Share News

Chenab Rail Bridge: ఒక ట్వీట్‌తో భారత్ గొప్పతనాన్ని చెప్పిన రైల్వే మంత్రి..

ABN , Publish Date - Sep 27 , 2024 | 12:51 PM

ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెనగా గుర్తింపు పొందింది. వంపు వంతెన నిర్మాణంలో భాగంగా 2017 నవంబర్:‌లో బేస్ సపోర్ట్ పూర్తైనట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. 2021 ఏప్రియల్‌లో చీనాబ్ రైలు వంతెన ఆర్చ్ పనులు పూర్తికాగా..

Chenab Rail Bridge: ఒక ట్వీట్‌తో భారత్ గొప్పతనాన్ని చెప్పిన రైల్వే మంత్రి..
Ashwini Vaishnaw

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ భారత్ గొప్పతనాన్ని తెలియజేస్తూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హెలికాఫ్టర్ షాట్- చీనాబ్ బ్రిడ్జ్ అంటూ ఆయన పోస్టు చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. కాశ్మీర్ లోయను ప్రపంచంతో కలుపుతున్న చీనాబ్ రైల్వే వంతెన యొక్క ఉత్కంఠభరితమైన దృశ్యాన్ని చూపించే వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. చీనాబ్ రైలు వంతెనను భారతీయ రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఉక్కు, కాంక్రీట్‌తో నిర్మించిన ఈ వంపు వంతెన జమ్మూ కశ్మీర్‌లోని జమ్మూ డివిజన్ రియాసి జిల్లా బక్కల్, కౌరీ మధ్య ఉంది. సింగిల్ ట్రాక్ రైలు మార్గంగా దీనిని భారతీయ రైల్వే నిర్మించింది. ఈ వంతెన నదికి ఎగువన 1178 అడుగుల ఎత్తులో చీనాబ్ నదిపై ఉంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెనగా గుర్తింపు పొందింది. వంపు వంతెన నిర్మాణంలో భాగంగా 2017 నవంబర్:‌లో బేస్ సపోర్ట్ పూర్తైనట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. 2021 ఏప్రియల్‌లో చీనాబ్ రైలు వంతెన ఆర్చ్ పనులు పూర్తికాగా.. 2022 ఆగష్టులో మొత్తం వంతెన నిర్మాణం పూర్తైంది. చీనాబ్ బ్రిడ్జ్ ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్‌ ప్రాజెక్టులో భాగంగా ఉంది. ఈ ప్రాజెక్టును ఈ ఏడాది ఫిబ్రవరి 20న ప్రధాని నరేంద్రమోదీ అధికారికంగా ప్రారంభించారు. బనిహాల్-సంగల్దన్ సెక్షన్ల మధ్య మొత్తం 48.1 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఈ ఏడాది జూన్ 20న భారతీయ రైల్వే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై ఎనిమిది కోచ్‌ల మెమూ రైలు ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించి.. కాశ్మీర్‌లోని రియాసి నుండి బారాముల్లా వరకు రైలు సేవల ప్రారంభానికి మార్గం సుగమం చేసింది. గంటలకు 40 కిలోమీటర్ల వేగంతో ఈ మార్గంలో రైలు ప్రయాణిస్తుంది. దీనికి సంబంధించిన హెలికాఫ్టర్ షాట్ వీడియోను రైల్వే శాఖ మంత్రి ఎక్స్‌లో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది.

Raghurama Case: వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణ రాజుకు సీఐడీ కస్టడీలో చిత్రహింసలు కేసులో కీలక పరిణామం


చీనాబ్ బ్రిడ్జి ప్రత్యేకతలు..

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా చీనాబ్ వంతెన ప్రసిద్ధి చెందింది. కాశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించడానికి భారతీయ రైల్వే చీనాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించింది. ఈ వంతెన పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు, కుతుబ్ మినార్ కంటే 5 రెట్లు ఎత్తులో ఉంది. ఈ వంతెన పొడవు 1.315 కి.మీ. నది మట్టం నుండి 359 మీటర్ల ఎత్తులో ఉంది. రిక్టర్‌ స్కేలుపై 8 తీవ్రతతో వచ్చే భూకంపాలను కూడా తట్టుకునే సామర్థ్యం ఈ వంతెనకు ఉంది. ఈ వంతెన గంటకు 260 కి.మీ వేగంతో గాలులను కూడా తట్టుకోగలదు. కాశ్మీర్ లోయ కనెక్టివిటీని పెంచడమే లక్ష్యంగా ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. రూ.1486 కోట్లతో ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టు కింద దీనిని నిర్మించారు.


రెడ్‌ బుక్‌ అమలు మొదలైంది!

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 27 , 2024 | 12:51 PM