‘మేకిన్ ఇండియా’ విమానం
ABN , Publish Date - Oct 29 , 2024 | 02:24 AM
దేశ రక్షణ రంగంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సైనిక రవాణా విమానాలను తయారు చేసే తొలి ప్రైవేటు కర్మాగారం ప్రారంభమైంది. గుజరాత్‌లోని వడోదరలో సీ-295 రవాణా విమానాల తయారీ కేంద్రాన్ని ప్రధాని మోదీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో కలిసి సోమవారం ప్రారంభించారు.
రెండేళ్లలో సీ-295 రవాణా విమానం అందుబాటులోకి.. భవిష్యత్తులో ఎగుమతులు
మా ప్రభుత్వ చర్యలతో ఐదారేళ్లలో దేశంలో 1000 వరకు రక్షణ స్టార్టప్‌లు
పదేళ్లలో రక్షణ ఎగుమతులు 30 రెట్లు.. రతన్ టాటా ఉంటే ఎంతో సంతోషించేవారు
వడోదరలో సీ-295 విమానాల తయారీ కర్మాగారం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ
స్పెయిన్ ప్రధానితో కలిసి ప్రారంభం.. మోదీ విజన్‌కు ఇది నిదర్శనం: సాంచెజ్
వడోదరలోని లక్ష్మీవిలాస్ ప్యాలెస్ వద్ద మోదీ, సాంచెజ్ కరచాలనం
వడోదర, అక్టోబరు 28: దేశ రక్షణ రంగంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సైనిక రవాణా విమానాలను తయారు చేసే తొలి ప్రైవేటు కర్మాగారం ప్రారంభమైంది. గుజరాత్‌లోని వడోదరలో సీ-295 రవాణా విమానాల తయారీ కేంద్రాన్ని ప్రధాని మోదీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో కలిసి సోమవారం ప్రారంభించారు. టాటా సంస్థ భాగస్వామ్యంతో స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్ ఈ ప్యాక్టరీని నిర్మించింది. ఎయిర్‌బర్ ఇతర దేశాల్లో ఇలాంటి విమానాలను తయారు చేయడం ఇదే తొలిసారి. కర్మాగారం ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఈ పరిశ్రమ భారత్-స్పెయిన్ మధ్య సంబంధాలతో పాటు ‘మేకిన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’ మిషన్‌ను బలోపేతం చేస్తుందని చెప్పారు.భారత్-స్పెయిన్ భాగస్వామ్యాన్ని పెడ్రో సాంచెజ్‌తో కలిసి సరికొత్త మార్గంలో తీసుకెళుతున్నామని తెలిపారు. సరికొత్త భారతదేశంలో పని సంస్కృతి ఎంత వేగంగా మారిందనడానికి సీ-295 విమానాల తయారీ కేంద్రం ప్రారంభోత్సవమే నిదర్శనమన్నారు.రెండేళ్ల కిందట ఈ కర్మాగారం నిర్మాణ పనులు ప్రారంభించామని.. ఇప్పుడది విమానాల ఉత్పత్తికి సిద్ధమైందని చెప్పారు. రెండేళ్లలో తొలి విమానం అందుబాటులోకి వస్తుందన్నారు.
భవిష్యత్తులో ఇక్కడ తయారయ్యే విమానాలను ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేస్తారన్న విశ్వాసం తనకుందన్నారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం తీసుకున్న పటిష్ఠ చర్యలతో దేశంలో రక్షణ తయారీ రంగం సరికొత్త శిఖరాలకు చేరిందని తెలిపారు. గడిచిన ఐదారేళ్లలో దేశంలో దాదాపు 1000 రక్షణ స్టార్ట్‌పలు ప్రారంభమయ్యాయని.. గత పదేళ్లలో దేశ రక్షణ ఎగుమతులు 30 రెట్లు పెరిగాయని తెలిపారు.
