Share News

Sharad Pawar: ఏ పార్టీలోనూ విలీనం కావడం లేదు.. స్పష్టతనిచ్చిన సుప్రియా సూలే..

ABN , Publish Date - Feb 14 , 2024 | 05:01 PM

శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ పార్టీలోనూ విలీనం కాబోదని ఆ పార్టీ లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సూలే తేల్చిచెప్పారు. తమ వర్గం ఏ రాజకీయ పార్టీలోనూ విలీనం కాదని..

Sharad Pawar: ఏ పార్టీలోనూ విలీనం కావడం లేదు.. స్పష్టతనిచ్చిన సుప్రియా సూలే..

శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ పార్టీలోనూ విలీనం కాబోదని ఆ పార్టీ లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సూలే తేల్చిచెప్పారు. తమ వర్గం ఏ రాజకీయ పార్టీలోనూ విలీనం కాదని.. మహా వికాస్ అఘాడిలో భాగంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని సూలే స్పష్టం చేశారు. పార్టీ అధినేత శరద్ పవార్ నివాసంలో జరిగిన సమావేశం అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈరోజు జరిగిన సమావేశం ర్యాలీకి సంబంధించిందని, ర్యాలీలో ప్రసంగించే నాయకుల పేర్ల గురించి చర్చ జరిగినట్లు ఆమె చెప్పారు. కాంగ్రెస్​లో ఎన్సీపీ విలీనం కానుందన్న వార్తల నేపథ్యంలో సుప్రియా సూలే ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు.

శరద్ పవార్ నివాసంలో జరిగిన సమావేశంలో మాజీ మంత్రులు అనిల్ దేశ్​ముఖ్, రాజేశ్ తోపేతో పాటు ఎంపీలు అమోల్ కోల్హే, శ్రీనివాస్ పాటిల్​తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్​లో తమ వర్గం విలీనమయ్యే అవకాశం కూడా లేదని, తప్పుడు వార్తలను నమ్మవద్దని అనిల్ దేశ్ ముఖ్ సూచించారు. కొత్త ఎన్నికల గుర్తు పొందాలని నిర్ణయించినట్లు తెలిపారు. కొత్త పేరు-కొత్త గుర్తుతో ప్రజల్లోకి వస్తామని పేర్కొన్నారు.


కాగా.. ఎన్సీపీకి మొత్తంగా 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా, అజిత్‌ వర్గంగా చీలిన తర్వాత ఎన్సీపీపై శరద్‌ పవార్‌ నియంత్రణ కోల్పోతూ వచ్చారు. ప్రస్తుతం ఆయన వెంట 12మంది ఎమ్మెల్యేలే ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఎవరిదనే విషయమై రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదాన్ని ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం పరిష్కరించింది. అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తించింది. ఆ పార్టీ ఎన్నికల గుర్తు గడియారం వారికే కేటాయించింది. శరద్ వర్గానికి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ- శరద్‌ చంద్ర పవార్‌ అనే పేరు ఖరారు చేసింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 14 , 2024 | 05:01 PM