Ghaziabad: 30 ఏళ్ల క్రితం కిడ్నాప్.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
ABN , Publish Date - Nov 29 , 2024 | 11:30 AM
ఘజియాబాద్ సాహిబాబాద్ ప్రాంతంలో 8, సెప్టెంబర్ 1993న ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ రోజు సాయంత్రం రాజు, అతని సోదరి పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వస్తున్నారు. అప్పుడు రాజు వయస్సు సరిగ్గా ఏడేళ్లు.
ఉత్తర్ ప్రదేశ్: ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో కిడ్నాప్‌కు గురైన ఏడేళ్ల బాలుడు 30 ఏళ్ల తర్వాత తిరిగి రావడం సంచలనంగా మారింది. పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా కిడ్నాప్ చేసిన కొంతమంది దుండగులు బాలుడిని రాజస్థాన్‌కు తీసుకెళ్లారు. చిత్రహింసలు పెడుతూ వెట్టిచాకిరి చేయించారు. ఏళ్ల తరబడి గొలుసులతో కట్టేసి బానిసగా మార్చారు. నిందితుల కుటుంబంలోని ఓ వ్యక్తి సహాయంతో ఎట్టకేలకు వారి చెర నుంచి బాధితుడు తప్పించుకున్నాడు. అనంతరం ఢిల్లీ పోలీసులను ఆశ్రయించాడు. కాగా, ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.
ఘజియాబాద్ సాహిబాబాద్ ప్రాంతంలో 8, సెప్టెంబర్ 1993న ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ రోజు సాయంత్రం రాజు, అతని సోదరి పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వస్తున్నారు. అప్పుడు రాజు వయస్సు సరిగ్గా ఏడేళ్లు. అదే సమయంలో కిడ్నాపర్ల బృందం బాలుడిని ఎత్తుకెళ్లిపోయారు. చిన్నారిని రాజస్థాన్ తీసుకెళ్లిపోయారు. అయితే రాజు సోదరి సమాచారం మేరకు బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. కిడ్నాప్ ఘటనపై పోలీసులు సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఏళ్లు గడిచినా ఆ కేసు కొలిక్కి రాలేదు. దీంతో అంతా ఆశలు వదులుకున్నారు.
మరోవైపు రాజును అపహరించిన కేటుగాళ్లు అతన్ని బానిసగా మార్చి వెట్టిచాకిరి చేయించడం మెుదలుపెట్టారు. రాజు పారిపోకుండా గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టారు. రోజుకు కేవలం ఓ రోటీ మాత్రమే ఇస్తూ పని చేయించేవారు. పని చేయకపోతే తీవ్రంగా కొట్టేవారు. ఇలా దాదాపు 30 ఏళ్లు గడిచిపోయాయి. అయితే రాజుని బంధించిన వ్యక్తి చిన్న కుమార్తె అతను తప్పించుకునేందుకు సహాయం చేసింది. అలా రాజస్థాన్ ప్రాంతం నుంచి ఢిల్లీకి అతను ఓ ట్రక్కు ఎక్కి బయలుదేరాడు. అనంతరం ఐదు రోజుల క్రితం అతను ఘజియాబాద్ చేరుకున్నాడు. రాజుకి తల్లిదండ్రుల పేర్లు, బంధువుల పేర్లు గుర్తులేవు. దీంతో ఘజియాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాడు.
చివరికి ఘజియాబాద్ ఖోడా పోలీస్ స్టేషన్‌కు రాజు చేరుకున్నాడు. అక్కడి పోలీసులు అతనికి మంచి బట్టలు, ఆహారం అందజేశారు. అనంతరం అతని గురించి మీడియా, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేశారు. అతని కుటుంబాన్ని కనుగొనడంలో సహాయం చేశారు. సోషల్ మీడియాలో రాజు గురించి తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యులు హుటాహుటిన ఖోడా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. రాజు సోదరి అతన్ని గుర్తుపట్టింది. 30 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన సోదరుడిగా నిర్ధారించింది. వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో 30 ఏళ్ల తర్వాత కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యింది.