Rahul Gandhi : నాపై ఈడీ దాడులకు ప్రణాళిక!
ABN , Publish Date - Aug 03 , 2024 | 05:14 AM
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనపై దాడులు చేసేందుకు సిద్ధమవుతోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. లోక్‌సభలో ‘చక్రవ్యూహం’ అంటూ తాను చేసిన ప్రసంగం కేంద్ర ప్రభుత్వ పెద్దలకు నచ్చలేదన్నారు.
ఈడీలో పనిచేసే వారే చెప్పారు: రాహుల్
న్యూఢిల్లీ, ఆగస్టు 2: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనపై దాడులు చేసేందుకు సిద్ధమవుతోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
లోక్‌సభలో ‘చక్రవ్యూహం’ అంటూ తాను చేసిన ప్రసంగం కేంద్ర ప్రభుత్వ పెద్దలకు నచ్చలేదన్నారు. ఆ ప్రసంగం నేపథ్యంలో త్వరలోనే తనపై ఈడీ దాడులకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు.
‘ఆ ఇద్దరిలో’ ఒకరికి తన చక్రవ్యూహం ప్రసంగం నచ్చలేదని తెలుస్తోందని, అందువల్లే తనపై దాడులకు సిద్ధమవుతున్నట్లు ఈడీలో పనిచేస్తున్న కొంతమంది తెలిపారని రాహుల్ పేర్కొన్నారు. ‘ఈ దాడుల కోసం ఎదురుచూస్తున్నా.
చాయ్, బిస్కట్లు సిద్ధంగా ఉంచండి’ అని ఈడీ డైరెక్టరేట్ ఖాతాను ట్యాగ్ చేస్తూ రాహుల్ గాంధీ శుక్రవారం తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. కేంద్ర బడ్జెట్‌పై చర్చలో భాగంగా సోమవారం లోక్‌సభలో రాహుల్ ప్రసంగిస్తూ..
ఆరుగురు వ్యక్తులు దేశం మొత్తాన్ని ‘పద్మవ్యూహం’లోకి నెట్టివేస్తున్నారని ధ్వజమెత్తారు. మహాభారతంలోని కీలక ఘట్టమైన పద్మవ్యూహాన్ని, వీరమరణం పొందిన అభిమన్యుడిని ప్రస్తావిస్తూ.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తదితరులపై విమర్శలు గుప్పించారు. అయితే, తనపై ఈడీ దాడులు జరగొచ్చన్న రాహుల్ గాంధీ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. వయనాడ్ ఎంపీగా అక్కడ జరిగిన విషాద ఘటనకు బాధ్యత వహించాల్సి వస్తుందనే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తింది.