Rajasthan CM: రాజస్థాన్ ముఖ్యమంత్రిని చంపుతామని బెదిరింపులు, ముగ్గురి అరెస్ట్
ABN , Publish Date - Jan 18 , 2024 | 07:59 AM
రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మను చంపుతామని బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. బెదిరింపు కాల్ చేసిన లోకేషన్‌ను ట్రేస్ చేశారు. జైపూర్ సెంట్రల్ జైలు నుంచి ఫోన్ వచ్చినట్టు గుర్తించారు.
జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మను చంపుతామని బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. బెదిరింపు కాల్ చేసిన లోకేషన్ ట్రేస్ చేశారు. జైపూర్ సెంట్రల్ జైలు నుంచి ఫోన్ వచ్చినట్టు గుర్తించారు. పోక్సో చట్టం కింద అరెస్టై జైలులో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి ఫోన్ చేశాడని పోలీసులు చెబుతున్నారు. జైలులో ఉండే ఖైదీలు మొబైల్ వాడేందుకు అనుమతి ఉండదు. ఖైదీల గదులను నిరంతరం జైలు అధికారులు తనిఖీ చేస్తుంటారు. అయినప్పటికీ మొబైల్ నుంచి బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం రేపుతుంది.
జైలులో ఉండే ఖైదీ ముఖ్యమంత్రిని చంపుతామని బెదిరించడం పోలీసు శాఖలో చర్చకు దారితీసింది. వెంటనే విచారించి ముఖేశ్, రాకేశ్, చేతన్ అనే ముగ్గురు నిందితులను గుర్తించారు. మరో ఖైదీ వద్ద నుంచి నిందితుడు మొబైల్ తీసుకొని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మను చంపుతానని బెదిరించాడు. నిందితుడు అమీర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఓ చిన్నారిని లైంగిక వేధింపులకు గురిచేసి అరెస్ట్ అయ్యాడు. గత 5 ఏళ్ల నుంచి జైపూర్ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉంటున్నాడు. జైలు నుంచి ఖైదీ ఫోన్ చేయడంతో జైలు సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. ఇద్దరు వార్డెన్లను విధుల నుంచి తొలగించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.