Share News

Supreme Court : ఎవరికీ ప్రత్యేక మినహాయింపు లేదు

ABN , Publish Date - May 17 , 2024 | 04:33 AM

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసిన విషయంలో తామేమీ ప్రత్యేక మినహాయింపు ఇవ్వలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘ఎవరికీ ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. ఏది న్యాయసమ్మతమని భావించామో దానిని మేం మా తీర్పులో స్పష్టం చేశాం’ అని తెలిపింది.

Supreme Court : ఎవరికీ ప్రత్యేక మినహాయింపు లేదు

‘కేజ్రీవాల్‌కు స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌’.. అమిత్‌షా వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, మే 16: ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసిన విషయంలో తామేమీ ప్రత్యేక మినహాయింపు ఇవ్వలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘ఎవరికీ ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. ఏది న్యాయసమ్మతమని భావించామో దానిని మేం మా తీర్పులో స్పష్టం చేశాం’ అని తెలిపింది. తాత్కాలిక బెయిల్‌ అంశంలో కేజ్రీవాల్‌కు కోర్టు ప్రత్యేక ట్రీట్‌మెంట్‌ ఇచ్చిందని దేశంలో పలువురు భావిస్తున్నారంటూ కేంద్ర హోంమంత్రి, బీజేపీ కీలకనేత అమిత్‌షా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించింది.

ఢిల్లీ మద్యం విధానం కేసులో ఈడీ తనను అరెస్టు చేయటాన్ని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ దింపకర్‌దత్తాలతో ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. అమిత్‌షా పేరు ప్రస్తావించకుండా ఆయన చేసిన వ్యాఖ్యలను ఉదహరించారు.

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. తాము ఆ అంశంలోకి వెళ్లదల్చుకోలేదని చెబుతూనే, ఎవరికీ ఎలాంటి మినహాయింపు ఉండబోదని తెలిపింది. అయితే, తీర్పుపై విమర్శనాత్మక విశ్లేషణను తాము స్వాగతిస్తామని ధర్మాసనం పేర్కొనటం విశేషం.

కాగా, ఈడీ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఆమ్‌ ఆద్మీ పార్టీకి (ఆప్‌) ఓట్లు వేసి గెలిపిస్తే జూన్‌2న తాను తిరిగి జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండబోదని ఇటీవల ఓ సభలో కేజ్రీవాల్‌ చెప్పారని పేర్కొన్నారు.


ఈ వ్యాఖ్యల ద్వారా కేజ్రీవాల్‌ బెయిల్‌ షరతులను ఉల్లంఘించారన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఆయన జూన్‌2న లొంగిపోవాలని మా ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. అది సుప్రీంకోర్టు ఆదేశం. చట్టబద్ధ పాలనకు అదే ఆధారం.

కేసు విషయంలో ఆయన ఏమీ మాట్లాడకూడదని మేం చెప్పలేదు. కాబట్టి ఆయన ఏం అనుకుంటున్నారనేది మాకు అనవసరం. దానిపై మేమేమీ చెప్పలేం’ అని వ్యాఖ్యానించింది.

ఆప్‌ను గెలిపిస్తే తాను జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించలేదని, కావాలంటే దానిపై ఆయన అఫిడవిట్‌ సమర్పిస్తామని సింఘ్వీ తెలిపారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై తిహాడ్‌ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు జూన్‌ 1 వరకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్‌పై త్వరలో ప్రాసిక్యూషన్‌ ఫిర్యాదును నమోదు చేస్తామని సుప్రీంకోర్టుకు ఈడీ తెలిపింది.

Updated Date - May 17 , 2024 | 04:33 AM