Share News

PM Modi: దేశాన్ని కులాల వారీగా కాంగ్రెస్ విభజిస్తోంది.. ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు..

ABN , Publish Date - Oct 09 , 2024 | 03:16 PM

మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ కుల, మత ప్రాతిపదికన విభజించేందుకు ప్రయత్నిస్తోందని మోదీ ఆరోపించారు.

PM Modi: దేశాన్ని కులాల వారీగా కాంగ్రెస్ విభజిస్తోంది.. ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు..
Prime Minister Narendra Modi

నాగ్‌పూర్: మహారాష్ట్ర(Maharashtra) ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ కుల, మత ప్రాతిపదికన విభజించేందుకు ప్రయత్నిస్తోందని మోదీ ఆరోపించారు. హిందువుల మధ్య చిచ్చుపెట్టి తగాదాలు సృష్టించేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ వాడుకుంటోందని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఇవాళ(బుధవారం) నాడు 10మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు.


'సర్వజన్ హితయే, సర్వజన్ సుఖయే' అనే సనాతన భావాన్ని విచ్ఛినం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోదీ ఆగ్రహించారు. ఆ పార్టీ పూర్తిగా మతతత్వ, కులతత్వ ప్రాతిపదికన ఎన్నికల్లో పోరాడుతోందని ధ్వజమెత్తారు. హిందూ సమాజాన్ని విభజించి తమ గెలుపు ఫార్ములాగా మార్చుకోవడమే కాంగ్రెస్ రాజకీయ ఎజెండా అని అన్నారు. సర్వజన్ హితయే- సర్వజన్ సుఖాయే అనే భారతీయ సంప్రదాయాన్ని ఆ పార్టీ నేతలు అణచివేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన చెప్పారు.


రూ.7,600కోట్లతో అభివృద్ధి పనులు..

ఈ సందర్భంగా మహారాష్ట్రలో 10వైద్య కళాశాలల ప్రారంభోత్సవం సహా రూ.7,600కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ముందుగా ఆయన 10 వైద్య కళాశాలలను ప్రారంభించారు. ముంబై, నాసిక్, జల్నా, అమరావతి, గడ్చిరోలి, బుల్దానా, వాషిం, భండారా, హింగోలి, అంబర్‌నాథ్(థానే)లలో వైద్య కళాశాలలను మోదీ ఏక కాలంలో ప్రారంభించారు. నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును అప్‌గ్రేడ్ చేసేందుకు రూ.7వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. దీని ద్వారా విమానాశ్రయం అప్‌గ్రేడ్, విమానయానం, పర్యాటకం, లాజిస్టిక్స్, హెల్త్‌కేర్‌తో సహా బహుళ రంగాల్లో నాగ్‌పూర్, విదర్భ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అదే విధంగా షిర్డీ విమానాశ్రయంలో రూ.645కోట్లతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నూతన భవనానికీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. షిర్డీకి వచ్చే పర్యాటకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించడంలో ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.


ఊపందుకున్న ప్రచారం..

ఇదిలా ఉండగా మహారాష్ట్ర ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండడంతో అన్నీ పార్టీలు దూకుడు పెంచాయి. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా కొన్నేళ్లుగా మహాయుతి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రధాని మోదీ ప్రస్తావించారు. మహారాష్ట్రలో మెట్రో విస్తరణ, విమానాశ్రయాలను అప్‌గ్రేడ్‌ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, సౌరశక్తి, టెక్స్‌టైల్స్‌కు సంబంధించి పలు పథకాలు ప్రారంభిస్తున్నామని అన్నారు. అతిపెద్ద కంటైనర్‌ పోర్ట్‌ వధావన్‌ పోర్టుకు పునాది వేశామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామని, కేంద్ర ప్రభుత్వం మరాఠీ భాషకు శాస్త్రీయ భాష హోదా కల్పించిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు.

Updated Date - Oct 09 , 2024 | 03:18 PM