Rahul Gandhi : విద్యావ్యవస్థను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ చెరబట్టాయి
ABN , Publish Date - Jun 21 , 2024 | 03:28 AM
ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయెల్-గాజా యుద్ధాలను ఆపినట్లుగా చెప్పుకొనే మోదీ.. పేపర్ లీక్‌ను అడ్డుకోలేకపోయారా? అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
యుద్ధాలను ఆపినోళ్లు.. పేపర్ లీక్‌ను అడ్డుకోలేకపోయారా?:
రాహుల్
న్యూఢిల్లీ, జూన్ 20: ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయెల్-గాజా యుద్ధాలను ఆపినట్లుగా చెప్పుకొనే మోదీ.. పేపర్ లీక్‌ను అడ్డుకోలేకపోయారా? అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విద్యావ్యవస్థను బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్ చెరబట్టాయని, అందుకు మోదీ అవకాశం కల్పించారని ఆరోపించారు. గురువారం ఢిల్లీలో రాహుల్ విలేకరులతో మాట్లాడారు. మోదీ దృష్టంతా లోక్‌సభ స్పీకర్ పదవి తమవారికి దక్కేలా చూడడంపైనే ఉందని, లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన నీట్ పేపర్ లీకేజీ అంశం ఆయనకు ప్రాధాన్యంగా కనిపించడం లేదని ధ్వజమెత్తారు. మోదీ సైద్ధాంతికంగా పతనం అయ్యారని, ప్రభుత్వాన్ని నడపడంలో ఆయనకు ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. మరోవైపు నీట్ లీకేజీలో అరెస్టయిన సికిందర్ ప్రసాద్ యదువేందుకు ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బిహార్ డిప్యూటీ సీఎం విజయ్‌కుమార్ సిన్హా ఆరోపించారు.
విద్యావ్యవస్థను ధ్వంసం చేశారు: ఖర్గే
విద్యావ్యవస్థను మోదీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. నీట్, యూజీసీ-నెట్, సీయూఈటీల్లో ప్రశ్నపత్రాల లీకులు, అక్రమాలు-అవకతవకలు, మోసాలు బహిర్గతమయ్యాయని పేర్కొన్నారు. గురువారం ఆయన ‘ఎక్స్’ వేదికగా ఓ పోస్టు చేశారు. రోజుకో ప్రశ్నపత్రం లీక్ అవుతోందని, ఇదేం ‘పరీక్షా పే చర్చ’ అని ఎద్దేవా చేశారు.