PM Modi: రెండు దశల్లో బీజేపీదే ఆధిక్యం.. విద్వేష రాజకీయాలకు ప్రజలు బుద్ధి చెబుతారన్న మోదీ
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:38 PM
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఏకపక్ష తీర్పు ఇచ్చారని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో (Lok Sabha Elections 2024) భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో విద్వేష పూరిత ప్రసంగాలు చేసే ప్రతిపక్ష నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
ముంబయి: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఏకపక్ష తీర్పు ఇచ్చారని ప్రధాని మోదీ(PM Modi) ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో (Lok Sabha Elections 2024) భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో విద్వేష పూరిత ప్రసంగాలు చేసే ప్రతిపక్ష నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ సందర్భంగా ఇండియా కూటమి (INDIA Bloc)పై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పొరపాటున ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అయిదేళ్లలో అయిదుగురు ప్రధానులు ఉండేలా ప్రణాళికలు వేస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్రలో నకిలీ శివసేన ప్రస్తుతం కాంగ్రెస్ పక్షాన నిలిచిందని.. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే బతికుంటే ఇదంతా చూసి బాధపడేవారని అన్నారు.
‘‘ఈ ఎన్నికల్లో విపక్ష కూటమికి మూడంకెల సీట్లు కూడా రావు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే పరిస్థితి కూడా లేదు. ఛాన్స్ వస్తే ఐదేళ్లలో ఏడాదికి ఒకరు ప్రధానిగా ఉండాలనే ఆలోచన చేస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్(Congress) రెండున్నరేళ్ల తర్వాత సీఎంను మార్చే ప్లాన్ చేస్తోంది. కర్ణాటక మోడల్ రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమలుచేయాలని భావిస్తోంది. ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల కోసమే ఆ పార్టీ పరితపిస్తుంది.వారసత్వ పన్ను, సంపద తిరిగి పంపిణీ చేయాలని చెబుతూ ప్రజల సొమ్ము మింగేసే ఆలోచనలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన రెండు దశల పోలింగ్‌లో ఎన్డీఏ ముందంజలో ఉంది.
కొల్హాపుర్‌ను ఫుట్‌బాల్ హబ్‌గా పిలుస్తారు. ప్రస్తుతం ఎన్డీయే ‘2-0’తో మెజారిటీతో ఉంది. దేశ వ్యతిరేక విధానాలు, విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ కూటమి రెండుసార్లు సెల్ఫ్ గోల్స్ వేసుకుంది. మూడో విడతలోనూ ప్రతిపక్షాలకు గుణపాఠం చెప్పేలా ఓటర్లు మూడో గోల్ వేస్తారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఆర్టికల్ 370ని తిరిగి తెస్తామని, సీఏఏను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. మోదీ నిర్ణయాలను ఎవరైనా మార్చగలరా, అలా చేస్తే, పరిణామాలు ఏంటో వారికి తెలియదా. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే కాంగ్రెస్ పార్టీకి మిగతా విడతల్లోనూ ఓటుతో బుద్ధి చెప్పాలి’’ అని మోదీ పేర్కొన్నారు.