Share News

Haryana: జాట్లదే ప్రాబల్యం.. బీజేపీపై గుర్రు.. కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా..

ABN , Publish Date - Oct 02 , 2024 | 02:09 PM

హరియాణాలో జాట్ల ప్రాబల్యం చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ సామాజిక వర్గమే బీజేపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మరోవైపు జాట్ ఓట్లను పూర్తిగా తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.

Haryana: జాట్లదే ప్రాబల్యం.. బీజేపీపై గుర్రు.. కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా..

చండీగఢ్: హరియాణా అసెంబ్లీకి అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో జాట్ల ప్రాబల్యం చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ సామాజిక వర్గమే బీజేపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మరోవైపు జాట్ ఓట్లను పూర్తిగా తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. గంపగుత్తగా జాట్ల ఓట్లు ఎవరికి వెళ్తాయనేది ఆసక్తికరంగా మారింది.

బీజేపీపై ఆగ్రహం..

జాట్‌ల ప్రాబల్యం బీజేపీకి ఇబ్బందిగా మారింది. కాషాయ పార్టీ తమను నిర్లక్ష్యం చేసిందని, పదేళ్లపాటు ముఖ్యమంత్రి పదవిని తమ వర్గానికి దూరం చేసిందనే కోపం జాట్లలో ఉంది. రైతుల ఆందోళనలను బీజేపీ అణచివేసిందనే ఆలోచన జాట్ సామాజిక వర్గంలో బలంగా పాతుకుపోయింది. మొత్తం 90 నియోజకవర్గాల్లో 37 చోట్ల జాట్‌లదే ఆధిపత్యం. వారు ఏ పార్టీకి మద్దతుగా నిలిస్తే ఆ పార్టీ విజయం సాధించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భారత సైన్య నియామకానికి కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకం జాట్‌లకు నచ్చలేదు. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కోసం రైతులు చేస్తున్న ఆందోళనలను పట్టించుకోకపోవడం, రెజ్లర్ల ఆందోళనలను అణచివేయడానికి యత్నించడం, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను తొలగించినప్పుడు జాట్‌ నేతకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవడం ఇలాంటివన్నీ బీజేపీపై వ్యతిరేకతను పెంచాయి.


అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్‌ను మార్చి ఓబీసీ నేత సైనీని బీజేపీ తీసుకొచ్చింది. తమ వర్గానికి చెందిన నేతను ముఖ్యమంత్రిని చేయలేదనే కోపం జాట్‌ నేతల్లో మరింతగా బలపడింది. జాట్‌లు ఆగ్రహంగా ఉన్నారని గుర్తించిన బీజేపీ.. జాటేతర ఓట్లపై దృష్టి సారించింది. దీంతో జాటేతర అభ్యర్థులకు అధికంగా టికెట్లిచ్చింది. 2019లో 19, 2014లో ఇచ్చిన 24 మంది జాట్ అభ్యర్థులను బరిలోకి దింపగా.. ఈసారి కేవలం 16 మందినే నిలబెట్టింది. హరియాణాలో ఓబీసీలు 30 శాతం ఉంటారు. గణనీయ సంఖ్యలో ఉన్న ఓబీసీ ఓటర్లను ఆకట్టుకోవడం ద్వారా జాట్ల ద్వారా వచ్చే నష్టాన్ని భర్తీ చేయొచ్చని బీజేపీ భావిస్తోంది.

వారు కాంగ్రెస్ వైపే..

కాంగ్రెస్‌కు జాట్‌లతోపాటు ముస్లింలు మద్దతుగా నిలుస్తున్నారు. బీజేపీ ధోరణి ఆ పార్టీకి కలిసొస్తోంది. జాట్లు, ముస్లింల ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్‌కు పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


తిరుగుబాటు సమస్య

టికెట్ ఆశించి భంగపడ్డ వారు సొంత పార్టీలపై తిరుగుబాటు చేసి స్వతంత్రంగా బరిలోకి దిగారు. దాదాపు 20 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు తిరుగుబాటుదారులు తలనొప్పిగా మారారు. బలమైన పోటీనిస్తే ఓట్లు చీలి ఎవరికి లాభిస్తుందోననే ఆందోళన అన్ని పార్టీల్లో ఉంది.

Haryana Polls: హరియాణా బీజేపీ.. ముచ్చటగా మూడోసారికి, ఆ మూడే కీలకం

Varanasi: ఆలయాల వద్ద ఉద్రిక్తత.. సాయిబాబా విగ్రహాల తొలగింపు

Viral News: చెత్తలో దొరికింది.. ఖరీదు రూ.55 కోట్లు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 02 , 2024 | 02:13 PM