Share News

Sandeep Dikshit: అతిషి, సంజయ్ సింగ్‌‌పై రూ.10 కోట్ల పరువునష్టం దావా

ABN , Publish Date - Dec 31 , 2024 | 05:13 PM

బీజేపీ నుంచి తాను పెద్దమొత్తంలో డబ్బులు తీసుకున్నట్టు ఐదారు రోజుల క్రితం అతిషి ఆరోపించారని, గత 10-12 ఏళ్లుగా కాంగ్రెస్‌ను, తనను, తన కుటుంబాన్ని వాళ్లు టార్గెట్ చేసుకున్నారని సందీప్ దీక్షిత్ తెలిపారు.

Sandeep Dikshit: అతిషి, సంజయ్ సింగ్‌‌పై రూ.10 కోట్ల పరువునష్టం దావా

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి డబ్బులు తీసుకున్నట్టు తనపై ఆరోపణలు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌పై పరువునష్టం దావా వేయనున్నట్టు కాంగ్రెస్ నేత, ఈస్ట్ ఢిల్లీ మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ (Sandeep Dikshit) తెలిపారు. మంగళవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, బీజేపీ నుంచి తాను పెద్దమొత్తంలో డబ్బులు తీసుకున్నట్టు ఐదారు రోజుల క్రితం అతిషి ఆరోపించారని, గత 10-12 ఏళ్లుగా కాంగ్రెస్‌ను, తనను, తన కుటుంబాన్ని వాళ్లు టార్గెట్ చేసుకున్నారని తెలిపారు. తాను పది పన్నిండేళ్లుగా 'ఆప్'ను ఆనేక ప్రశ్నలు వేశానని, ఆయన (కేజ్రీవాల్) షీలా దీక్షిత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 360 పేజీల సాక్షాలున్నాయని చెప్పుకుని తిరిగే వారని వివరించారు.

Delhi Assembly Elections 2025: హనుమాన్ టెంపుల్ నుంచి కొత్త స్కీమ్ రిజిస్ట్రేషన్ షురూ


''కేజ్రీవాల్ సీఎం అయిన తర్వాత షీలా దీక్షిత్‌పై సాక్ష్యాలను అడుగుతూ బీజేపీ ప్రతినిధి బృందం ఆయనను కలిసింది. అరవింద్ కేజ్రీవాల్ 360 పేపర్ కటింగ్‌లు తమకు చూపించినట్టు బీజేపీ నేత విజయ్ కుమార్ మల్హోత్రా నాకు చెప్పారు. పేపర్ కటింగ్‌లను సాక్ష్యాలుగా చూపించిన మొదటి వ్యక్తి కేజ్రీవాల్'' అని సందీప్ దీక్షిత్ తెలిపారు. బీజేపీ నుంచి తాను డబ్బులు తీసుకున్నట్టు అతిషి ఆరోపించిన రోజే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారని, దాంతో తాను మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదని ఆయన చెప్పారు. ఈరోజు మీడియా సమావేశం పూర్తి కాగానే అతిషి, సంజయ్ సింగ్‌పై రూ.10 కోట్లకు సివిల్, క్రిమినల్ కేసులు వేస్తానని చెప్పారు. రూ.5 కోట్లు యమునా జలాల ప్రక్షాళన, ఢిల్లీలోని వాయుకాలుష్య నిరోధక చర్యల కోసం రూ.5 కోట్లు విరాళంగా ఇస్తానని తెలిపారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడైన సందీప్ దీక్షిత్.. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్‌‌పై న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.


సంక్షేమ పథకాలపై విసుర్లు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ 'ఆప్' ప్రకటించిన సంక్షేమ పథకాలను సందీప్ దీక్షిత్ సూటిగా ప్రశ్నించారు. ''ఇప్పుడే ఈ సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేస్తున్నారు? ఇంతకుముందు ఎందుకు చేయలేకపోయారు?'' అని ప్రశ్నించారు. ఐదేళ్ల పాటు వాళ్లే అధికారంలో ఉన్నారనీ, ఆయన జైలుకు వెళ్లడంతో 17 నెలల మంచి సమయం వృథా చేశారని అన్నారు. ఆయన అంతకుముందే రాజీనామా చేసి పెండింగ్ పనులు పూర్తి చేసి ఉండొచ్చని అన్నారు. ఆయన తిరిగి సీఎం అయినా కూడా ఇచ్చిన వాగ్దానాలు, ప్రకటించిన పథకాలు, పనులు పూర్తి చేయడం సాధ్యం కాదని సందీప్ దీక్షిత్ అన్నారు.


ఇవి కూడా చదవండి..

CM MK Stalin : కన్యాకుమారిలో అద్దాల వంతెన

‘మహా’ కుంభమేళా!

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 31 , 2024 | 05:13 PM