Lok Sabha Elections: నవీన్ పట్నాయక్ ఆరోగ్యానికి ఏమైంది? కుట్ర కోణం ఉందా?.. సభలో మోదీ ప్రస్తావన
ABN , Publish Date - May 29 , 2024 | 05:20 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒడిశాలో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోగ్య పరిస్థితిని ప్రస్తావించారు. అకస్మత్తుగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడం వెనుక కారణం ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు.
భువనేశ్వర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఒడిశా (Odisha)లో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) ఆరోగ్య పరిస్థితిని ప్రస్తావించారు. అకస్మత్తుగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడం వెనుక కారణం ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. నవీన్ పట్నాయక్ ఇటీవల ఒక ర్యాలీలో పాల్గొన్నప్పుడు ఆయన చేయి వణుకుతూ కనిపించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమంలో వైరల్ అయిన నేపథ్యంలో మోదీ తాజా వ్యాఖ్యలు చేశారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం వస్తే నవీన్ పట్నాయక్ ఆరోగ్యం ఆకస్మికంగా దిగజారడంపై కారణాలను తెలుసుకునేందుకు ఒక కమిటీని వేస్తామని మోదీ చెప్పారు.
''నవీన్ బాబు సన్నిహితులు ఎప్పుడు నన్ను కలిసినా ఆయన ఆరోగ్యం గురించే మాట్లాడుతున్నారు. ఆయన ఇప్పుడు సొంతంగా ఏమీ చేసుకునే పరిస్థితిలో లేరని చెబుతున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడం వెనుక కుట్ర ఏదైనా ఉండవచ్చనే అనుమానాలను కూడా వారు వ్యక్తం చేస్తున్నారు'' అని మోదీ తెలిపారు. నవీన్ బాబు పేరును ఉపయోగించుకుని అధికారాన్ని అనుభవిస్తున్న లాబీ ఈ 'కుట్ర' వెనుక ఉండవచ్చనే అనుమానాలను ప్రధాని వ్యక్తం చేశారు. ఈ మిస్టరీన వెలికి తీయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Naveen Patnaik: బీజేపీకి నా చేతులపై చర్చ ఎందుకు? కస్సుమని లేచిన నవీన్ పట్నాయక్
అసలేం జరిగింది?
నవీన్ పట్నాయక్ ఇటీవల ఓ సభలో ప్రసంగిస్తుండగా ఆయన ఎడమ చేయి వణికింది. పట్నాయక్‌కు సన్నిహితుడుగా పేరున్న తమిళనాడుకు చెందిన బీజేడీ నేత వీకే పాండియన్ నవీన్ వణుకుతున్న చేతిని కనబడకుండా సరిచేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమంలో హల్‌చల్ చేసింది. బీజేపీ నేత, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ దీనిపై ఒక ట్వీట్ చేస్తూ, నవీన్ చేతి కదలికలను సైతం కంట్రోల్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై పట్నాయక్ సైతం వెంటనే స్పందించారు. సమస్య కాని దానిని సమస్య చేయడం బీజేపీకి బాగా తెలుసునని, అందుకే తన చేతుల గురించి చర్చ లేవనెత్తారని తప్పుపట్టారు. ఓట్ల కోసం బీజేపీ చేస్తున్న కుయుక్తులు ఎంతమాత్రం పనిచేయవని స్పష్టం చేశారు. ఒడిశాలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నాలుగు విడతలుగా మే 13 నుంచి జూన్ 1 వరకూ జరుగుతున్నాయి. జూన్ 4న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.