస్కరణలు సమర్థంగా అమలు

  • దివాలా స్థాయి నుంచి.. దేశాన్ని గట్టెక్కించిన ఆర్థికవేత్త

  • ప్రధానిగా తనదైన శైలిలో పథకాలు ఆర్టీఐ, ఉపాధిహామీ, ఆహార భద్రత వంటి.. కీలకమైన చట్టాల అమలు

న్యూఢిల్లీ, డిసెంబరు 26: అనిశ్చితితో అతలాకుతలమై.. దివాలా అంచులకు చేరుకున్న భారత ఆర్థిక రంగానికి తన సంస్కరణలతో ఊతమిచ్చిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్‌ సింగ్‌..! పరిశ్రమల స్థాపనలో ‘లైసెన్స్‌ రాజ్‌’ సంస్కృతికి చరమగీతం పాడి.. సరళీకరణలతో పెట్టుబడులకు దోహదపడ్డ అపర చాణక్యుడాయన..! ప్రైవేటీకరణ, ప్రపంచీకరణలతో భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మన్మోహన్‌ సేవలను ప్రపంచ దేశాలు ఇప్పటికీ గుర్తిస్తాయి..! 90లలో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ(ఎల్‌పీజీ) సంస్కరణలతో.. భారత్‌ను ముందుకు తీసుకెళ్లిన మార్గదర్శకుడిగా ఆర్థికరంగంపై ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. అంతేనా..! ప్రధానిగా భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటును ఉరకలు పెట్టించారు. ఆయన హయాంలో చాలా సందర్భాల్లో జీడీపీ 7.7-8.5 వృద్ధిని నమోదు చేసుకోవడం గమనార్హం..!


1991 వరకు నెలకొన్న అతలాకుతల పరిస్థితులతో స్వతంత్ర భారతదేశంలో తీవ్ర సంక్షోభంతో.. అత్యంత గడ్డుకాలం ఎదురైంది. దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల కోసం ఆందోళనలు.. అయోధ్య వివాదం, బాబ్రీ మసీదు కూల్చివేత, తదనంతర మతోన్మాద అల్లర్లు.. కశ్మీర్‌ లోయలో ఉగ్రవాద అగ్నికీలల్లో హాహాకారాలు.. పంజాబ్‌లో ఉగ్రవాదుల దారుణాలు.. ఇలా దేశంలో ఆర్థిక కార్యకలాపాలు కుంటుపడ్డాయి. విదేశీ మారక నిల్వలు ఆవిరవుతూ.. దిగుమతులకు మూడువారాలకు సరిపడ నిల్వలే మిగిలాయి..! భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) బంగారు నిల్వలను కుదవ పెట్టినా.. ఎన్నిరోజులు గడుస్తాయో తెలియని పరిస్థితులు..? ఆ సమయంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు అనూహ్యంగా మన్మోహన్‌సింగ్‌ను ఆర్థిక మంత్రిగా నియమించారు. ఆ నిర్ణయమే.. దేశ ఆర్థిక స్థితి దశ-దిశలను మార్చేశాయి.


1982-85 కాలంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) గవర్నర్‌గా.. ఆ తర్వాత ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా భారత ఆర్థిక వ్యవస్థపై తనదైన ముద్ర వేసిన మన్మోహన్‌.. భారత్‌లో పరిస్థితులను తన సంస్కరణలతో సమర్థంగా గాడిలో పెట్టారు. పంచవర్ష ప్రణాళికల్లో భాగంగా గొప్ప కార్యక్రమాలను అమలు చేసినా.. సామ్యవాద విధానాలతో పేదరికం, నిరుద్యోగం, ఆకలి కేకలు తగ్గకపోవడంతో.. ఎల్‌పీజీ సంస్కరణల వైపు ఆయన మొగ్గుచూపారు. ఆర్‌బీఐ వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెడితే తప్ప పూటగడవని స్థితిలో.. దివాలా స్థితిలో అపంశయ్యపై ఉన్న దేశాన్ని గట్టెక్కించడానికి ఆయన అమలు చేసిన సంస్కరణలు..

  • లైసెన్స్‌ రాజ్‌ను రద్దు చేసి.. 4 రంగాలు మినహా, మిగతా వాటిల్లో పరిశ్రమల ఏర్పాటు విధానాన్ని సరళీకరించారు. ఫలితంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎ్‌ఫడీఐ) వరుసకట్టాయి. దేశంలో విదేశీ మారకనిల్వల వృద్ధి మొదలైంది.

  • ఎల్‌పీజీ సంస్కరణలతో నిరుద్యోగం కొంతవరకు తగ్గడమే కాకుండా.. పెట్టుబడులు పెరిగాయి.

