Share News

Dating Scam: అమ్మాయి పిలిచిందని వెళ్లాడు.. అడ్డంగా బుక్కయ్యాడు..

ABN , Publish Date - Oct 25 , 2024 | 01:35 PM

ఢిల్లీ చెందిన ఓ యువకుడు ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే అక్టోబర్ 21న అతనికి ఓ యువతి నుంచి వాట్సాప్ సందేశం వచ్చింది. దానికి అతను స్పందించడంతో ఇద్దరి మధ్య మాటమాట కలిసింది.

Dating Scam: అమ్మాయి పిలిచిందని వెళ్లాడు.. అడ్డంగా బుక్కయ్యాడు..

ఉత్తర్ ప్రదేశ్: పెళ్లి కావడం లేదని అబ్బాయిలు తలలు పట్టుకుంటున్నారు. ఎన్ని సంబంధాలు వెతికినా కుదరడం లేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో డేటింగ్ యాప్‌లు, మ్యాట్రిమోనీ సైట్లను ఆశ్రయిస్తున్నారు. అయితే అక్కడా ఫేక్ ఖాతాలతో మోసపోతున్నారు. అడ్డంగా బుక్కై జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. అందమైన ఫొటలతో అబ్బాయిలను మయమరిపిస్తున్న కొంతమంది యువతులు.. రొమాంటిక్‌గా చాట్ చేస్తూ మెల్లిగా ఊబిలోకి దించుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో తాజాగా అలాంటి నయా మోసమే ఒకటి వెలుగులోకి వచ్చింది. డేటింగ్ పేరుతో తీసుకెళ్లిన ఓ యువతి ఇచ్చిన షాక్‌కు యువకుడు కంగు తిన్నాడు.


ఢిల్లీ చెందిన ఓ యువకుడు ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే అక్టోబర్ 21న అతనికి ఓ యువతి నుంచి వాట్సాప్ సందేశం వచ్చింది. దానికి అతను స్పందించడంతో ఇద్దరి మధ్య మాటమాట కలిసింది. అమ్మాయి కొంచెం రొమాంటిక్‌గా మాట్లాడడంతో అబ్బాయి ఆమె వలలో పడిపోయాడు. మంచిగా మాట్లాడిన యువతి ఇద్దరం కలుద్దామని కోరింది. అతన్ని కౌశాంబి మెట్రో స్టేషన్‌ వద్ద రమ్మని చెప్పింది. దీంతో యువకుడు అందంగా తయారయ్యి అక్కడి చేరుకున్నాడు. కాసేపటికి యువతీ వచ్చింది. అనంతరం హోటల్‌కు వెళ్దామని అమ్మాయి చెప్పగా యువకుడు సైతం సరే అన్నాడు.


అనంతరం ఇద్దరూ కలిసి కౌశాంబి హోటల్‌లోని మొదటి అంతస్తులో ఉన్న టైగర్‌ కేఫ్‌కు చేరుకున్నారు. అయితే అక్కడి వాతావరణం మెుత్తం అనుమానాస్పదంగా ఉన్నట్లు యువకుడికి అర్థమైంది. హోటల్‌కు సైన్ బోర్డు లేదు, ఆన్ లైన్‌లో వెతికినా కేఫ్ పేరు ఎక్కడా కనిపించలేదు. దీంతో వెంటనే అతను స్నేహితుడికి తన లైవ్ లొకేషన్ షేర్ చేశాడు. తనకు ఏదో అనుమానంగా ఉందని, తనను కిడ్నాప్ చేసే అవకాశం ఉందని మెసేజ్ చేశాడు. అయితే అమ్మాయి ఓ కూల్ డ్రింక్ ఆర్డర్ చేసింది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత బయలుదేరే సమయంలో బిల్ వచ్చింది. అది చూసి యువకుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. రూ.16,400 కట్టాలని హాటల్ సిబ్బంది చెప్పడంతో అయోమయానికి గురయ్యాడు. దీంతో హోటల్ సిబ్బందిని గట్టిగా నిలదీశాడు.


యువకుడిని బలవంతంగా ఆపిన హోటల్ సిబ్బంది అతడు బయటకు వెళ్లేందుకు నిరాకరించారు. రూ.50వేలు కడితేనే వదులుతామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో విషయాన్ని తన స్నేహితుడికి చెప్పాడు. అతను వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా బాధితుడి వద్దకు వారు చేరుకున్నారు. దీంతో డేటింగ్ యాప్స్ ముఠా గుట్టురట్టు అయ్యింది. యువకుడు జరిగిన విషయాన్ని చెప్పగా పోలీసులు హోటల్‌లో తనిఖీలు చేపట్టారు. వారి ఫోన్లను చెక్ చేయగా నలుగురు అమ్మాయిలు వివిధ డేటింగ్


యాప్స్‌లో వివిధ పేర్లతో ఖాతాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. యువకులకు వల పన్ని వారిని హోటల్‌కు తీసుకువచ్చి డబ్బులు దండుకుంటున్నట్లు గుర్తించారు. వెంటనే ఐదుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో పరిచమయ్యే అమ్మాయిలు, అబ్బాయిల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

Updated Date - Oct 25 , 2024 | 01:35 PM