Rahul Gandhi : అవహేళనలకు గురైనవేళ మీ ఆదరణే రక్షించింది
ABN , Publish Date - Jun 24 , 2024 | 04:09 AM
కేరళలోని వయనాడ్ నియోజకవర్గానికి రాజీనామా చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం అక్కడి ప్రజలకు భావోద్వోగపూరిత లేఖ రాశారు.
వయనాడ్ ప్రజలకు రాహుల్ భావోద్వేగ లేఖ
వయనాడ్, జూన్ 23: కేరళలోని వయనాడ్ నియోజకవర్గానికి రాజీనామా చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం అక్కడి ప్రజలకు భావోద్వోగపూరిత లేఖ రాశారు. వయనాడ్, రాయ్‌బరేలీ రెండు చోట్ల నుంచి లోక్‌సభకు ఎన్నికవడంతో ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. వంశపారంపర్య స్థానంగా గుర్తింపు పొందిన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానాన్ని అట్టిపెట్టుకొని వయనాడ్‌ను విడిచిపెట్టారు.
ఇక్కడ ఆయన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వయనాడ్ ప్రజలకు లేఖ రాశారు. ‘ప్రతి రోజూ అవహేళనలకు గురైన సమయంలో మీరు చూపించిన అపరమిత ప్రేమే నన్ను కాపాడింది’ అని ఆ లేఖలో ప్రధానంగా పేర్కొన్నారు. ‘‘వయనాడ్‌ను వదులుకోవాలన్న నిర్ణయాన్ని ప్రకటించేందుకు మీడియా ముందుకు వచ్చినప్పుడు నా కళ్లలోని విచారాన్ని మీరు చూసే ఉంటారు. అయిదేళ్ల క్రితం ఓ పరాయివ్యక్తిగా మీ ముందుకు వచ్చాను. అయినా మీరు నన్ను నమ్మారు. హద్దులు లేని ప్రేమ, అభిమానంతో అక్కున చేర్చుకున్నారు. ప్రతి రోజూ దుర్భాషలకు గురయిన సమయంలో మీరు చూపిన షరతుల్లేని ప్రేమే నన్ను సంరక్షించింది. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. మీరు నా కుటుంబంలో సభ్యులు’’ అని పేర్కొన్నారు.