Haryana Politics: చౌతాలా పార్టీలో చీలిక!
ABN , Publish Date - May 10 , 2024 | 03:38 AM
హరియాణాలో రాజకీయ సంక్షోభం కొత్త మలుపులు తీసుకుంటోంది. కాంగ్రె్‌సతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని భావిస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) చీలిక ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది.
హరియాణా సంక్షోభంలో మరో మలుపు
మాజీ సీఎం ఖట్టర్‌తో నలుగురు జేజేపీ ఎమ్మెల్యేల భేటీ
విశ్వాసపరీక్షకు ఆదేశించాలని గవర్నర్‌కు దుష్యంత్ చౌతాలా లేఖ
న్యూఢిల్లీ, మే 9 (ఆంధ్రజ్యోతి): హరియాణాలో రాజకీయ సంక్షోభం కొత్త మలుపులు తీసుకుంటోంది. కాంగ్రె్‌సతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని భావిస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) చీలిక ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు గురువారం బీజేపీ నేత, రాష్ట్ర మాజీ సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సమావేశమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నాయబ్‌సింగ్ సైనీ విలేకర్లతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని, మార్చిలో జరిగిన విశ్వాస పరీక్షలో విజయం సాధించామని, అవసరమైతే మరోసారి విశ్వాసపరీక్షకు సిద్ధమని స్పష్టం చేశారు.
మరోవైపు, దుష్యంత్ చౌతాలా గురువారం రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ రాశారు. బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడినందున శాసనసభలో మెజారిటీ నిరూపించుకోవల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాలని విజ్ఞప్తి చేశారు. కాం గ్రెస్ కూడా గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరింది. రాష్ట్రం లో పరిస్థితులను వివరించటానికి శుక్రవారం తమకు సమయం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. హరియాణాలో రాష్ట్రపతి పాలన విధించి తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరిపించాలని కాంగ్రెస్ ఇప్పటికే డిమాండ్ చేసింది.
అసెంబ్లీలో బలాబలాలు
ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో హరియాణలో సీఎం నాయబ్‌సింగ్ సైనీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడిన విషయం తెలిసిందే. 90 సీట్లు ఉండే హరియాణా అసెంబ్లీలో రెండు సీట్లు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం 88 మంది సభ్యులు ఉన్నారు. మెజారిటీకి 45 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా బీజేపీకి శాసనసభలో 40 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. 10 మంది సభ్యులు ఉన్న జేజేపీ తొలుత బీజేపీకి మద్దతు ఇచ్చినప్పటికీ మార్చిలో ఉపసంహరించుకుంది. కాంగ్రె్‌సకు 30 మంది ఎమ్మెల్యేలున్నారు. ఐఎన్‌ఎల్‌డీ, హరియాణా లోక్‌హిత్ పార్టీలకు చెరో ఎమ్మెల్యే ఉన్నారు. ఆరుగురు ఇండిపెండెంట్లు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే మరో 15 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అక్టోబరులో హరియాణా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.