Raj Thackeray: అమిత్‌షాను కలిసిన రాజ్‌థాకరే.. మహారాష్ట్రలో గరిష్ట సీట్లపై బీజేపీ కన్ను
ABN , Publish Date - Mar 19 , 2024 | 03:04 PM
మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే ఎన్డీయేలో చేరే అవకాశాలున్నాయి. ఇందుకు అనుగుణంగా ఆయన సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో మంగళవారం సమావేశమయ్యారు.
ముంబై: మహారాష్ట్ర (Maharashtra)లో రాజకీయ సమీకరణలు మారబోతున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) సారధ్యంలోని శివసేనను ఎదుర్కొని, ఆ రాష్ట్రంలో గరిష్టంగా సీట్లు దక్కించుకోవాలనే పట్టుదలతో బీజేపీ (BJP) పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఉద్ధవ్ కజిన్, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరేను ఎన్డీయేలోకి తీసుకునేందుకు పావులు కదుపుతోంది. ఇందుకు అనుగుణంగా రాజ్‌థాకరే సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో మంగళవారం సమావేశమయ్యారు.
పిలిచారు...వచ్చాను..
''ఢిల్లీకి రమ్మని పిలిచారు. అందుకే వచ్చాను. ఏం జరుగుతుందో చూద్దాం'' అని సోమవారం రాత్రి న్యూఢిల్లీకి చేరుకోగానే రాజ్‌థాకరే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. దీనిపై ఎంఎన్ నేత సందీప్ దేశ్‌షాండే మాట్లాడుతూ, అమిత్‌షాతో సమావేశం పూర్తికాగానే వివరాలు చెబుతామని అన్నారు. నిర్ణయం ఏది తీసుకున్నప్పటికీ మరాఠా ప్రజలకు, హిందుత్వకు, పార్టీకి ప్రయోజనకారిగా ఉంటుందని తెలిపారు. కాగా, మహారాష్ట్రలోని దక్షిణ ముంబై, షిర్డి, నాసిక్ నియోజకవర్గాలను ఎంఎన్‌ఎస్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈసారి లాభపడాలనుకుంటున్న ఎంఎన్ఎస్
శివసేనతో విభేదాల కారణంగా 2006లో ఎంఎన్ఎస్ పార్టీని రాజ్‌థాకరే ఏర్పాటు చేశారు. 2009 రాష్ట్ర ఎన్నికల్లో ఎంఎన్ఎస్ 13 సీట్లు గెలుచుకుంది. అయితే 2014లో ఆ పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. 2019లో పోటీ చేసినా ఫలితంలో పెద్దగా మార్పులేదు. దీంతో దశాబ్ద కాలంగా రాజ్‌థాకరే రాజకీయంగా అంతగా ప్రచారంలో లేరు. మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలకే పరిమితమవుతూ వచ్చారు. ఈ క్రమంలోనే శివసేనలో చీలిక రావడంతో పార్టీ సంక్షోభానికి ఉద్ధవ్ కారణమంటూ అప్పట్లో విమర్శలు గుప్పించారు. సీఎం పగ్గాలు చేపట్టిన ఏక్‌నాథ్ షిండేతో సుహద్భావ సంబంధాలు నెరపుతూ వస్తున్నారు. ఇద్దరూ పలు పలు సందర్భాల్లో కలిసి కనిపించడం జరిగింది. ఈ క్రమంలో మహారాష్ట్రలోని విపక్ష 'మహావికాస్ అఘాడి'ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఎంఎన్‌ఎస్‌ను కలుపుకొని వెళ్లాలని బీజేపీ యోచనగా ఉంది. బీజేపీతో సీట్ల షేరింగ్ ఖరారయితే ఎంఎన్ఎస్ మరోసారి రాజకీయంగా బలపడే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పండితులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.