  • మారకం రేటులో దిద్దుబాటు జరిగి.. భారత కరెన్సీ హెచ్చుతగ్గులు నియంత్రణలోకి వచ్చాయి.

  • ఉత్పాదక రంగంలో ప్రపంచంతో భారత్‌ పోటీపడడం మొదలైంది.

  • ఈ చర్యలతో 1991 నాటికి 100 కోట్ల డాలర్లు కూడా భారత విదేశీ మారక నిల్వలు.. 1995 నాటికి వెయ్యి కోట్ల డాలర్లకు చేరుకున్నాయి.


మన్మోహన్‌ హయాంలో వచ్చిన ఇతర కీలక పథకాలు, విధానాలు, చట్టాలు..

పీఎ్‌ఫఆర్డీఏ చట్టం; కంపెనీల చట్టం; అటవీ హక్కుల చట్టం ; ప్రత్యక్ష నగదు బదిలీ పథకం(డీబీటీ); జీరో బ్యాలెన్స్‌ బ్యాంకు ఖాతాలు; ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏకీకరణ; జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌(ఆశా); నేషనల్‌ అర్బన్‌ రెన్యువల్‌ మిషన్‌; నేషనల్‌ హార్టికల్చర్‌ మిషన్‌; వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌ కమిటీల సంస్కరణలపై నమూనా చట్టం; నేషనల్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ మిషన్‌ అండ్‌ కార్పొరేషన్‌; విలువ ఆధారిత పన్ను(వ్యాట్‌) అమలు.. తదనంతర కాలంలో జీఎస్టీ ప్రతిపాదనలు; సెక్యూరిటీలపై లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్‌ రద్దు. స్టాక్‌ ఎక్స్చేంజ్‌ల డీమ్యూటలైజేషన్‌; కిరాణా వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎ్‌ఫడీఐ); బొగ్గు గనుల్లో ప్రైవేటుకు అనుమతి; పెట్రోల్‌, డీజిల్‌పై సబ్సిడీల రద్దు; జెండర్‌ బడ్జెట్‌; జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌; పటిష్ఠమైన విదేశాంగ విధానం


ప్రధానిగా చెరగని ముద్ర

2004-14 మధ్య కాలంలో మన్మోహన్‌ రెండు సార్లు వరుసగా ప్రధానిగా పనిచేశారు. ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా, ఆర్థికమంత్రిగా పనిచేసిన అనుభవంతో.. ఆయన ప్రధానిగా తన హయాంలో జీడీపీ వృద్ధికి దోహదపడేలా ఆర్థిక సంస్కరణలు, ప్రభుత్వ పథకాలను పరిచయం చేశారు.

  • భారత్‌-అమెరికా మధ్య అణు ఒప్పందం: నాన్‌ ప్రొలిఫరేషన్‌ ట్రీటీ(ఎన్‌పీటీ)లో భారత్‌ సంతకం చేయకున్నా.. అమెరికా అణు ఒప్పందం కుదుర్చుకోవడం మన్మోహన్‌ హయాంలో జరిగిన కీలక విజయం. అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జిబు్‌షతో కలిసి.. మన్మోహన్‌ ఈ ఒప్పందంపై ప్రకటన చేశారు. దీని ప్రకారం భారత్‌ తన అణు కార్యకలాపాలను రెండుగా విభజిస్తుంది. అవి: సైన్య, పౌర సంబంధమైనవి. పౌర సంబంధ అణు కార్యకలాపాలను అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ(ఐఏఈఏ) పరిధిలోకి తీసుకువచ్చారు.

  • విద్యా హక్కు చట్టం: 14 ఏళ్ల లోపు బాలలకు నిర్బంధ ఉచిత విద్యను అందించడమే ఈ చట్టం లక్ష్యం. ఇందుకోసం మన్మోహన్‌ సర్కారు రాజ్యాంగ సవరణ చేసి, ప్రాథమిక హక్కుల్లో విద్యను ఒక హక్కుగా చేర్చారు.

  • సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ): మన్మోహన్‌ సర్కారు తీసుకువచ్చిన విప్లవాత్మక చట్టాల్లో ఆర్‌టీఐ అత్యంత కీలకమైనది. ఈ చట్టంతో ప్రభుత్వంలో జవాబుదారీ పెరగడమే కాకుండా.. ప్రజలకు సమాచారం అందుబాటులో ఉంటుంది. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో అప్పిలేట్‌ అథారిటీలను ఏర్పాటు చేశారు.

