Haryana: కాంగ్రెస్‌ను ఓడించింది.. బీజేపీని గెలిపించింది ఆ ఇద్దరే..
ABN , Publish Date - Oct 09 , 2024 | 04:09 PM
భూపేంద్రసింగ్ హుడా, కుమారి షెల్జా మధ్య మాటల యుద్ధం నడిచింది. సీఎం అభ్యర్థి రేసులో ఉన్నానంటూ షెల్జా చేసిన ప్రకటన హుడా వర్గానికి కోపం తెప్పించింది. హుడా మాత్రం అధిష్టానం నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాలని..
హర్యానాలో ఈసారి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ప్రకటించింది. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఎగ్జిట్‌పోల్స్ కాంగ్రెస్ మెజార్టీ మార్క్ దాటుతుందని చెప్పాయి. హర్యానాలో ఈసారి గెలిచేది కాంగ్రెస్ అనే ప్రచారం దేశ వ్యాప్తంగా సాగింది. రైతుల ఉద్యమం, రెజ్లర్ల ఆందోళన, అగ్నివీర్ స్కీమ్‌పై నిరసన కలగలిపి బీజేపీకి హర్యానాలో ఎదురుదెబ్బ తప్పదనే చర్చ జరిగింది. అందుకే ఎన్నికల షెడ్యూల్ తర్వాత హర్యానాలో ఏ పార్టీ గెలుస్తుందనే చర్చ కంటే కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై చర్చ జరిగింది. సీనియర్ నేతలు ఇద్దరూ రెండు వర్గాలుగా విడిపోయారు. భూపేంద్రసింగ్ హుడా, కుమారి షెల్జా మధ్య మాటల యుద్ధం నడిచింది. సీఎం అభ్యర్థి రేసులో ఉన్నానంటూ షెల్జా చేసిన ప్రకటన హుడా వర్గానికి కోపం తెప్పించింది. హుడా మాత్రం అధిష్టానం నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాలని ప్రకటించారు. హర్యానా ఎన్నికల వేళ హైకమాండ్ సీనియర్ నేత భూపేంద్రసింగ్ హుడాకు పూర్తి స్వేచ్చనిచ్చింది. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ హుడా మాటకు ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో సిర్సా ఎంపీ కుమారి షెల్జా కొంత అసంతృప్తితో ఉన్నారు. ఈ కారణంగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలోనూ ఆమె పెద్దగా కనిపించలేదు. షెల్జా సిఫార్సు చేసిన వారిలో ఎక్కువమందికి సీట్లు దక్కలేదు. దీంతో కొంతమంది పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ రెబల్స్‌గా పోటీకి దిగారు. చివరకు ఫలితాలు మాత్రం కాంగ్రెస్‌కు నిరాశను కలిగించాయి. ఫలితాలు రాకుండానే అధికారంలోకి వస్తామని, కేబినేట్‌లో ఎవరుండాలనే లెక్కలు వేసుకున్న కాంగ్రెస్ అధికారానికి పది సీట్ల దూరంలో నిలిచిపోయింది. ప్రస్తుతం హర్యానా ఫలితాల్లో కాంగ్రెస్ ఓటమికి హుడా, షెల్జా కారణమంటూ పార్టీ శ్రేణులు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. ఈ ఓటమికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ హుడాను ఉద్దేశించి షెల్జా మీడియాలో వ్యాఖ్యానించారు.
ఆ ఇద్దరే..
కాంగ్రెస్ ఓటమికి భూపేంద్రసింగ్ హుడా, షెల్జా కారణమంటూ ప్రచారం జరుగుతున్న వేళ.. బీజేపీ గెలుపులో ఇద్దరు నేతలు కీలకంగా పనిచేశారు. ఒకరు సీఎం నయాబ్ సింగ్ సైనీ కాగా.. మరొకరు సీనియర్ నేత అనిల్ విజ్. పోలింగ్ తర్వాత సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్‌పోల్స్ అన్ని కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. అనిల్ విజ్ మాత్రం ఫలితాల తర్వాత హర్యానాలో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీలో కొందరు నేతల తీరుపై అనిల్ విజ్ అసంతృప్తితో ఉన్నప్పటికీ వాటిని పెద్దగా పట్టించుకోకుండా పార్టీ గెలుపు కోసం పనిచేశారు. మరోవైపు నయాబ్ సింగ్ సైనీని హర్యానా సీఎంగా ప్రకటించిన తర్వాత చాలామంది ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకించారు. అయినప్పటికీ సామాజిక సమీకరణల దృష్ట్యా ఏడు నెలల ముందే ఓబీసీ వర్గానికి చెందిన సైనీని బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రిని చేసింది. ఆ నిర్ణయమే బీజేపీకి ఎన్నికల్లో కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. జాట్‌లు బీజేపీకి వ్యతిరేకంగా మారడంతో.. జాట్‌యేతర వర్గాలను ఏకం చేయడంలో బీజేపీ సఫలీకృతమైనట్లు తెలుస్తోంది. నయాబ్ సింగ్ సైనీ 200 రోజుల వ్యవధిలో తీసుకున్న నిర్ణయాలు, నాయకుల సమిష్టికృషి, ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నాయకులను పక్కనపెట్టి దాదాపు 60 మంది కొత్త ముఖాలకు టికెట్లు కేటాయించడం వంటి అంశాలు బీజేపీకి కలిసొచ్చినట్లు తెలుస్తోంది. సైనీ, అనిల్ విజ్ పార్టీ గెలుపులో కీలకంగా పనిచేయగా.. కాంగ్రెస్ ఓటమికి ఇద్దరు నేతల మధ్య విబేధాలు కారణమనే చర్చ జరుగుతోంది.
హుడానే కొంప ముంచారా..
భూపేంద్రసింగ్ హుడాకు కాంగ్రెస్ అధిష్టానం అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. కొందరు గెలిచే అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకుండా.. తన సీఎం అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపేందుకు తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కారణంగానే షెల్జా అసంతృప్తికి గురయ్యారనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరనేది అధికారికంగా ఎన్నికల ముందు ప్రకటించకపోయినా.. భూపేంద్రసింగ్ హుడా సీఎం అవుతారంటూ పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అతి విశ్వాసంతో హుడా కాంగ్రెస్ కొంపముంచారని సొంత పార్టీ నేతలే ప్రస్తుతం విమర్శిస్తున్నారు. మరోవైపు ఆయన వయసు 77 ఏళ్లు. గతంలో సీఎంగా పనిచేశారు. అయినప్పటికీ అధిష్టానం కొత్త రక్తాన్ని ప్రోత్సహించకుండా ఇంకా హుడా నాయకత్వానికే ప్రాధాన్యత ఇవ్వడం ఆ పార్టీ ఓటమికి కారణంగా తెలుస్తోంది. ఏది ఏమైనా కాంగ్రెస్ ఓటమికి ఇద్దరు వ్యక్తులు కారణమైతే.. మరో ఇద్దరు వ్యక్తులు బీజేపీని హర్యానాలో విజయతీరాలకు చేర్చారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here