Share News

BJP : కొత్త టీంపై కసరత్తు

ABN , Publish Date - Jun 07 , 2024 | 02:20 AM

వరుసగా మూడోసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఆదివారం సాయంత్రం ప్రమాణం చేయనున్నారు. ఆయనతోపాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మోదీ.. శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే, బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనాలను ఆహ్వానించారు.

BJP : కొత్త టీంపై కసరత్తు

  • కేబినెట్‌లో 50 మందికిపైగా చాన్స్‌.. నడ్డా నివాసంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల భేటీ

  • పలువురు పాత మంత్రులకు ఉద్వాసన

  • నిర్మలా సీతారామన్‌కు అనుమానమే

  • మిత్రపక్షాలకు ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ,

  • వాణిజ్య మినహా ఇతర శాఖల కేటాయింపు!

  • మహిళా కోటాలో డీకే అరుణ, పురందేశ్వరి

  • పరిశీలనలో కిషన్‌రెడ్డి, సంజయ్‌, ఈటల

  • ఎల్లుండి ప్రధానిగా మోదీ ప్రమాణం

  • పలువురు మంత్రులు కూడా..

  • బంగ్లాదేశ్‌, శ్రీలంక దేశాధినేతలకు ఆహ్వానం

  • హాజరుకానున్న చంద్రబాబు, నితీశ్‌ తదితరులు

  • నేడు ఎన్డీయే ఎంపీల సమావేశం

  • ఢిల్లీలో బాబు.. కొనసాగుతున్న మంతనాలు

  • రాష్ట్రపతిని కలిసిన కేంద్ర ఎన్నికల కమిషనర్లు

  • ఎన్నికైన ఎంపీల జాబితా అందజేత

న్యూఢిల్లీ, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): వరుసగా మూడోసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఆదివారం సాయంత్రం ప్రమాణం చేయనున్నారు. ఆయనతోపాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మోదీ.. శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే, బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనాలను ఆహ్వానించారు. వారు అందుకు అంగీకరించారు. ఎన్డీయే అగ్రనేతలు చంద్రబాబునాయుడు, నితీశ్‌ కుమార్‌, ఏక్‌నాథ్‌ శిందే తదితరులు కూడా మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు.

కాగా, మోదీ మంత్రివర్గంలో పలువురు పాత మంత్రులను పక్కనపెట్టే అవకాశాలు ఉన్నాయని, కొనసాగించే మంత్రుల శాఖలను కూడా మార్చవచ్చని సమాచారం. గత కేబినెట్‌లో ఆర్థికమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించిన నిర్మలా సీతారామన్‌ సొంత రాష్ట్రం తమిళనాడులో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడం, ఎన్నికల్లో పోటీ చేయడానికే ఆమె ముందుకు రాకపోవటంతో ఈసారి ఆమెను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారా? లేదా? అన్న చర్చ నడుస్తోంది.

అలాగే గత క్యాబినెట్‌లో మంత్రులుగా ఉన్న స్మృతీ ఇరానీ, రాజీవ్‌ చంద్రశేఖర్‌, వి.మురళీధరన్‌, అజయ్‌మిశ్రా తేనీ, మహేంద్రనాథ్‌ పాండే, కౌశల్‌కిషోర్‌, సాధ్వీ నిరంజన్‌ జ్యోతి, అర్జున్‌ ముండా, కైలాశ్‌ చౌదరి, ఆర్కే సింగ్‌, సంజీవ్‌ బల్యాన్‌ సహా 15 మంది ఎన్నికల్లో ఓడిపోవడంతో మోదీ పూర్తిగా కొత్త టీమ్‌ను ఎంచుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కీలకమైన ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, వాణిజ్య శాఖలు మినహా మిగతా మంత్రిత్వ శాఖలను మిత్రపక్షాలకు కేటాయించేందుకు మోదీ సుముఖంగా ఉన్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.

మరోవైపు, బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ ముఖ్య నేతలు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో గురువారం సమావేశమై మంత్రివర్గ కూర్పుపై చర్చించారు. ఈ సమావేశంలో అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, బీఎల్‌ సంతోష్‌, సురేశ్‌ సోని, దత్తాత్రేయ హొసబలే, అరుణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న పలువురు ఎంపీలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.


  • 50కిపైగా మంత్రులు

మోదీ మంత్రివర్గంలో 50కిపైగా మంత్రులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 24-26 మంది క్యాబినెట్‌ మంత్రులు, దాదాపు 30మంది సహాయ మంత్రులు ఉండవచ్చని సమాచారం. బీజేపీ నుంచి 10-15 మందికి క్యాబినెట్‌లో అవకాశం కల్పించవచ్చని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. క్యాబినెట్‌ కూర్పుపై తెలుగుదేశం, బీజేపీ మధ్య ఇప్పటికే చర్చలు జరిగాయని విశ్వసనీయ సమాచారం. శుక్రవారం జరిగే ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరుకావటం కోసం చంద్రబాబునాయుడు గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. కేంద్రస్థాయి నేతలతో ఆయన గురువారం రాత్రి కూడా మంతనాలు కొనసాగించినట్లు తెలిసింది. ఎన్డీఏ ఇతర భాగస్వామ్యపక్షాల్లో జేడీయూకి రెండు, ఎల్‌జేపీ, ఆర్‌ఎల్డీ, శివసేన, ఎన్సీపీ (అజిత్‌పవార్‌)లకు ఒక్కొక్కటి చొప్పున మంత్రిపదవులు కేటాయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

  • బీజేపీ నుంచి ఎవరెవరికి..

కేంద్ర మంత్రివర్గంలో బీజేపీ నుంచి అమిత్‌ షా, పీయూష్‌ గోయల్‌, నితిన్‌ గడ్కరీ, జయశంకర్‌, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, జ్యోతిరాదిత్య సింధియా, అర్జున్‌రాం మేఘ్వాల్‌, ఓం బిర్లా, గజేంద్ర సింగ్‌ షెఖావత్‌, సంబిత్‌పాత్ర, జయ పాండా, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ తదితరులు ఉండే అవకాశాలున్నాయి. మహిళా మంత్రుల్లో అపరాజితా సారంగి, బాన్‌సురి స్వరాజ్‌, దగ్గుబాటి పురంధేశ్వరి, డీకే అరుణ పేర్లు పరిగణనలో ఉన్నాయి. తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డితోపాటు బీసీ నేతల్లో ఈటల రాజేందర్‌ లేదా బండి సంజయ్‌ పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ఎన్డీఏ ఎంపీల సమావేశం తర్వాత మంత్రివర్గంలోని పేర్ల జాబితాపై కసరత్తు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి.

  • రాష్ట్రపతికి ఎంపీల జాబితా

18వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన ఎంపీల పేర్లతో కూడిన జాబితాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎన్నికల సంఘం (ఈసీ) అందించింది. గురువారం రాష్ట్రపతిని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్‌ కుమార్‌, సుఖ్బీర్‌ సింగ్‌ సంధు కలిశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్‌ 73 ప్రకారం ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్‌ కాపీని, లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల పేర్లతో కూడిన జాబితాను అందజేశారు.

Updated Date - Jun 07 , 2024 | 02:20 AM