Sumalata: నటి సుమలత సిట్టింగ్ సీటు గోవిందా.. మండ్య లోక్‌సభ జేడీఎస్‌కే...
ABN , Publish Date - Mar 19 , 2024 | 01:04 PM
మండ్య లోక్‌సభ స్థానం బీజేపీ(BJP)తో పొత్తులో భాగంగా జేడీఎస్ పరం కావడంతో ఇక్కడి నుంచి కుమారస్వామి లేదా నిఖిల్‌కుమార్‌లలో ఒకరు అభ్యర్థి కానున్నారు. జేడీఎస్ పార్టీ రెండు నెలల కిందటే మండ్యనుంచి మాజీ మంత్రి పుట్టరాజు పోటీ చేసేలా సూచించింది.
- నిఖిల్ లేదా కుమారస్వామి పోటీ
- చిక్కబళ్లాపురకు వెళ్లాలని సుమలతకు సూచన
బెంగళూరు: మండ్య లోక్‌సభ స్థానం బీజేపీ(BJP)తో పొత్తులో భాగంగా జేడీఎస్ పరం కావడంతో ఇక్కడి నుంచి కుమారస్వామి లేదా నిఖిల్‌కుమార్‌లలో ఒకరు అభ్యర్థి కానున్నారు. జేడీఎస్ పార్టీ రెండు నెలల కిందటే మండ్యనుంచి మాజీ మంత్రి పుట్టరాజు పోటీ చేసేలా సూచించింది. అందుకు అనుగుణంగానే పుట్టరాజు ప్రచారం సాగించుకుంటున్నారు. అనూహ్యంగా ఇదే స్థానం నుంచి పుట్టరాజుకు బదులుగా కుమారస్వామి లేదా నిఖిల్‌ను పోటీ చేయించాలని జేడీఎస్‌తో పాటు బీజేపీకి చెందిన స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీతో పొత్తులో భాగంగా జేడీఎస్(JDS)కు మండ్య, హాసన్, కోలార్ స్థానాలు కేటాయించారు. హాసన్ నుంచి సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(MP Prajwal Revanna) మరోసారి అభ్యర్థి కానున్నారు. ఇక మిగిలిన కీలక నియోజకవర్గం మండ్య కావడంతో దేవెగౌడ కుటుంబానికి చెందినవారే పోటీ చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ఇదే జరిగితే మండ్య సిట్టింగ్ ఇండిపెండెంట్ ఎంపీ, ప్రస్తుతం బీజేపీకి మద్దతు ఇస్తున్న సుమలత(Sumalata)కు చిక్కబళ్లాపుర నుంచి పోటీ చేయడం అనివార్యం కానుంది. ఆమె మండ్య మినహా మరో నియోజకవర్గానికి వెళ్లేది లేదని కొంతకాలంగా చెబుతున్నారు. రెండునెలల వ్యవధిలో బీజేపీ అగ్రనేతలతో నాలుగైదుసార్లు చర్చలు జరిపారు.
తాజాగా ఆదివారం అగ్రనేతల పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లారు. పొత్తులో భాగంగా మండ్య జేడీఎస్‌కు కేటాయించామని, సహకరించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించినట్లు తెలుస్తోంది. మండ్య అభ్యర్థి విజయానికి పనిచేయాలని కూడా సూచించినట్లు సమాచారం. చిక్కబళ్లాపుర నుంచి పోటీ అంశమై నిర్ణయం తీసుకోవాలని వివరించినట్లు తెలుస్తోంది. బెంగళూరు నగర పరిధిలో సెంట్రల్‌ను మరోసారి పీసీ మోహన్‌కు, ఉత్తర స్థానం శోభాకరంద్లాజెకు, దక్షిణ నుంచి మరోసారి తేజస్వీ సూర్యను అభ్యర్థులుగా ప్రకటించారు. బెంగళూరు గ్రామీణ నుంచి అనూహ్యంగా డాక్టర్ సీఎన్ మంజునాథ్ అభ్యర్థి అయిన విషయం తెలిసిందే. దీనిని బట్టి బెంగళూరు పరిధిలో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో సుమలత పోటీ చేస్తే చిక్కబళ్లాపుర నుంచి లేదా ప్రస్తుత ఎన్నికల బరి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరో రెండు రోజుల్లోనే బీజేపీ మిగిలిన అభ్యర్థులు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి.