Share News

భారత ఆకాంక్షలు నెరవేరేదాకా విశ్రాంతి లేదు

ABN , Publish Date - Oct 22 , 2024 | 03:38 AM

భారతదేశ ఆకాంక్షలు నిజమయ్యేదాకా తమ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తూనే ఉంటుందని, విశ్రాంతికి అవకాశమే లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

భారత ఆకాంక్షలు నెరవేరేదాకా విశ్రాంతి లేదు

  • అప్పటిదాకా కష్టపడి పనిచేస్తూనే ఉంటాం: మోదీ

  • ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాన్ని ఆపే శక్తి భారత్‌కు ఉంది: కామెరాన్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 21: భారతదేశ ఆకాంక్షలు నిజమయ్యేదాకా తమ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తూనే ఉంటుందని, విశ్రాంతికి అవకాశమే లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ‘‘భారతదేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అనేక మైలురాళ్లు చేరుకుంది. సంస్కరణలు అమలు చేసింది. అయినా ఇంకా ఎందుకు కష్టపడి పనిచేస్తున్నారు? అని నన్ను కలిసిన చాలా మంది అంటుంటారు. అప్పుడు నేను.. గడిచిన పదేళ్లలో 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం. 16 కోట్ల ఇళ్లకు గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చాం. ఇది సరిపోతుందా? అని అడుగుతా.

కచ్చితంగా సరిపోదు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా యువత ఉన్న దేశం. మన యువత మనల్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళుతుంది’’ అని మోదీ చెప్పారు. భారతదేశ కలలు, ఆకాంక్షలు, ప్రతినలు నెరవేరేదాకా విశ్రమించే ప్రసక్తే లేదని సోమవారం ఎన్డీటీవీ నిర్వహించిన ‘ప్రపంచ సమ్మేళనం’లో ప్రధాని వ్యాఖ్యానించారు. కాగా, ఇదే సదస్సులో బ్రిటన్‌ మాజీ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ మాట్లాడుతూ.. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధాన్ని ఆపే శక్తి భారత్‌కు ఉందన్నారు. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించే సామర్థ్యం భారతదేశానికి ఉందని వ్యాఖ్యానించారు.

Updated Date - Oct 22 , 2024 | 03:38 AM