Share News

NTA : సగం మందే హాజరు

ABN , Publish Date - Jun 24 , 2024 | 04:44 AM

గ్రేస్‌ మార్కులు ఇచ్చిన 1563 మందికి జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆదివారం మళ్లీ నీట్‌ పరీక్ష నిర్వహిస్తే.. వారిలో 813 (52 శాతం) మందే హాజరయ్యారు. మిగతా 750 మందీ డుమ్మా కొట్టేశారు.

NTA : సగం మందే హాజరు

  • 1,563 మందికి మళ్లీ నీట్‌ పరీక్ష పెడితే రాసింది

  • 813 మందే.. అక్రమాలపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌

  • పట్నా, గోధ్రాలో.. ప్రత్యేక బృందాల దర్యాప్తు

  • నీట్‌ పేపర్‌ను 30 మందికి అమ్మారు!

  • బిహార్‌లో అరెస్టైన ముగ్గురు నిందితుల వెల్లడి

  • కేంద్రానికి బిహార్‌ ఈవోయూ 6 పేజీల నివేదిక

  • మరో 17 మంది డిబార్‌.. ఐదుగురు అరెస్ట్‌

  • మహారాష్ట్రలోనూ లీకైన నీట్‌ ప్రశ్నపత్రం?

న్యూఢిల్లీ, పట్నా, ముంబై, జూన్‌ 23: గ్రేస్‌ మార్కులు ఇచ్చిన 1563 మందికి జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆదివారం మళ్లీ నీట్‌ పరీక్ష నిర్వహిస్తే.. వారిలో 813 (52 శాతం) మందే హాజరయ్యారు. మిగతా 750 మందీ డుమ్మా కొట్టేశారు. మేఘాలయ, హరియాణా, ఛత్తీ్‌సగఢ్‌, గుజరాత్‌, చండీగఢ్‌లోని పరీక్షా కేంద్రాల్లో ఈ ఎగ్జామ్‌ నిర్వహించగా.. చండీగఢ్‌ కేంద్రంలో పరీక్ష రాయాల్సిన ఇద్దరూ హాజరు కాలేదు. ఛత్తీసగఢ్‌లో రెండు కేంద్రాల్లో 602 మంది పరీక్ష రాయడానికి ఏర్పాట్లు చేయగా.. కేవలం 291 మందే వచ్చారు. హరియాణాలో రెండు కేంద్రాల్లో 494 మందికి ఏర్పాట్లు చేయగా.. 287 మంది, మేఘాలయలో 464 మందికిగాను 234 మంది మాత్రమే పరీక్ష రాశారు. గుజరాత్‌లో ఒకే ఒక్క అభ్యర్థి కోసం పరీక్ష పెట్టారు. మరోవైపు.. నీట్‌ కేసు దర్యాప్తున చేపట్టిన సీబీఐ.. ఆదివారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. కేంద్ర విద్యాశాఖ ఫిర్యాదు మేరకు.. నీట్‌-యూజీ 2024 పరీక్ష నిర్వహణలో కొన్ని రాష్ట్రాల్లో అవకతవకలు చోటుచేసుకున్నట్టు పేర్కొంటూ గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీ సెక్షన్‌ 120-బి (నేరపూరిత కుట్ర), సెక్షన్‌ 420 (చీటింగ్‌) కింద కేసులు నమోదు చేసింది. ఇక.. నీట్‌, యూజీసీ నెట్‌ప్రశ్న పత్రాలు లీక్‌ అయిన నేపథ్యంలో.. ఆ రెండింటితోపాటు జేఈఈ మెయిన్‌, కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ సహా పలు ప్రవేశ, పోటీ పరీక్షలు నిర్వహించే ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ హ్యాక్‌ అయ్యిందన్న వదంతులు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. దీంతో ఎన్‌టీఏ అప్రమత్తమై.. అలాంటిదేమీ లేదని, ఎన్‌టీఏ, దాని అనుబంధ వెబ్‌సైట్లన్నీ అత్యంత భదరంగా ఉన్నాయని ప్రకటించింది. మరోవైపు.. పరీక్షల సంస్కరణలపై ఇస్రో మాజీ చీఫ్‌ రాధాకృష్ణన్‌ నేత్వంలో కేంద్రం నియమించిన ఏడుగురు సభ్యుల ప్యానెల్‌ సోమవారం సమావేశం కానుంది.


ఆ నలుగురికే కాదు..

నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో బిహార్‌ పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు కీలక నిందితులు తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురుకి కాదు.. మొత్తం 25 నుంచి 30 మంది విద్యార్థులకు ప్రశ్నపత్రాన్ని అమ్మారు. ఒక్కొక్కరికీ రూ.30 నుంచి రూ.40 లక్షలకు విక్రయించినట్టు.. సికందర్‌ యాదవేందు, అఖిలేశ్‌ కుమార్‌, బిట్టు కుమార్‌ , సంజీవ్‌ సింగ్‌, రాకీ, నితీశ్‌, అమిత్‌ ఆనంద్‌ తదితర నిందితులు తమ నేరాంగీకార వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈమేరకు.. బిహార్‌లో అదనపు డీజీపీ ఎన్‌హెచ్‌ ఖాన్‌ నేతృత్వంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఆర్థిక నేరాల విభాగం కేంద్ర విద్యాశాఖకు శనివారం ఆరు పేజీల నివేదిక పంపింది. తాము సేకరించిన ప్రాథమిక ఆధారాలు, నిందితుల వాంగ్మూలాలు, నేరాంగీకార పత్రాల ఆధారంగా.. నీట్‌ పేపర్‌ లీక్‌ అయ్యిందన్న అభిప్రాయాన్ని అందులో వెలిబుచ్చింది. అలాగే.. ఈ వ్యవహారంలో అంతర్రాష్ట్ర ముఠాల ప్రమేయం ఉందని, బిహార్‌లో సాల్వర్‌ గ్యాంగ్‌ ఈ పేపర్‌ లీక్‌ చేసిందని స్పష్టం చేసింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మే 4వ తేదీ రాత్రి బిహార్‌లోని సాల్వర్‌ గ్యాంగు మునిసిపల్‌ జూనియర్‌ ఇంజనీర్‌ సికందర్‌ యాదవేందు ద్వారా నలుగురు విద్యార్థులకు నీట్‌ ప్రశ్నపత్రాన్ని జవాబులతో సహా అందజేసే సమయంలోనే పట్నా పోలీసులకు ఝార్ఖండ్‌ పోలీసుల నుంచి ఈ వ్యవహారంపై ఉప్పందింది. ఈ వ్యవహారంలో మొత్తం 13 మంది నిందితుల నేరాంగీకార వాంగ్మూలాలను మే 5వ తేదీనే నమోదు చేశారు. కానీ.. వారి అరెస్టు గురించి మే 7వ తేదీ దాకా వెల్లడించలేదు. అప్పటికే తాము అరెస్టు చేసిన 13 మందినీ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ కస్టడీకి పంపారు. ఇన్ని వివరాలు తెలిసినా.. బిహార్‌ పోలీసులు తొలినాళ్లలో నీట్‌ పేపర్‌ లీక్‌ అయినట్టు తెలపకపోవడం గమనార్హం. దరిమిలా ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో బిహార్‌ సర్కారు ఈ కేసును పోలీసుల నుంచి తప్పించి ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేసింది. కాగా.. కేంద్రానికి బిహార్‌ ఈవోయు పంపిన ఆరు పేజీల నివేదిక ఆధారంగా ఎన్‌టీఏ మరో 17 మంది విద్యార్థులను డిబార్‌ చేసింది. దీంతో ఈ ఏడాది నీట్‌ రాసినవారిలో 110 మందిని డిబార్‌ చేసినట్టయింది. అలాగే.. ఈ కేసులో బిహార్‌ ఈవోయు యూనిట్‌ మరో ఐదుగురిని అరెస్ట్‌ చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటిదాకా బిహార్‌లో అరెస్టయినవారి సంఖ్య 18కి చేరింది.


మహారాష్ట్రలోనూ..

నీట్‌ పేపర్‌ను లీక్‌ చేశారనే అనుమానంతో.. నాందేడ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) పోలీసులు లాతూర్‌లో సంజయ్‌ తుకారాం జాధవ్‌, జలీల్‌ ఉమర్‌ఖాన్‌ పఠాన్‌ అనే ఇద్దరు టీచర్లను అదుపులోకి తీసుకున్నారు. వారు గతంలో జిల్లా పరిషత్‌ స్కూల్‌లో బోధించారని.. ప్రైవేటు కోచింగ్‌ సెంటర్లను నడుపుతున్నారని సమాచారం. వారిని కొన్ని గంటలపాటు ప్రశ్నించిన పోలీసులు.. మళ్లీ తాము పిలిచినప్పుడు రావాలని హెచ్చరించి వదిలిపెట్టినట్టు తెలుస్తోంది.

సీబీఐ బృందంపై దాడి

యూజీసీ-నెట్‌ కేసు దర్యాప్తులో భాగంగా.. ఫూల్‌ చంద్‌ అనే వ్యక్తి సెల్‌ఫోన్‌ను ట్రాక్‌ చేస్తూ బిహార్‌లోని నవాదా ప్రాంతానికి వెళ్లిన సీబీఐ బృందంపై కసియాడిహ్‌ గ్రామవాసులు దాడి చేశారు. సీబీఐ బృందంలో నలుగురు అధికారులు, ఒక మహిళా కానిస్టేబుల్‌ ఉన్నారు. గ్రామస్థులు వారిపై దాడి చేయగా.. సీబీఐ బృందం స్థానిక పోలీసులకు ఫోన్‌ చేసింది. వెంటనే వారు వచ్చి ఆ బృందాన్ని కాపాడారు. అనంతరం స్థానిక పోలీసుల సమక్షంలో దర్యాప్తు కొనసాగించిన సీబీఐ బృందం రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుంది. కాగా.. తమ గ్రామానికి వచ్చింది నకిలీ అధికారుల బృందం అనే సందేహంతోనే గ్రామస్థులు సీబీఐ అధికారులపై దాడి చేసినట్టు స్థానిక పోలీసులు చెప్పారు.

Updated Date - Jun 24 , 2024 | 04:46 AM