Share News

Rahul Gandhi : కశ్మీరీలతో నాది రక్తసంబంధం

ABN , Publish Date - Aug 23 , 2024 | 03:43 AM

జమ్మూకశ్మీర్‌ ప్రజలతో తనది రక్తసంబంధమని, జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించడమే ఇండియా కూటమి ప్రాధాన్యమని కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ అన్నారు.

Rahul Gandhi : కశ్మీరీలతో నాది రక్తసంబంధం

రాష్ట్ర హోదా పునరుద్ధరణే ‘ఇండియా’ ప్రాధాన్యం: రాహుల్‌ గాంధీ

ఖర్గేతో కలిసి ఎన్సీ చీఫ్‌ ఫరూక్‌తో భేటీ

న్యూఢిల్లీ, ఆగస్టు 22: జమ్మూకశ్మీర్‌ ప్రజలతో తనది రక్తసంబంధమని, జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించడమే ఇండియా కూటమి ప్రాధాన్యమని కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ అన్నారు. మరోపక్క, అసెంబ్లీ ఎన్నికల వేళ జమ్మూకశ్మీర్‌లో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్సీ) పార్టీల మధ్య పొత్తు కుదిరింది.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి శ్రీనగర్‌లో గురువారం పర్యటించిన రాహుల్‌ గాంధీ.. ఎన్సీ పార్టీ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా, ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లాతో సమావేశమయ్యారు. అంతకముందు కాంగ్రెస్‌ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ విలేకరులతో మాట్లాడుతూ..


ఎన్నికల కన్నా ముందే రాష్ట్ర హోదా పునరుద్ధరణ జరుగుతుందని ఆశించామన్నారు. కానీ, ఎన్నికల ప్రకటన వెలువడిందని, రాష్ట్ర హోదా కూడా అలానే తిరిగి వస్తుందని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఓ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.

కాగా, ఈ భేటీ అనంతరం ఖర్గేతో కలిసి ఫరూక్‌ అబ్దుల్లా నివాసానికి వెళ్లిన రాహుల్‌ గాంధీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌, ఎన్సీ పార్టీల మధ్య పొత్తు కుదిరిందని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా ఈ సమావేశం అనంతరం ప్రకటించారు.

అలాగే, సీపీఐ(ఎం) నేత ఎంఎస్‌ తరిగామి కూడా తమతోనే ఉన్నారని తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసం ఇండియా కూటమితో కలిసి నడుస్తామని చెప్పారు. కాగా, 90 స్థానాలున్న జమ్మూకశ్మీర్‌ శాసన సభకు మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. సెప్టెంబరు 18, 25, అక్టోబరు 1 తేదీల్లో పోలింగ్‌ జరగనుండగా అక్టోబరు 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Updated Date - Aug 23 , 2024 | 03:43 AM