Share News

Rahul Gandhi: వయనాడ్‌ని వదులుతున్న వేళ.. రాహుల్ గాంధీ భావోద్వేగం

ABN , Publish Date - Jun 23 , 2024 | 09:20 PM

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యూపీలోని రాయ్‌బరేలి(Raebareli), కేరళలోని వయనాడ్(Wayanad) పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం ఒకరు ఒక స్థానానికే ప్రాతినిధ్యం వహించాలి. దీంతో రాహుల్ (Rahul Gandhi) వయనాడ్‌ని వదులుకోవడానికి సిద్ధమయ్యారు.

Rahul Gandhi: వయనాడ్‌ని వదులుతున్న వేళ.. రాహుల్ గాంధీ భావోద్వేగం

ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యూపీలోని రాయ్‌బరేలి(Raebareli), కేరళలోని వయనాడ్(Wayanad) పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం ఒకరు ఒక స్థానానికే ప్రాతినిధ్యం వహించాలి. దీంతో రాహుల్ (Rahul Gandhi) వయనాడ్‌ని వదులుకోవడానికి సిద్ధమయ్యారు.

త్వరలో అక్కడ జరగబోయే ఉపఎన్నికలో ప్రియాంక గాంధీ బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో వయనాడ్‌ ప్రజలను ఉద్దేశిస్తూ రాహుల్ భావోద్వేగ లేఖ రాశారు. తన నిర్ణయాన్ని మీడియాకు చెప్పేందుకు చాలా బాధపడినట్టు లేఖలో వివరించారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న సమయంలో.. వయనాడ్‌ ప్రజల ప్రేమాభిమానాలే కాపాడాయని అన్నారు.


‘ప్రియమైన వయనాడ్ ప్రజలారా.. మీరంతా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. నేను నా నిర్ణయాన్ని మీడియా ఎదుట చెప్పేటప్పుడు నా కళ్లల్లో బాధ మీరంతా చూసే ఉంటారు. నేను ఎందుకు బాధపడ్డానో తెలుసా? మీ సపోర్ట్ కోసం ఐదేళ్ల క్రితం మిమ్మల్ని కలిశాను. అప్పటికి నేను పెద్దగా పరిచయం లేకపోయినా నన్ను నమ్మి గెలిపించారు. ప్రేమాభిమానాలు కురిపించారు. ఏ వర్గానికి చెందిన వారైనా, ఏ రాజకీయ పార్టీకి మద్దతిచ్చినా, రోజు రోజుకీ నాపై వేధింపులు ఎక్కువైనప్పుడు అండగా నిలిచారు. మీ అంతులేని ప్రేమే నన్ను రక్షించింది. వరదల సమయంలో ఎదురైన పరిస్థితులను ఎప్పటికీ మర్చిపోలేను. కుటుంబాలు జీవితాలను కోల్పోయినా, ఆస్తులన్నీ కొట్టుకుపోయినా మీలో ఒక్కరు కూడా హుందాతనాన్ని కోల్పోలేదు. మళ్లీ నన్ను గెలిపించారు. మీ ప్రేమను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.

వేలాది మంది ప్రజల ఎదుట నా ప్రసంగాలను అనువాదం చేసిన ధైర్యసాహసాలు కలిగిన యువతులను మర్చిపోలేను. పార్లమెంట్‌లో మీ తరఫును గొంతు వినిపించడం నిజంగా ఎంతో సంతోషాన్ని, గౌరవాన్ని ఇచ్చింది. బాధగా ఉన్నా, వెళ్లక తప్పడం లేదు. మీ తరఫున పోరాడేందుకు నా సోదరి ప్రియాంక గాంధీ ఉన్నారు. మీరు ఆమెకు అవకాశం ఇస్తే.. మీ ఎంపీగా అద్భుతంగా పని చేస్తారన్న నమ్మకం నాకుంది. రాయ్‌బరేలీలోనూ ఇక్కడిలాగే ఆదరాభిమానాలు చూపించే ప్రజలున్నారు. మీతోపాటు రాయ్‌బరేలి ప్రజలకు ఒకే మాట ఇస్తున్నా. దేశంలో రోజురోజుకి వ్యాప్తి చెందుతున్న విద్వేషం, హింసపై పోరాడి వాటిని ఓడిస్తాను. మీరంతా నా కుటుంబ సభ్యులే. మీకెప్పటికీ అండగా ఉంటాను’ అంటూ రాహుల్ భావోద్వేగపూరిత లేఖ రాశారు. ఈ లేఖ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

For Latest News and National News click here

Updated Date - Jun 23 , 2024 | 09:20 PM