PM Modi : ఎమర్జెన్సీ ఓ మచ్చ
ABN , Publish Date - Jun 25 , 2024 | 05:32 AM
‘ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీని విధించి మంగళవారంతో 50 ఏళ్లు పూర్తవుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమర్జెన్సీ ఓ మచ్చ. అప్పట్లో ఎంతోమందిని అన్యాయంగా జైళ్లలో వేశారు.
ఆ చీకటి రోజులను మరోసారి చూడొద్దనే మా ప్రయత్నం
బాధ్యతాయుతమైన ప్రతిపక్షం అవసరం
ప్రమాణ స్వీకారానికి ముందు ప్రధాని మోదీ వ్యాఖ్య
దేశంలో గత పదేళ్లుగా
అప్రకటిత అత్యవసర పరిస్థితే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ధ్వజం
న్యూఢిల్లీ, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): ‘‘ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీని విధించి మంగళవారంతో 50 ఏళ్లు పూర్తవుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమర్జెన్సీ ఓ మచ్చ. అప్పట్లో ఎంతోమందిని అన్యాయంగా జైళ్లలో వేశారు. అలాంటి చీకటి రోజులను మళ్లీ చూడకూడదనేది మా ప్రయత్నం’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 18వ లోక్‌సభ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఉదయం పార్లమెంట్‌కు చేరుకున్న మోదీకి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ మీడియాతో మాట్లాడారు. ప్రజలు తమ విధానాలను విశ్వసించారని, దేశానికి మూడోసారి సేవ చేసే అదృష్టాన్ని కల్పించారని అంటూనే అందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
సరికొత్త విశ్వాసంతో తాజాగా సమావేశాలను ప్రారంభిస్తున్నామని, ఈ ఐదేళ్లపాటు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్వాతంత్ర్యానంతరం వరుసగా మూడోసారి ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కడం గొప్ప విషయమని, దేశ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమేనని, 60 ఏళ్ల తర్వాత మళ్లీ అటువంటి అవకాశం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇది చాలా పవిత్రమైన రోజని, కొత్త ఆశలు, కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలని సభ్యులకు సూచించారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు ఆయన స్వాగతం పలికారు.
బాధ్యతాయుతమైన విపక్షం అవసరం
ప్రజల తీర్పుతో తమ బాధ్యతలు మూడు రెట్లు పెరిగాయని, మూడోసారి మూడు రెట్లు ఎక్కువగా పని చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నానని మోదీ తెలిపారు. ప్రజలు మంచి, బాధ్యతాయుతమైన ప్రతిపక్షాన్ని కోరుకుంటున్నారని అన్నారు. గతంలో ప్రతిపక్షాల తీరు నిరాశపరిచిందని, ఈసారి ప్రజాస్వామ్య మర్యాదను కాపాడేలా, సామాన్య పౌరుల ఆకాంక్షలకు అనుగుణంగా అవి నడుచుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సభ్యులందరినీ కలుపుకొని 2047 వికసిత భారత్ సంకల్పంతో ముందుకెళతామని, ఆ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ముందుకు సాగుతామని తెలిపారు. కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకెళదామని సభ్యులకు సూచించారు. 18వ లోక్‌సభ తీర్మానాల సభగా మారుతుందని, సామాన్య పౌరుల కలలను సాకారం చేస్తుందని అన్నారు.
గత పదేళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ:ఖర్గే
ప్రధాని మోదీ 50 ఏళ్ల కిందటి ఎమర్జెన్సీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారని, కానీ, గత పదేళ్లలో అప్రకటిత ఎమర్జెన్సీ గురించి ఆయన మర్చిపోయారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. నీట్ ఆందోళనలు, పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం, మణిపూర్‌లో కొనసాగుతున్న అశాంతిపై ఆయన మాట్లాడాలని దేశం కోరుకుంటోందని వ్యాఖ్యానించారు. మోదీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. పార్లమెంటు లోపల, బయట ప్రజల గళాన్ని వినిపిస్తూనే ఉంటామన్నారు.
రాజ్యసభ సభా నాయకుడిగా నడ్డా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్‌ప్రకాశ్ నడ్డా రాజ్యసభలో సభానాయకుడిగా నియమితులయ్యారు. ఇప్పటివరకు కొనసాగిన కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ స్థానంలో ఆయన్ను నియమించారు. 2020లో అమిత్‌షా నుంచి పార్టీ పగ్గాలు స్వీకరించిన నడ్డాను.. ప్రధాని మోదీ తన కేబినెట్‌లోకి తీసుకోవడంతో బీజేపీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేస్తారని అంతా భావించారు. అయితే ఇప్పుడప్పుడే ఆయన వైదొలిగే అవకాశాలు కనిపించడం లేదు. పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగాలంటే.. కనీసం సగం రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తికావలసి ఉంటుంది. సంస్థాగత ఎన్నికలు పూర్తికావడానికి ఎంతలేదన్నా ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. అప్పటిదాకా నడ్డానే కొనసాగిస్తారని తెలుస్తోంది.