Share News

Chandra Babu: సరైన టైంలో సరైన నేత!

ABN , Publish Date - Jun 08 , 2024 | 03:14 AM

నరేంద్ర మోదీ సరైన సమయంలో భారత దేశానికి లభించిన సరైన నాయకుడని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. తన విధానాలను సమర్థంగా అమలు చేయడంలో ఆయన్ను మించిన వారు లేరని.. విజన్‌ ఉన్న ఆయన హయాంలో ఏది అనుకుంటే అది సాధించగలమని ప్రశంసించారు. శుక్రవారమిక్కడ పార్లమెంటు సెంట్రల్‌ హాలులో శుక్రవారం జరిగిన ఎన్డీయే ఎంపీల సమావేశంలో ఆయన ప్రసంగించారు.

Chandra Babu: సరైన టైంలో  సరైన నేత!

  • మోదీపై చంద్రబాబు ప్రశంసల జల్లు

  • ఎన్నికల్లో రాత్రింబవళ్లూ కష్టపడ్డారు

  • మోదీకి సంపూర్ణ మద్దతు: బాబు

న్యూఢిల్లీ, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): నరేంద్ర మోదీ సరైన సమయంలో భారత దేశానికి లభించిన సరైన నాయకుడని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. తన విధానాలను సమర్థంగా అమలు చేయడంలో ఆయన్ను మించిన వారు లేరని.. విజన్‌ ఉన్న ఆయన హయాంలో ఏది అనుకుంటే అది సాధించగలమని ప్రశంసించారు. శుక్రవారమిక్కడ పార్లమెంటు సెంట్రల్‌ హాలులో శుక్రవారం జరిగిన ఎన్డీయే ఎంపీల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎన్డీయే పార్లమెంటరీ నేతగా మోదీని టీడీపీ తరఫున సగర్వంగా సమర్థిస్తున్నట్లు తెలిపారు.

ఎన్డీయేతో తమ పార్టీకి చిరకాల బంధం ఉందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మోదీ మూడు సభలు, ఒక భారీ రోడ్‌షోలో పాల్గొని ఎన్డీయే ఘన విజయానికి కారణమయ్యారని చెప్పారు. ‘సార్వత్రిక ఎన్నికల్లో మోదీ రాత్రింబవళ్లూ అలుపెరగకుండా విస్తృత ప్రచారం చేశారు. ఉదయం ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఎలా ఉన్నారో, రాత్రి ప్రచారం ముగించే ముందు కూడా అలాగే ఉండేవారు. రాష్ట్ర ప్రజలు ఎన్డీయేపై సంపూర్ణ విశ్వాసం చూపారు. 95ు సీట్లలో గెలిపించారు. నా మిత్రుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, మేం కలిసికట్టుగా కృషి చేసి ఈ విజయం సాధించాం’ అన్నారు.

  • కీలక ఘట్టంలో ఉన్నాం..

దేశ చరిత్రలో కీలకమైన ఘట్టంలో ఉన్నామని చంద్రబాబు అన్నారు. ‘గత పదేళ్లలో మోదీ నాయకత్వంలో ఎన్నో కీలక చర్యలు చేపట్టారు. అంకిత భావంతో ఆయన చేసిన కృషి వల్ల మనం ప్రపంచంలో శక్తిమంతమైన దేశంగా మారాం. నాలుగు దశాబ్దాలుగా నేను రాజకీయాల్లో ఉంటున్నాను. ఎందరో నేతలను చూశాను. కానీ అంతర్జాతీయంగా దేశాన్ని గర్వంతో తలెత్తుకునేలా చేసిన ఘనత మోదీకే దక్కుతుందని చెప్పగలను. ఆయన నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది.

ఆయన నేతృత్వంలో ప్రపంచంలో ఒకటో లేదా రెండో అతి పెద్ద ఎకానమీగా మారుతుందనే విశ్వాసం నాకుంది. జాతీయ ప్రయోజనాలు, ప్రాంతీయ ఆకాంక్షల మధ్య సమతుల్యం ఉండాలి. అప్పుడే దేశం సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. ఇది నా జీవితంలోనే అత్యంత ప్రకాశవంతమైన ఘట్టం. టీడీపీ వ్యవస్థాపకుడు, మా నాయకుడైన ఎన్డీఆర్‌ ఒకే మాట చెప్పేవారు. తనకు ఈ ఇజాలు తెలియవని, హ్యూమనిజమే (మానవతావాదమే) తన ఇజమని అనేవారు. ఆ దృక్పథాన్ని మోదీ వాస్తవంగా మారుస్తున్నారు. భారత దేశానికి ఇప్పుడు తాను అనుకున్నది సాధించేందుకు మంచి అవకాశం. ఈ అవకాశం కోల్పోతే మళ్లీ రాదు’ అని చంద్రబాబు తెలిపారు. సమావేశంలో ఆయన మోదీ పక్కనే కూర్చుకున్నారు. భేటీ జరుగుతున్నంత సేపూ మాట్లాడుకుంటూ.. నవ్వుకుంటూ కనిపించారు.


  • మోదీ జాతికి స్ఫూర్తి

  • ఆయన సారథిగా ఉన్నంతవరకు దేశం ఎవరికీ తలవంచదు : పవన్‌

భారతజాతి యావత్తుకూ మోదీ స్ఫూర్తి అని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆయన సారథిగా ఉన్నంతవరకు దేశం ఎవరికీ తలవంచదని చెప్పారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం తమకు గర్వకారణమన్నారు. ‘దేశాన్ని ఆయనెంతో ప్రభావితం చేశారు. దేశసేవకు ఆయనే మాకు ప్రేరణ. ఆయన దేశభక్తి, అభివృద్ధి పట్ల అంకిత భావం గొప్పవి.

ఆయన మార్గనిర్దేశంలోనే ఆంధ్రలో ఘనవిజయం సాధించాం’ అని ఎన్డీయే ఎంపీల సమావేశంలో తెలిపారు. ఎన్డీయే పార్లమెంటరీ సారథిగా మోదీకి పూర్తి మద్దతు ప్రకటించారు. ‘ఆయన 15 ఏళ్లు ప్రధానిగా ఉంటారని.. దేశం దిశ-దశ మారతాయని 2014లోనే చంద్రబాబు చెప్పారు. ఇప్పుడా మాట నిజమవుతోంది. ఆయన మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది.

ఆయన విజన్‌-2047తో దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన దేశంగా రూపొందాలని భారతీయులందరి ఆకాంక్ష. ఆయన పాలనలో ఆసేతుహిమాచలం భద్రంగా ఉంది. ఆర్థికంగానూ పరుగులు తీస్తోంది. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి ముందుకు సాగుతోంది. ప్రపంచ దేశాల్లో భారత ప్రతిష్ఠను ఆయన ఇనుమడింపజేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎన్డీయే ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను. మోదీ సూచనలు, సలహాలతో రాష్ట్ర సర్కారుకు ముందుకు సాగుతుంది’ అని పవన్‌ అన్నారు.

Updated Date - Jun 08 , 2024 | 03:14 AM