National: పుష్ప-2 మూవీ చూస్తూ.. పోలీసులకు అడ్డంగా దొరికిన రియల్ లైఫ్ పుష్ప..
ABN , Publish Date - Dec 22 , 2024 | 07:44 PM
థియేటర్‌లో పుష్ప-2 మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న రియల్ లైఫ్ పుష్పను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో అప్పటివరకూ సినిమా చూస్తున్న ప్రేక్షకులంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇంతకీ, ఏం జరిగిందంటే...
ఈ నెల డిసెంబర్ 5న థియేటర్లలో అడుగుపెట్టిన పుష్ప-2 పాన్‌ఇండియా స్థాయిలో మునుపెన్నడూ రీతిలో రికార్డు కలెక్షన్‌లు సొంతం చేసుకుంది. రిలీజ్ అయ్యి 2 వారాలు దాటినా బాక్సాఫీస్ వద్ద పుష్ప క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఉత్తరాదిలోనూ కలెక్షన్ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇక, కలెక్షన్ల పరంగా కాక వివాదాల విషయంలోనూ జాతీయస్థాయిలో హాట్‌టాపిక్‌గా మారింది పుష్ప-2 సినిమా. ఈ నేపథ్యంలోనే మరో క్రేజీ ఘటన జరిగింది. మల్టీప్లెక్స్‌లో రీల్‌లైఫ్ పుష్ప చూస్తూ ఎంజాయ్ చేస్తున్న రియల్ లైఫ్ పుష్ప.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అసలేం జరిగిందంటే..
మహారాష్ట్ర : ఈ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ సిటీలో వెలుగు చూసింది. అర్థరాత్రి ఒక మల్టీప్లెక్స్‌లో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన పుష్ప-2 షో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులంతా. అందరూ ఆసక్తి మూవీ చూస్తుండగా థియేటర్‌లోకి పోలీసులు ఎంటర్ అయ్యారు. అంతసేపు వారితో కలిసి మూవీ చూస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడంతో ప్రేక్షకులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అతడు మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ అని తెలిసి షాకయ్యారు. ఇంతసేపూ రియల్ లైఫ్ పుష్పతో కలిసి రీల్‌లో ఉన్న పుష్పను చూశామా అని కంగుతిన్నారు. హఠాత్తుగా జరిగిన ఘటనతో భయాందోళనలకు గురైన ప్రేక్షకులను భయడవద్దంటూ హామీ ఇచ్చిన నిందితుడిని తమ వెంట తీసుకెళ్లారు పోలీసులు.
మహారాష్ట్రలో మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్‌గా పేరుగాంచాడు విశాల్ మెష్రామ్. ఈ గ్యాంగ్‌స్టర్‌పై ఇప్పటికే 27 కేసులు నమోదయ్యాయి. వాటిలో రెండు హత్య కేసులు, మాదకద్రవ్య అక్రమ రవాణా కేసులూ ఉన్నాయి. గతంలో పోలీసులపై కూడా దాడి చేసిన విశాల్.. 10 నెలలుగా పరారీలో ఉన్నాడు.
పరారీలో ఉన్నప్పటి నుంచి స్మగ్లర్ విశాల్ మెష్రామ్‌పై సైబర్ నిఘా ఉంచారు మహారాష్ట్ర పోలీసులు. అతడు వాడుతున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యువి) కదలికలను ట్రాక్ చేయడం ద్వారా థియేటర్ ఉన్నారని గుర్తించారు. నిందితుడు తప్పించుకోకుండా థియేటర్ వెలుపల గట్టి నిఘా ఏర్పటు చేసి సినిమా హాల్లోకి ప్రవేశించారు. అప్పటికే సినిమాలో లీనమై ఉన్న విశాల్ మెష్రామ్ పోలీసులు చుట్టుముట్టిన సంగతి గమనించుకోలేదు. అలా పుష్ప-2 క్లైమాక్స్ చూడకుండానే పోలీసులకు చిక్కాడు.. డేంజరస్ స్మగ్లర్ విశాల్.
పుష్ప-2 సినిమా చూస్తూ అరెస్ట్ అయిన స్మగ్లర్ విశాల్‌ను నాగ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. త్వరలోనే నాసిక్ జైలుకు తరలించనున్నారు.