  • జాతీయ ఆహార భద్రత చట్టం: 2013లో వచ్చిన ఈ చట్టంతో దేశ జనాభాలో మూడింట రెండొంతుల మందికి సబ్సిడీతో కూడిన నిత్యావసరాలను అందజేయడం ప్రారంభమైంది. విద్యార్థులకు బడుల్లో మధ్యాహ్న భోజన పథకం, సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్‌), ప్రసూతి హక్కులు, అంగన్‌వాడీల ద్వారా మాతాశిశు సంరక్షణకు పౌష్ఠికాహారాన్ని అందజేయడం వంటి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

  • ఉపాధి హామీ పథకం: ఉపాధి హామీ కూడా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఓ చట్ట బద్ధమైన హక్కుగా మారింది. దీని ద్వారా సొంత ఊరిలోనే పౌరులకు 100 రోజుల పని దొరుకుతుంది.

  • ఆధార్‌: పౌరుల గుర్తింపు కోసం అందరూ పాస్‌పోర్టు తీసుకోలేరు. దీంతో.. ఆధార్‌ను పరిచయం చేశారు. యూఐడీఏఐ ద్వారా దేశంలోని ప్రతి పౌరుడికి ఒక విశిష్ట సంఖ్యతో గుర్తింపు కార్డుల జారీని ప్రారంభించారు. తదనంతర కాలంలో ఆధారం చట్టం అమల్లోకి వచ్చింది.

  • పంటల బీమా: ఆరుగాలం కష్టించి పండించిన పంట.. అతివృష్టి, అనావృష్టితో దెబ్బతింటే.. రైతన్నలకు తీరని నష్టం వాటిల్లుతుంది. దీంతో.. ఫసల్‌ బీమా పేరుతో మన్మోహన్‌ సర్కారు పథకాన్ని ప్రారంభించింది. తదనంతర కాలంలో ఈ బీమాను మరింత మెరుగుపరిచారు.

    39.jpg


అగ్నిపరీక్షలో పీవీ దన్ను!

  • భారత్‌ను గట్టెక్కించిన ‘ఆర్థిక’ బంధం ఏరికోరి మన్మోహన్‌ను నియమించిన పీవీ

నాడు దేశం దివాలా అంచున ఉంది.. ఆర్థిక పరిస్థితి పూర్తిగా కునారిల్లింది.. రాజకీయంగానూ అస్థిరత.. ఈ స్థితిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించింది. పీవీ నరసింహారావు మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలంటే.. ఆర్థిక సంస్కరణలు అవసరం.. వాటిని ముందుకు నడిపేందుకు పీవీ ఏరికోరి మన్మోహన్‌సింగ్‌ను ఆర్థిక మంత్రిగా నియమించుకున్నారు. నాటి నుంచి ప్రారంభమైన బంధం.. పీవీ మరణానంతరం వరకు కొనసాగింది. యాదృచ్ఛికంగా ఆర్థిక మంత్రి అయిన మన్మోహన్‌సింగ్‌.. 2004లో అంతే యాదృచ్ఛికంగా ప్రధాని అయ్యారు. నాడు పీవీ సంపూర్ణ మద్దతుతో ప్రారంభించిన సంస్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లారు. పీవీతో తనది ‘ఆర్థిక’ బంధమని అంటుండేవారు. పార్లమెంటు ఉభయసభల్లో మన్మోహన్‌ సంస్కరణలను ఎవరు ఆక్షేపించినా పీవీ ఆయనకు దన్నుగా నిలిచారు. 1990-91 లో పీవీ-మన్మోహన్‌ జోడీ వచ్చేనాటికి భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు 600 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. ద్రవ్య లోటు నానాటికీ క్షీణిస్తుండడం.. ద్రవ్యోల్బణం డబుల్‌ డిజిట్‌కు చేరడం.. విదేశీ రుణాలు పతాకస్థాయికి చేరడంతో ప్రభుత్వానికి, సామాన్యుడికి కూడా ఊపిరాడని పరిస్థితి. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో మన్మోహన్‌-పీవీ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇవి.. అంతర్జాతీయ పోటీ మార్కెట్లో భారతీయ ఉత్పత్తులకు అవకాశం దక్కేందుకు రూపాయి విలువ తగ్గింపు, విదేశీ మారక నిల్వలు పెంచుకోవడానికి బంగారం తాకట్టు పెట్టడం. ఈ నిర్ణయాలను కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌, పీవీ కేబినెట్‌లోనే ఉన్న అర్జున్‌సింగ్‌ గట్టిగా వ్యతిరేకించారు. అయితే బీజేపీ అగ్ర నేత, నాటి ప్రతిపక్ష నేత వాజపేయి మద్దతివ్వడంతో పీవీ-మన్మోహన్‌ ధైర్యంగా ముందుకెళ్లారు. 1996లో కాంగ్రెస్‌ ఓటమి తర్వాత పీవీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని, అనంతరం లోక్‌సభలో ప్రతిపక్ష నేత పదవిని కోల్పోయినా.. వారి మధ్య సత్సంబంధాలు కొనసాగాయి. పీవీ చేపట్టిన సంస్కరణల వల్లే కాంగ్రెస్‌ నాశనమైందని ఆ పార్టీ సీనియర్లు బహిరంగంగానే విమర్శలు చేసినా ఈయన మాత్రం పట్టించుకోలేదు. తర్వాత్తర్వాత రాజకీయంగా పీవీని కాంగ్రెస్‌ ఏకాకిని చేసింది. పీవీ పలు కేసులను ఎదుర్కొన్నారు. జేఎంఎం ముడుపుల కేసులో 2000 అక్టోబరులో కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించినప్పుడు.. ఆయన కేబినెట్‌లో పనిచేసిన ఒక్క కాంగ్రెస్‌ నేత కూడా పరామర్శించలేదు. అయితే మన్మోహన్‌ ఒక్కరే ఆయన నివాసానికి వెళ్లి మాట్లాడి వచ్చారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ గెలిచాక నాటి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ మన్మోహన్‌ను ప్రధానిని చేశారు. ఆ ఏడాది మే 22న ఆయన ప్రధానిగా ప్రమాణం చేశారు. తన రాజకీయ గురువు పీవీ అని పార్లమెంటులోనే ఆయన ప్రకటించడం గమనార్హం. అదే ఏడాది డిసెంబరు 23న పీవీ మరణించినప్పుడు మన్మోహన్‌ ఎంతో దుఃఖించారు.

