Share News

Rajasthan: ఎన్నికల అధికారిని చెప్పుతో కొట్టిన అభ్యర్థి అరెస్టు.. ఆ నియోజకవర్గంలో గందరగోళం..

ABN , Publish Date - Nov 14 , 2024 | 05:18 PM

రాజస్థాన్‌‌లో డియోలీ-ఉనియారాతోపాటు ఏడు నియోజకవర్గాలకు బుధవారం ఉపఎన్నిక జరిగింది. డియోలి-ఉనియారా నియోజకవర్గం తరఫున నరేశ్ మీనా అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు.

Rajasthan: ఎన్నికల అధికారిని చెప్పుతో కొట్టిన అభ్యర్థి అరెస్టు.. ఆ నియోజకవర్గంలో గందరగోళం..

జైపూర్: రాజస్థాన్‌ రాష్ట్రం డియోలీ-ఉనియారా నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బుధవారం రోజు జరిగిన ఉపఎన్నిక పోలింగ్ హింసాత్మకంగా మారింది. ఓ అధికారిని స్వతంత్ర అభ్యర్థి నరేశ్ మీనా చెంపదెబ్బ కొట్టడం సంచలనంగా మారింది. అధికారికి, అభ్యర్థికి మధ్య చెలరేగిన వివాదం పలు హింసాత్మక ఘటనలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో నాటకీయ పరిణామాల మధ్య నేడు నరేశ్ మీనాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సంరవత ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


రాజస్థాన్‌‌లో డియోలీ-ఉనియారాతోపాటు ఏడు నియోజకవర్గాలకు బుధవారం ఉపఎన్నిక జరిగింది. డియోలి-ఉనియారా నియోజకవర్గం తరఫున నరేశ్ మీనా అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో అతను స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి దిగారు. అయితే నిన్న పోలింగ్ జరుగుతుండగా ఎన్నికల డ్యూటీలో ఉన్న సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్(ఎస్డీఎం) అమిత్ చౌదరిపై నరేశ్ దాడి చేశారు. బలంగా అధికారి చెంపపై కొట్టి దుర్భాషలాడారు. ఆ బూత్‌లో మూడు అదనపు ఓట్లను చేర్చేందుకు అధికారి చౌదరి కుట్ర పన్నారని మీనా ఆరోపించారు. అయితే దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అతన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు పెద్దఎత్తున అతని నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది.


పోలీసులు రావడానికి ముందు మీడియాతో సురేశ్ మీనా మాట్లాడారు. "నేను లొంగిపోను. నా మద్దతుదారులందరూ పోలీసులను చుట్టుముట్టండి. ట్రాఫిక్ జామ్ చేసి నన్ను అరెస్టు కాకుండా చూడండి" అంటూ అతను మీడియా ముఖంగా అనుచరులకు పిలుపునిచ్చారు. అయితే లాఠీలు, తుపాకులు, షీల్డ్‌లతో భారీగా చేరుకున్న పోలీస్ బలగాలు నాటకీయ పరిణామాల మధ్య నరేశ్ మీనాను అరెస్టు చేశారు. అతన్ని బలవంతంగా తీసుకెళ్లి పోలీస్ వాహనం ఎక్కించారు. తాము వ్యూహాత్మకంగా ఆ ప్రాంతానికి చేరుకున్నామని, అతన్ని లొంగిపోవాలని కోరినట్లు టోంక్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వికాస్ సంగ్వాన్ తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని నరేశ్ మీనాను హెచ్చరించినట్లు ఎస్పీ వెల్లడించారు.


మరోవైపు పోలింగ్‌ బూత్‌లో దాడి వ్యవహారంపై పోలీసుల వర్షన్ మరోలా ఉంది. కొందరు ఎన్నికలను బహిష్కరించారని, వారితో మాట్లాడి ఒప్పించేందుకు ఎస్‌డీఎం, తహసీల్ అధికారులు వారి వద్దకు వెళ్లారని ఎస్పీ తెలిపారు. చర్చల సమయంలోనే స్వతంత్ర అభ్యర్థి అయిన మీనా.. అధికారిని చెప్పుతో కొట్టారని చెప్పారు. అలాగే అతని మద్దతుదారులు చెలరేగిపోయి హింసాత్మక వాతావరణం సృష్టించారని వెల్లడించారు. పోలీస్ వాహనాలు సహా మెుత్తం ఎనిమిది కార్లు, పదికి పైగా ద్విచక్రవాహనాలను వారు తగలబెట్టారని ఆయన చెప్పారు. శాంతిభద్రతలు కాపాడేందుకే అదనపు బలగాలను మోహరించి నరేశ్ మీనాను అరెస్టు చేసినట్లు ఎస్పీ వికాస్ సంగ్వాన్ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Chief Minister: తప్పుడు కేసులతో నా భార్యను ఇబ్బంది పెట్టారు..

Viral News: డాక్టర్‌పై కత్తితో దాడి చేసిన రోగి బంధువు.. తర్వాత ఏమైందంటే..

Updated Date - Nov 14 , 2024 | 05:21 PM