Share News

PM Modi: ఓట్‌ జిహాదా.. రామరాజ్యమా?.. మోదీ సూటి ప్రశ్న

ABN , Publish Date - May 08 , 2024 | 09:16 AM

కాంగ్రెస్‌ పార్టీ ‘ఓట్‌ జిహాద్‌’ను ప్రోత్సహిస్తూ, బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని ముస్లింలను కోరుతోందని ప్రధాని మోదీ మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని ధార్‌, ఖర్గోన్‌లలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలలో మోదీ ప్రసంగించారు. ‘‘భారతదేశంఈ రోజు ఒక కీలక మలుపు ముంగిట నిలిచింది. దేశంలో ఓట్‌ జిహాద్‌ కొనసాగాలా లేక, రామ రాజ్యం కొనసాగాలా అనేది మీరే నిర్ణయించుకోవాలి’’ అని ప్రజలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.

PM Modi: ఓట్‌ జిహాదా.. రామరాజ్యమా?.. మోదీ సూటి ప్రశ్న

  • ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి

  • దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడానికి ‘ఇండియా’ నేతల పోటీ

  • ఆర్టికల్‌ 370ని మళ్లీ తేకూడదని, రామమందిరానికి బాబ్రీ తాళం

  • పడకూడదని లోక్‌సభలో 400కు పైగా సీట్లు అడిగాను: మోదీ

ధార్‌ (మధ్యప్రదేశ్‌), మే 7: కాంగ్రెస్‌ పార్టీ ‘ఓట్‌ జిహాద్‌’ను ప్రోత్సహిస్తూ, బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని ముస్లింలను కోరుతోందని ప్రధాని మోదీ మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని ధార్‌, ఖర్గోన్‌లలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలలో మోదీ ప్రసంగించారు. ‘‘భారతదేశంఈ రోజు ఒక కీలక మలుపు ముంగిట నిలిచింది. దేశంలో ఓట్‌ జిహాద్‌ కొనసాగాలా లేక, రామ రాజ్యం కొనసాగాలా అనేది మీరే నిర్ణయించుకోవాలి’’ అని ప్రజలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.

పాక్‌ ఉగ్రవాదులు భారత్‌కు వ్యతిరేకంగా జిహాద్‌ పేరుతో బెదిరిస్తుంటే, ఇక్కడ కాంగ్రెస్‌ మాత్రం మోదీకి వ్యతిరేకంగా ఓట్‌ జిహాద్‌ను ప్రకటించిందని ఆయన ఆరోపించారు. దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడానికి ప్రస్తుతం విపక్ష ఇండియా కూటమి నేతల మధ్య పోటీ నడుస్తోందని, వారు మన విశ్వాసాలను, దేశ ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.


400 సీట్లు ఎందుకు వాడామంటే...

కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని కాంగ్రెస్‌ తిరిగి తీసుకురాకుండా ఉండేందుకు, అయోధ్యలో రామమందిరానికి బాబ్రీ తాళం పడకుండా ఉండేందుకు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 400 సీట్లు గెలుచుకోవాలని తాను కోరుకుంటున్నట్లు మోదీ తెలిపారు. కాంగ్రెస్‌ తన ఓటు బ్యాంకుకు లబ్ధి చేకూర్చడానికి గాను వారు ఓబీసీ కోటాను దోచుకోకుండా ఉండటానికి 400 స్థానాలు కావాలని అడిగినట్లు తెలిపారు.

దేశంలో ఖాళీగా ఉన్న భూములు, దీవులను కాంగ్రెస్‌ పార్టీ ఇతర దేశాలకు అప్పగించకుండా, తన ఓటు బ్యాంకులోని కులాలను రాత్రికి రాత్రే ఓబీసీలుగా ప్రకటించకుండా ఉండటానికే 400 సీట్లు అడుగుతున్నానని తెలిపారు. ‘‘బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు పార్లమెంట్‌లో ఇప్పటికే 400కుపైగా సీట్లు ఉన్నాయని దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్టికల్‌ 370ని రద్దు చేయడానికి మేం ఈ నంబరును ఉపయోగించాం’’ అని మోదీ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కోటాను పదేళ్ల కాంగ్రెస్‌, ఇండియా కూటమి ప్రతి కుట్రను అడ్డుకొనేందుకు తాను 400 సీట్లు అడుగుతున్నానని మోదీ స్పష్టం చేశారు.


వాళ్ల నోటికి తాళం

దళితులు, ఓబీసీల రిజర్వేషన్లను లాక్కొని ముస్లింలకు ఇవ్వాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని ప్రధాని ఆరోపించారు. ఈ అంశంపై ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ ఇటీవల చేసిన ప్రకటన ఇండియా కూటమి ఉద్దేశాలను ధ్రువీకరించిందని చెప్పారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తున్న రిజర్వేషన్లను ఎప్పటికీ లాక్కోబోమని, ప్రస్తుతం ఉన్న ఓబీసీ కోటా నుంచి దోపిడీకి పాల్పడి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించబోమని లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరాను. కానీ వారు స్పందించకుడా, తమ నోటికి తాళం వేసుకొని మౌనంగా కూర్చున్నారు’’ అని మోదీ ఎద్దేవా చేశారు.

అంబేడ్కర్‌కు వెన్నుపోటు పొడిచారు

అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ చిన్నచూపు చూస్తోందని, రాజ్యాంగం రూపకల్పనలో ఆయన పాత్ర చాలా తక్కువని, రాజ్యాంగ నిర్మాణంలో పండిట్‌ నెహ్రూ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించారని ప్రచారం చేయడం ప్రారంభించిందని మోదీ ఆరోపించారు. అంబేడ్కర్‌ను, రాజ్యాంగాన్ని కాంగ్రెస్‌ వెన్నుపోటు పొడించిదన్నారు. అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ పరివారం తీవ్రంగా ద్వేషిస్తోందన్నది వాస్తవమని మోదీ పేర్కొన్నారు. ఇలాంటి వారిని రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంచడమే మత రిజర్వేషన్లను వ్యతిరేకించిన అంబేడ్కర్‌కు అతిపెద్ద నివాళిగా అభివర్ణించారు.

ఇది కూడా చదవండి:

West Bengal: నియామకాల రద్దుపై స్టే.. కానీ సీబీఐ విచారణ జరపండి

Read Latest National News and Telugu News

Updated Date - May 08 , 2024 | 09:16 AM