Supreme Court : నీట్ రద్దుపై కేంద్రం, ఎన్‌టీఏకి సుప్రీం నోటీసులు
ABN , Publish Date - Jun 21 , 2024 | 05:00 AM
నీట్ పరీక్షను రద్దు చేసి, మళ్లీ కొత్తగా పరీక్ష నిర్వహించాలని కోరుతూ 20 మంది అభ్యర్థులు దాఖలుచేసిన పిటిషన్లపైన, నీట్ అక్రమాలపై స్వతంత్ర కమిటీతో దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన మరో పిటిషన్‌పైన..
కౌన్సెలింగ్‌పై నిలుపుదల
ఉత్తర్వులు ఇవ్వడానికి నో!
నీట్ రద్దుపై కేంద్రానికి, ఎన్‌టీఏకి
సుప్రీం కోర్టు నోటీసులు
కౌన్సెలింగ్‌పై నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వడానికి నో!
న్యూఢిల్లీ, జూన్ 20(ఆంధ్రజ్యోతి): నీట్ పరీక్షను రద్దు చేసి, మళ్లీ కొత్తగా పరీక్ష నిర్వహించాలని కోరుతూ 20 మంది అభ్యర్థులు దాఖలుచేసిన పిటిషన్లపైన, నీట్ అక్రమాలపై స్వతంత్ర కమిటీతో దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన మరో పిటిషన్‌పైన.. స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు గురువారం కేంద్రానికి, ఎన్‌టీఏకి ఆదేశాలు జారీచేసింది. అలాగే.. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో నమోదైన కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ ఎన్‌టీఏ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అన్ని హైకోర్టుల్లో నీట్‌పై జరుగుతున్న ప్రొసీడింగ్స్‌పై స్టే విధించింది.
జూలై 6 నుంచి నిర్వహించతలపెట్టిన నీట్ కౌన్సెలింగ్‌పై నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చేందుకు మాత్రం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టితో కూడిన సుప్రీం ద్విసభ్య ధర్మాసనం తిరస్కరించింది. పిటిషనర్లలో పలు కోచింగ్ సంస్థలు ఉన్నట్టు కేంద్రం తరఫు న్యాయవాది విచారణ సందర్భంగా కోర్టు దృష్టికి తేగా.. వారు విద్యార్థులకు కోచింగ్ ఇచ్చే వ్యాపారం చేస్తున్నారని.. వారికి అలా వచ్చే హక్కు ఉన్నదని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘విద్యార్థుల హక్కులతో మీరు చెలగాటమాడితే కోచింగ్ సంస్థలు కోర్టుకు రాకుండా ఉంటాయా?’ అని నిలదీసింది. కాగా.. సుప్రీంకోర్టు ఆదేశిస్తే నీట్‌ను మళ్లీ నిర్వహించేందుకు కేంద్ర విద్యాశాఖ సిద్ధంగా ఉందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
ఇక.. నీట్ అవకతవకలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న నేపథ్యంలో ఈ అంశం కేంద్ర హోం మంత్రి అమిత్ షా వద్దకు చేరింది. కేంద్ర మంత్రులు ధర్మేంద్రప్రధాన్, జేపీ నడ్డా బుధవారం అమిత్ షాను ఆయన నివాసంలో కలిసి దాదాపు గంటసేపు మాట్లాడి, అన్ని వివరాలూ తెలిపినట్టు సమాచారం. మరోవైపు.. గ్రేస్ మార్కులు ఇచ్చిన 1500 మందికిపైగా అభ్యర్థులకు ఎన్‌టీఏ మరోసారి నిర్వహించనున్న పరీక్ష రాసే అవకాశం తమకు కూడా కల్పించాలని కోరుతూ ముగ్గురు అభ్యర్థులు దాఖలుచేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది.