Trains cancelled: భారీ వర్షాలకు 432రైళ్లు రద్దు..
ABN , Publish Date - Sep 02 , 2024 | 12:02 PM
బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. వర్షాలకు 432రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
హైదరాబాద్: బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. వర్షాలకు 432రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వీటితోపాటు మరో 140రైళ్లు దారి మళ్లించినట్లు తెలిపింది. అలాగే 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు పేర్కొంది. వీటిలో సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, పలు పాసింజర్ రైళ్లు ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
ఏపీ, తెలంగాణలో రద్దయిన రైళ్లు ఇవే..
వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 80 రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అదే విధంగా మరో 48 ట్రైన్లను దారి మళ్లిస్తున్నట్లుగా రైల్వే శాఖ అధికారులు తెలిపారు. విజయవాడ– సికింద్రాబాద్- విజయవాడ, గుంటూరు–సికింద్రాబాద్, కాకినాడ పోర్ట్– లింగంపల్లి, గూడూరు– సికింద్రాబాద్, సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్ నగర్, భద్రాచలం– బల్లార్షా, కాజీపేట– డోర్నకల్, బల్లార్షా– కాజీపేట, భద్రాచలం– సికింద్రాబాద్, హైదరాబాద్ –షాలిమార్, సికింద్రాబాద్ –విశాఖపట్నం సహా పలు రైళ్లు రద్దయ్యాయి.
తెలంగాణలో బస్సులు రద్దు..
మరోవైపు హైదారాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై పలుచోట్ల భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. ఈ మేరకు 560కి పైగా బస్ సర్వీసులు రద్దు చేస్తూ టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలో 160, వరంగల్ 150, రంగారెడ్డి 70కి పైగా బస్ సర్వీసులు రద్దు చేసినట్లు టీజీఎస్ ఆర్టీసీ తెలిపింది.