Share News

Austria: ఏ సమస్యకైనా చర్చలే పరిష్కారం

ABN , Publish Date - Jul 11 , 2024 | 05:11 AM

ఆస్ట్రియా చాన్స్‌లర్‌ కర్ల్‌ నెహామర్‌తో ఫలప్రదమైన చర్చలు జరిగాయని ప్రధాని మోదీ బుధవారం వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు సహా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న వివాదాలపై తాము విస్తృతంగా చర్చలు జరిపినట్లు తెలిపారు.

Austria: ఏ సమస్యకైనా చర్చలే పరిష్కారం

  • యుద్ధాలకు ఇది సమయం కాదు.. శాంతిస్థాపనకు మేం సహకరిస్తాం

  • ఆస్ట్రియా చాన్స్‌లర్‌ నెహామర్‌తో కలిసి ప్రధాని మోదీ ప్రకటన

వియన్నా, జూలై 10: ఆస్ట్రియా చాన్స్‌లర్‌ కర్ల్‌ నెహామర్‌తో ఫలప్రదమైన చర్చలు జరిగాయని ప్రధాని మోదీ బుధవారం వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు సహా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న వివాదాలపై తాము విస్తృతంగా చర్చలు జరిపినట్లు తెలిపారు. ‘‘ఇది యుద్ధానికి సమయం కాదు’’ అని మోదీ పునరుద్ఘాటించారు. ఏ సమస్యలనైనా చర్చలతోనే పరిష్కరించుకోవాలని, యుద్ధాలతో కాదని స్పష్టం చేశారు. రష్యాలో రెండు రోజుల పర్యటన ముగించుకున్న మోదీ.. మంగళవారం రాత్రి వియన్నా చేరుకున్నారు. ఒక భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్లడం 41 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1983లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ అక్కడ పర్యటించారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మోదీ వెళ్లారు. ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్‌ స్కాలెన్‌బర్గ్‌ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు.


తర్వాత చాన్స్‌లర్‌ నెహామర్‌ మోదీకి విందు ఏర్పాటు చేశారు. అనంతరం జరిగిన చర్చల్లో భారత్‌-ఆస్ట్రియా దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేయడానికి సంబంధించిన ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించినట్లు మోదీ తెలిపారు. ‘‘చాన్స్‌లర్‌ నెహామర్‌, నేను ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం, ఇతర సమస్యలపై చర్చించాం. ఇది యుద్ధానికి సమయం కాదని నేను ఇప్పటికే చెప్పాను. యుద్ధం ద్వారా సమస్యలను పరిష్కరించుకోలేం. ఎక్కడైనా సరే అమాయకులు ప్రాణాలు కోల్పోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని నెహామర్‌తో కలిసి సంయుక్త మీడియా ప్రకటనలో మోదీ పేర్కొన్నారు. శాంతిస్థాపనకు చర్చలు, దౌత్యపరమైన మార్గాలే శరణ్యమని ఇరువురు నేతలు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి సహకారం అందించేందుకైనా తాము సిద్ధమని ప్రకటించారు.


రష్యా-ఉక్రెయిన్‌ మధ్య శాంతి స్థాపన ప్రక్రియలో భారత్‌ది కీలక పాత్ర అని నెహామర్‌ చెప్పారు. తటస్థ దేశంగా ఉన్న ఆస్ట్రియా శాంతి చర్చలకు సరైన ప్రాంతమని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, నవకల్పనలు, పునరుత్పాదక ఇంధనం, హైడ్రోజన్‌, నీరు, వ్యర్థాల నిర్వహణ, ఏఐ, క్వాంటమ్‌ టెక్నాలజీ రంగాల్లో ఇరుదేశాలు కలిసి పనిచేసి, ఆయా రంగాల్లో బలోపేతం కావాలని నిర్ణయించినట్లు మోదీ తెలిపారు. ఇరుదేశాల మధ్య యువత ఆలోచనలను పంచుకునేందుకు స్టార్టప్‌ వ్యవస్థ వారధిగా నిలుస్తుందన్నారు. భారత్‌లో పెట్టుబడులకు ఆస్ట్రియా కంపెనీలను మోదీ ఆహ్వానించారు. మౌలిక సదుపాయాలు, ఇంధన రంగాల్లో అవకాశాలున్నాయని తెలిపారు. కాగా, మంగళవారం రాత్రి వియన్నా చేరుకున్న మోదీకి ‘వందేమాతరం’ ఆలపిస్తూ స్వాగతం పలికారు.

Updated Date - Jul 11 , 2024 | 06:49 AM