Minister Udayanidhi: మంత్రి ఉదయనిధికి బిహార్ న్యాయస్థానం సమన్లు.. విషయం ఏంటంటే..
ABN , Publish Date - Mar 14 , 2024 | 12:01 PM
సనాతన ధర్మం గురించి వ్యాఖ్యానించారని రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi)కి బిహార్ న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.
చెన్నై: సనాతన ధర్మం గురించి వ్యాఖ్యానించారని రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi)కి బిహార్ న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. గత సంవత్సరం నగరంలో రాష్ట్ర లౌకికవాద రచయితలు, కళాకారుల సంఘం ఆధ్వర్యంలో సనాతన నిర్మూలన మహానాడు జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఉదయనిధి పాల్గొని, సనాతన ధర్మం గురించి విమర్శించడం వివాదాస్పదమైంది. బీజేపీ సహా పలు హిందూ సంస్థలు ఉదయనిధికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించాయి. ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అదే విధంగా పలు రాష్ట్రాల్లో ఉన్న న్యాయస్థానాల్లో ఉదయనిధిపై కేసులు నమోదయ్యాయి. ఆ మేరకు బిహార్ రాష్ట్రం ఆరా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాది ధరణీధర్‌పాండే కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు రాగా, మేజిస్ట్రేట్ మనోరంజన్‌కుమార్ జా, ఈ వ్యవహారంలో ఉదయనిధి కానీ, ఆయన తరఫున న్యాయవాది కానీ నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని సమన్లు జారీ చేస్తూ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 1కి వాయిదావేశారు.