ప్రస్తుతం 100కు పైగా దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తున్నామన్నారు. ‘‘ఇటీవల భారత ముద్దు బిడ్డ రతన్ టాటాను కోల్పోయింది. ఆయన బతికి ఉంటే.. ఈ రోజు ఇక్కడ మన మధ్యే ఉండేవారు. ఎక్కడ ఉన్నా ఆయన ఈ కార్యక్రమాన్ని చూసి సంతోషిస్తారు’’ అని మోదీ నివాళి అర్పించారు. భారత్‌ను వైమానిక హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో మేడిన్ ఇండియా పౌర విమానం కూడా తయారవుతుందని, దానికి ఇలాంటి కర్మాగారాలు దారి చూపుతాయని చెప్పారు.
మోదీ దూరదృష్టికి ఈ ప్రాజెక్టు నిదర్శనం
వడోదర కర్మాగారం నుంచి రెండేళ్లలో తొలి సీ-295 విమానం అందుబాటులోకి వస్తుందని స్పెయిన్ ప్రధాని సాంచెజ్ చెప్పారు. భారత్‌ను పారిశ్రామిక పవర్‌హౌ్‌సగా మార్చాలని, పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలకు గమ్యస్థానంగా మార్చాలన్న ప్రధాని మోదీ సంకల్పం, దూరదృష్టికి ఈ ప్రాజెక్టు నిదర్శనమని కొనియాడారు. తమ దేశం భారత్‌కు నమ్మకమైన, వ్యూహాత్మకమైన భాగస్వామి అని చెప్పారు. టాటా సంస్థ దిగ్గజాలకే దిగ్గజమని కొనియాడారు. టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. రెండేళ్లలోనే తొలి విమానాన్ని అందజేస్తామని ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు. తొలి విమానాన్ని కూడా మోదీ చేతుల మీదుగానే ప్రారంభిస్తామని, అందుకోసం ఆయన సమయం కూడా తీసుకుంటామని చెప్పారు. ఇది రతన్ టాటా కలల ప్రాజెక్టు అన్నారు. ఇది టాటా గ్రూప్‌కే కాదని, యావత్ దేశానికే చరిత్రాత్మకమైన రోజని పేర్కొన్నారు. 56 సీ-295 విమానాల కొనుగోలుకు 2021 సెప్టెంబరులో భారత్ ఎయిర్‌బ్‌సతో రూ.21 వేల కోట్ల విలువైన ఒప్పందం చేసుకుంది. ఇందులో 16 విమానాలు ఇప్పటికే భారత్‌కు చేరుకున్నాయి. మిగిలిన 40 విమానాలు వడోదరలోని కర్మాగారంలో తయారు చేస్తారు. ఈ విమానాల్లో 40-45 మంది పారాట్రూపర్లు లేదా 70 మంది పౌరులు ప్రయాణించొచ్చు. 5-10 టన్నుల వస్తువులను రవాణా చేసే సామర్థ్యంతో వీటిని రూపొందిస్తున్నారు.
నాగ్‌పూర్‌లో పెట్టాల్సినదాన్ని వడోదరకు తరలించారు
టాటా ఎయిర్‌బస్ ప్రాజెక్టుపై విపక్షాలు
గుజరాత్‌లోని వడోదరలో మోదీ సోమవారం టాటా ఎయిర్‌బస్ సీ295 విమానాల నిర్మాణ ప్రాజెక్టును ప్రారంభించడంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. నిజానికి దీన్ని మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఏర్పాటు చేయాల్సి ఉండగా, గుజరాత్‌కు తరలించుకుపోయారని ఆరోపించాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రయోజనాలను కాదని ప్రధాని సూచనల మేరకు ఈ ప్రాజెక్టును గుజరాత్‌కు తీసుకెళ్లారని ఆరోపించారు. ఇందుకు మహారాష్ట్ర ప్రజలు గట్టి సమాధానం ఇస్తారని చెప్పారు.
రోడ్ షో..
కర్మాగారం ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ, సాంచెజ్‌లో వడోదరలో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్నారు. ఎయిర్‌పోర్టు నుంచి టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్ వరకూ 2.5 కి.మీ. మేర సాగిన ఈ రోడ్ షోలో ఇద్దరు నేతలు ప్రజలకు అభివాదం చేస్తూ ఉత్సాహంగా ముందుకు కదిలారు. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్‌ను వీరిద్దరూ కలిసి ప్రారంభించారు.