Share News

Rains: విస్తారంగా వర్షాలు.. నీలగిరి జిల్లాను వీడని వాన

ABN , Publish Date - Aug 06 , 2024 | 01:36 PM

స్థానిక నుంగంబాక్కం(Nungambakkam)లోని వాతావరణ శాఖ కార్యాలయం సోమవారం తన ట్విట్టర్‌లో నమోదుచేసిన ప్రకారం... వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు, భారీ వర్షాలు కురుస్తున్నందున ఆనకట్టలు, చెరువులు, వాగులు నిండుతున్నాయి.

Rains: విస్తారంగా వర్షాలు.. నీలగిరి జిల్లాను వీడని వాన

- గూడలూరు ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే అవకాశం

బంగాళాఖాతం పశ్చిమ దిశ గాలుల వేగంలో మార్పుల కారణంగా రాష్ట్రంలో ఈ నెల 10వ తేది వరకు పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన వర్షం కారణంగా ప్రధాన రోడ్లలో వరద నీరు భారీగా నిలిచింది. దీంతో, వాహన చోదకులు ఇబ్బందుల పాలయ్యారు.

చెన్నై: స్థానిక నుంగంబాక్కం(Nungambakkam)లోని వాతావరణ శాఖ కార్యాలయం సోమవారం తన ట్విట్టర్‌లో నమోదుచేసిన ప్రకారం... వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు, భారీ వర్షాలు కురుస్తున్నందున ఆనకట్టలు, చెరువులు, వాగులు నిండుతున్నాయి. నీటివనరుల్లో అధిక స్థాయిలో నీటినిల్వలు పెరగడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమ దిశ గాలుల వేగం మారుతోందని, అందువల్ల చెన్నై(Chennai) సహా 17 జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇదికూడా చదవండి: Chief Minister: సిఫార్సులు వస్తున్నాయ్‌... కానీ.. ఫలితం లేదు


రాజధాని నగరంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఎగ్మూర్‌, గిండి, మధురవాయల్‌, మాంబళం, మైలాపూర్‌, తాంబరం, పెరంబూర్‌, ఎంకేబీ నగర్‌ సహా పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రధాన రోడ్లపై నీరు పారింది. కొన్ని ప్రాంతాల్లో మెట్రో, భూగర్భ డ్రైనేజీ పనులు జరుగుతుండడంతో ప్రధాన రోడ్లు జలమయం కావడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. దక్షిణ చెన్నై పరిధిలోని షోలింగనల్లూర్‌లో 12 సెం.మీ, అడయార్‌, ఐఐటీ ప్రాంతాల్లో తలా 10 సెం.మీ వర్షపాతం నమోదైంది. అదే సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు ఒరిగిపోయాయి. అడయార్‌ హైరోడ్డులో భారీ చెట్టు కూలడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై చేరిన వర్షపు నీరు, కూలిన చెట్లను కార్పొరేషన్‌ సిబ్బంది తొలగిస్తున్నారు. నగరంలోనే కాకుండా గడిచిన 24 గంటల్లో కురిసిన భారీవర్షాలకు పలు చోట్ల జనజీవనం స్తంభించింది.


nani1.jpg

గరిష్టంగా నైవేలీలో 11 సెం.మీ, కాంచీపురం(Kanchipuram)లో 10, పెరంబలూరులో 8, నుంగంబాక్కం, మీనంబాక్కం, చెంగల్పట్టు, విరుదాచలంలో తలా 4 సెం.మీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సముద్రతీర జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరికలు జారీ అయ్యాయి. మంగళవారం నుంచి 10వ తేది వరకు దక్షిణ జిల్లాలు, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.


స్తంభించిన జనజీవనం

పర్వత శ్రేణులు అధికంగా ఉన్న నీలగిరి జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. జూన్‌ నెలలో కురిసిన కుండపోత వర్షాలకు కొండచరియలు, చెట్లు విరిగిపడడంతో ఘాట్‌ రోడ్డులో వాహనా ల రాకపోకలను నిలిపివేశారు. అదే విధంగా పలు గిరిజన గ్రామాలకు విద్యుత్‌ సరఫరా కూడా ఆపేశారు. ఈ నేపథ్యంలో, వర్షం ప్రభావంతో జిల్లాలోని గూడలూరు(Gudalur) సమీపంలో ఉన్న కొక్కల్‌ ప్రాంతంలో ఇళ్ల గోడల కు బీటలు బారాయి. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. బీటలు బారిన గూడలూరు మున్సిపాలిటీ పరిధిలో 21వ వార్డు గోపాల్‌ కాలనీని ఐఐటీ నిపుణులు సోమవారం పరిశీలించారు.


సుమారు 80కి పైగా కుటుంబాలను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. 15కు పైగా ఇళ్లు, ప్రార్థనా మందిరం, వృద్ధాశ్రమంలో బీటలు ఏర్పడడంతో 48 మంది వృద్ధులను పునరావాస కేంద్రానికి తరలించారు. పరిశీలించిన ఐఐటీ నిపుణులు గోపాల్‌ కాలనీలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉం దని హెచ్చరించారు. దీంతో అధికారు లు ఆ ప్రాంతంలోని ఆస్పత్రిలో ఉన్న రోగులను ఊటీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఔట్‌ పేషంట్‌ విభాగాలు మూసివేశారు. కేంద్ర పురావస్తు పరిశోధన విభాగం నిపుణులు, భద్రతా విభాగం అధికారులు మంగళవారం మళ్లీ ఈ ప్రాంతంలో పరిశీలిస్తారని తెలిసింది. గోపాల్‌ కాలనీ ప్రాంతం, పరిసరాల్లో ప్రజలు సంచరించేందుకు నిషేధం విధించి హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటుచేశారు.


ఇదికూడా చదవండి: TG News: పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే పైనుంచి దూకిన గుర్తు తెలియని వ్యక్తి

ఇదికూడా చదవండి: RBI Official: రూ.40 కోట్ల ఆర్థిక మోసం కేసు.. బషీద్‌కు ఆర్‌బీఐ అధికారి సహకారం?

ఇదికూడా చదవండి: KTR: రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు!

Updated Date - Aug 06 , 2024 | 01:36 PM