Lok Sabha Exit Polls: ముచ్చటగా మూడోసారి...
ABN , Publish Date - Jun 01 , 2024 | 09:33 PM
ఎన్డీయే గెలుపొందే సీట్ల ఆధారంగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి బీజేపీ దూకుడు పెరగనుందని, బెంగాల్, ఒడిశాలో బీజేపీ గణనీయంగా ఎంపీ సీట్లు రాబట్టుకోనుందని, ఢిల్లీలోనూ బీజేపీ దాదాపు క్లీన్‌స్వీప్ చేసే అవకాశాలున్నాయని తేల్చాయి.
న్యూఢిల్లీ: రెండున్నరల నెలల పాటు సుదీర్ఘ కాలం సాగిన లోక్‌సభ ఎన్నికల ఘట్టం ముగిసి ఎన్నికల ఫలితాలు వెలువడే ఉద్విఘ్న ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతమవుతున్న తరుణంలో ''ఎగ్జిట్ పోల్స్'' (Exit polls) ఫలితాలు మరింత ఆసక్తిని రేపాయి. 'ఎన్డీయే'కు 400 సీట్లు పైమాటేనంటూ కమలనాథులు విస్తృత ప్రచారం సాగించినప్పటికీ మెజారిటీ సర్వేలు ఆ లెక్కను ధ్రువీకరించలేదు. సొంతంగా 370 సీట్లు గెలుచుకుంటామని బీజేపీ కుండబద్ధలు కొట్టినా ఐదుకు పైగా ఎగ్జిట్ పోల్స్ గణాంకాలు ఆ సంఖ్యకు కాస్త దగ్గరగానే వచ్చి ఆగాయి. ఎన్డీయే గెలుపొందే సీట్ల ఆధారంగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయని మాత్రం అంచనా వేశాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి బీజేపీ దూకుడు పెరగనుందని, బెంగాల్, ఒడిశాలో బీజేపీ గణనీయంగా ఎంపీ సీట్లు రాబట్టుకోనుందని, ఢిల్లీలోనూ బీజేపీ దాదాపు క్లీన్‌స్వీప్ చేసే అవకాశాలున్నాయని సర్వేలు తేల్చాయి.
362 నుంచి 392
ఆరు ఎగ్జిట్ పోల్స్ మొత్తంగా ఎన్డీయేకు 357 సీట్లు రావచ్చని అంచనా వేశాయి. 'ఇండియా' కూటమి 148 సీట్లు గెలుచుకుంటుందని, బీజేపీ సొంతంగా 327 సీట్లు గెలుచుకుంటుందని తెలిపాయి. ఎన్డీయేకు గరిష్టంగా 362 నుంచి 392 సీట్ల వరకూ రావచ్చని ''జన్ కీ బాత్'' ఎగ్జిట్ పోల్ తెలిపింది. విపక్ష కూటమి 141-161 సీట్లు రాబట్టుకుంటుందని జోస్యం చెప్పింది. ''ఇండియా న్యూస్-డి డైనమిక్స్'' అంచనా ప్రకారం ఎన్డీయే 371 సీట్లు, ఇండియా కూటమి 125 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఎన్డీయేకు వచ్చే సీట్లు 281 నుంచి 350 వరకూ ఉంటుందని, ఇండియా కూటమికి 145 నుంచి 201 సీట్లు రావచ్చని ''దైనిక్ భాస్కర్'' తెలిపింది. దాదాపు అన్ని పోల్స్ అటు దక్షిణాదిలోనూ, బెంగాల్‌లోనూ ఎన్డీయే మరితం మెరుగుపడినట్టు ఏకగ్రీవంగా తేల్చిచెప్పాయి.
Lok Sabha Exit Poll: దక్షిణాదిలోనూ బీజేపీకి భారీ స్కోర్.. ఇండియా టీవీ సర్వే
రాష్ట్రాల వారిగా...
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పొత్తు ఎన్డీయేకు కలిసి రానుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పాయి. ఏపీలో 18 నుంచి 25 సీట్లను ఎన్డీయే గెలుచుకోనుందని అంచనా వేశాయి. కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో దానిని సీట్లుగా మలుచుకోవడంలో వెనుకబడిందని, బీజేపీ అక్కడ ఘనవిజయం సాధించనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కర్ణాటకలో బీజేపీ 18 నుంచి 25 సీట్లు గెలుచుకోనున్నట్టు తేల్చాయి. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఉండవచ్చని, మొత్తం 17 సీట్లలో సగం బీజేపీ ఎగరేసుకుని వెళ్తుందని అంచనా వేశాయి. తమిళనాడులోనూ బీజేపీ ఒకటి రెండు సీట్లతోనూ, కేరళలో ఒక సీటుతోనూ ఖాతా తెరుస్తుందని జోస్యం చెప్పాయి. బెంగాల్‌లోనూ ఈసారి బీజేపీ సీట్లు పెరగనున్నాయని, 2019లో బీజేపీకి 18 సీట్లు రాగా ఈసారి 20 సీట్ల వరకూ రావచ్చని అంచనా వేశాయి. అక్కడి అధికార టీఎంసీ కేవలం 19 సీట్లతో సరిపెట్టుకోవాల్సి ఉంటుదని తేల్చాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌తో పాటు దేశ రాజధాని ఢిల్లీలోనూ బీజేపీపీ ఆధిపత్యం కొనసాగిస్తుందని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ఢిల్లీలో పోటీ చేసినప్పటికీ ఆ కూటమి ఒక్క సీటు కూడా గెలుచుకోవడం కష్టమేనని అంచనా వేశాయి. కాగా, బీహార్‌లో పరిస్థితి కొంత మారవచ్చని, గతంలో 40 సీట్లకు 39 సీట్లు ఎన్డీయే గెలుచుకున్నప్పటికీ ఈసారి తేజస్వి యాదవ్ సారథ్యంలోని ఎన్డీయే 7 సీట్లు వరకూ గెలుచుకోవచ్చని, 2019లో డకౌట్ అయిన విపక్షాలు ఈసారి హర్యానాలో 10కి 3 సీట్లు, హర్యానాలో కొద్ది సీట్లు గెలుచుకోవచ్చని కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
Read Latest National News and Telugu News