- సెంట్రల్‌ డెస్క్‌


దేశ గతిని మార్చిన 1991 బడ్జెట్‌

  • ఆర్థిక సంస్కరణల అమలుకు బాటలు

కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక సంస్కరణలతో ప్రవేశపెట్టిన 1991-92 బడ్జెట్‌ దేశ గతిని మార్చింది. అప్పటి వరకూ దశాబ్దాల తరబడి 3.5శాతంగా కొనసాగుతున్న వృద్ధి రేటును పరుగులు పెట్టించడానికి దోహదపడింది. భారతదేశ కొత్త ఆర్థిక వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన మైలురాయిగా దీన్ని పేర్కొంటారు. ‘సమయం వచ్చినప్పుడు ఒక ఆలోచనను ఈ భూమి మీద ఏ శక్తీ ఆపలేదు’ అంటూ ఫ్రెంచ్‌ తత్వవేత్త విక్టర్‌ హ్యూగో మాటలను ఆనాటి బడ్జెట్‌ ప్రసంగంలో మన్మోహన్‌ ప్రస్తావించారు. భారత్‌ ప్రపంచ శక్తిగా, ఆర్థిక శక్తిగా మారడానికి సమయం ఆసన్నమైందని, దీన్నెవరూ ఆపలేరని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. 1991 జూలై 24న మన్మోహన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ దేశంలో ఆర్థిక సంస్కరణలకు బాటలు వేసింది. ఓపెన్‌ ఎకానమీలో ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించి, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించాలని నిర్ణయించడంతో కంపెనీలకు పర్మిట్‌ రాజ్‌ నుంచి విముక్తి లభించింది. ఎగుమతులను ప్రోత్సహించడం, దిగుమతి లైసెన్స్‌లు సడలించడం లక్ష్యంగా ఆనాటి బడ్జెట్‌లో మన్మోహన్‌ పలు మార్పులు ప్రకటించారు. ఎగుమతి-దిగుమతి విధానంలో విదేశీ పెట్టుబడులను స్వాగతించారు. 1991 బడ్జెట్‌ను కేవలం నెల రోజుల్లోనే మన్మోహన్‌ సింగ్‌ సిద్ధం చేయడం విశేషం. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆర్థిక సంస్కరణల ఫలాలు కనిపించడం మొదలైంది. విదేశీ పెట్టుబడులు వచ్చాయి. లక్షల సంఖ్యలో కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది. కోట్లాది మంది ప్రజలు మొదటిసారిగా దారిద్య్ర రేఖకు ఎగువకు చేరుకున్నారు. ఆధునిక భారతదేశ చరిత్రలో అతిపెద్ద నిర్ణయాలలో ఒకటిగా పరిగణించే ఈ బడ్జెట్‌ ఘనత మన్మోహన్‌తో పాటు నాటి ప్రధాని పి.వి. నరసింహారావుకు దక్కింది.

Updated Date - Dec 27 , 2024 | 05:50 AM